logo

సరికొత్త పాఠాలతో మొదలు

ఆట-పాటలతో వేసవి సెలవులను సరదాగా గడిపేసిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సరిపడా నోటు పుస్తకాలను, 70 శాతం వరకు పాఠ్యపుస్తకాలను స్కూళ్లకు పంపేసింది.

Published : 13 Jun 2024 03:44 IST

వారంపాటు బడుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే 

ట-పాటలతో వేసవి సెలవులను సరదాగా గడిపేసిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సరిపడా నోటు పుస్తకాలను, 70 శాతం వరకు పాఠ్యపుస్తకాలను స్కూళ్లకు పంపేసింది. బ్యాగులు, బెల్టులు, డిక్షనరీలు, ఏకరీతి దుస్తులు వంటివి కొద్దిరోజుల్లో వస్తాయని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు తెరవగానే పుస్తకాలతో కుస్తీ పట్టించడం కాకుండా ‘ఎకో క్లబ్స్‌ ఫర్‌ మిషన్‌ లైఫ్‌’ పేరిట వారం పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో వీటిని పకడ్బందీగా నిర్వహించే దిశగా ఉపాధ్యాయులు దృష్టిసారించారు. కొత్తప్రభుత్వం కొలువు తీరిన మరుసటి రోజునే పాఠశాలలు తెరుస్తున్నారు. దీంతో గతం కంటే భిన్నంగా ఉత్సాహపూరిత వాతావరణంలో కార్యక్రమాలను కొనసాగించేందుకు సమాయత్తమవుతున్నారు. 

  • ఈనెల 13న ‘ఆరోగ్యకర జీవనం’ పేరిట ప్రకృతిలో నడక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దగ్గర్లోని గ్రామం లేదా పర్యటక ప్రదేశానికి విద్యార్థులను సమూహాలుగా తీసుకువెళతారు. పర్యావరణం గురించి ఉపాధ్యాయులు తెలియజేస్తారు. చరిత్ర, భౌగోళికం, ఆచారాలు, సంప్రదాయాలు, హస్తకళలు వంటివాటిపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొక్కలు నాటిస్తారు.
  • 14న ‘చెత్తని తగ్గించండి’ పేరిట ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. తడి-పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించడం, వాటిని విడివిడిగా డబ్బాల్లో వేయడం, కంపోస్ట్‌ పిట్లు నిర్మించి వాటిలో వంటగదుల్లో ఉత్పత్తి అయ్యే తడిచెత్తని వేయించడం వంటివి చేయిస్తారు. వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం వంటివాటిపై అవగాహన కల్పిస్తారు. ఇందుకు పారిశుద్ధ్య సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆదేశాలొచ్చాయి.
  • 15న ఈ-వ్యర్థాలను తగ్గించే కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ-వ్యర్థాలను పారవేయడం, పాత ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను వదిలేందుకు ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు మన గ్రహంపై ఈ వ్యర్థాల ప్రభావం చూపించే కార్యక్రమాలను నిర్వహిస్తారు. 
  • 18న సుస్థిర ఆహార వ్యవస్థలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన సిబ్బందితో కలిసి కిచెన్‌గార్డెన్లు ఏర్పాటు చేయిస్తారు. స్థలం అందుబాటులో లేకపోతే పాతబకెట్లు, ప్లాస్టిక్‌ సీసాలు, మట్టికుండల్లో మొక్కలు పెంచేలా ప్రోత్సహిస్తారు. పురుగు మందులు వినియోగించకుండా సహజ పద్ధతులు ఆచరించేలా చైతన్యం కల్పిస్తారు. 
  • 19న విద్యుత్తు పొదుపుపై అవగాహన కల్పిస్తారు. పాఠశాల స్థాయిలో శక్తిబృందాలు ఏర్పాటు చేస్తారు. వృథాగా లైట్లు వెలగకుండా, ఫ్యాన్లు తిరగకుండా చూడ్డం వీరి బాధ్యత. 
  • 20న నీటిసంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పైపుల లీకేజీలు అరికట్టడం, కొళాయిలు సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తారు. నీటిస్వచ్ఛతపై పరీక్ష చేయిస్తారు. వర్షపునీటి నిల్వపై అవగాహన కల్పిస్తారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని