logo

ఘాట్‌ రోడ్లో ఘోరం..

పాడేరు ఘాట్‌రోడ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఘటన వివరాలిలా ఉన్నాయి. 

Published : 13 Jun 2024 03:47 IST

లారీ ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం 
జాతర నుంచి తిరిగెళ్తుండగా దుర్ఘటన 

పాడేరు ఘాట్‌రోడ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఘటన వివరాలిలా ఉన్నాయి. 

పాడేరు/ పట్టణం, న్యూస్‌టుడే: పెదబయలులో ఈ నెల 11న జరిగిన జాతరలో సౌండ్‌ సిస్టమ్, డ్యాన్స్‌బేబీ డ్యాన్స్‌ ప్రోగాం ప్రదర్శనకు ఎలమంచిలి నియోజకవర్గం నుంచి ఓ బృందం వచ్చింది. తిరిగి వెళ్లేటప్పుడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ సభ్యులు ప్రయాణిస్తున్న లారీ ఘాట్‌రోడ్డులోని 12వ మైలు సమీపంలోకొచ్చింది. అకస్మాత్తుగా మలుపు తారసపడడంతో డ్రైవర్‌ అంచనా వేయలేకపోయాడు. అప్పటికీ బ్రేక్‌పై కాలు వేసినా ఫెయిల్‌ కావడంతో లారీ రక్షణ గోడకు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారిపై సౌండ్‌ బాక్సులు మీద పడ్డాయి. ఈ ఘటనలో సామగ్రి సహా కొందరు లోయలోకి దొర్లిపోయారు. వీరిలో అచ్యుతాపురం పరిసర ప్రాంతాలకు చెందిన లక్ష్మణ్‌(25), హరి(30), అశోక్‌(30)లు మృతి చెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. వారి ఆర్తనాదాలు విన్న ప్రయాణికులు సహాయక చర్యలకు ఉపక్రమించారు. 108 వాహనానికి సమాచారం అందించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు పొక్లెయిన్‌తో ఘటన స్థలికి చేరుకున్నారు. ఎస్సై లక్ష్మణ్‌ అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ సునీత, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాడేరు జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. తీవ్ర గాయాలపాలైన వారిని విశాఖ తరలించాలని డీసీహెచ్‌ఎస్‌ కృష్ణారావును ఆదేశించారు. 

గాయాలపాలైన వారు:  సేనాపతి గణేష్‌ (షేకిళ్లపాలెం), కంకిపూడి పవన్‌ (సోమలింగపాలెం), ఆడారి నితిన్‌ (కొత్తపాలెం, ఎలమంచిలి మండలం), పెయ్యల భారతి, లంక సునీత, లంక సూర్యదీక్షిత (4 సంవత్సరాల చిన్నారి), లంక శ్రీను (చీమలాపల్లి, అచ్యుతాపురం మండలం), చందక రాజు, గొర్లి రోహిత్‌కుమార్, (పూడి గ్రామం), భీముని రవి (చాకలిపాలెం), విదర్ల మోహన్‌ (ధర్మవరం). 


రోడ్డున పడిన పేద కుటుంబాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పాడేరు ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం అచ్యుతాపురం మండలంలో విషాదాన్ని నింపింది. అందరికీ ఆనందాన్ని అందించే సౌండ్స్‌ సిస్టమ్స్‌ను తీసుకొని వెళ్లి తిరిగి వస్తున్న వ్యాను బోల్తా పడడంతో అచ్యుతాపురానికి చెందిన యువకుడు దుర్మరణం చెందగా అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతిచెందిన అచ్యుతాపురానికి చెందిన పంచదార్ల లక్ష్మణ్‌ (25)కు అయిదు నెలల కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టాడనే ఆనందం తీరకుండానే అందనంత లోకాలకు వెళ్లిపోయాడు. అందరిలోనూ మంచిగా ఉండే లక్ష్మణ్‌ మృతిచెందాడనే విషయం తెలిసి అచ్యుతాపురంలో స్నేహితులు, బంధువులు, కన్నీరుపెట్టుకున్నారు. ఇదే వాహనంలో ఇంటికి వస్తున్న చీమలాపల్లికి చెందిన పెయ్యిల భారతి, లంక సునీత, లంక సూర్యదీక్షత, లంక శ్రీను, గొర్లె రోహిత్‌కుమార్‌ గాయపడి చికిత్స పొందుతున్నారు. సౌండ్స్‌సిస్టమ్స్‌ తీసుకొస్తున్న వ్యాను బోల్తాపడిందని తెలియడంతో బంధువులు, స్నేహితులు పాడేరు, చోడవరం ఆసుపత్రులకు పరుగులు తీశారు. 


చెరువులో పడి అక్కాచెల్లెళ్ల మృతి

అడ్డతీగల, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకం కింద తవ్విన చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. అడ్డతీగల మండలం సోమన్నపాలెంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. సోమన్నపాలెం గ్రామానికి చెందిన వంతల దుర్గా కావ్యశ్రీ (13), వంతల సాహితీరెడ్డి (10) అక్కాచెల్లెళ్లు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీరిద్దరూ తమ పొలానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో సాహితీరెడ్డి కాలకృత్యాలు తీర్చుకుని ప్రమాదవశాత్తు చెరువులో పడిపోగా, చెల్లిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ అక్క దుర్గా కావ్యశ్రీ చెరువులోకి దిగింది. ఇద్దరు చిన్నారులు మునిగిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సాయంతో చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే అక్క మృతి చెందగా,  అడ్డతీగల ఆసుపత్రికి తరలించేలోపు చెల్లి మృతిచెందింది. ఈ ఘటనపై దుశ్చర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని