logo

కూటమి కొలువుతీరగ.. ఊరూరా పండగ

అనకాపల్లి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు, 24 మండల కేంద్రాల్లో చంద్రన్న ప్రమాణ స్వీకార వీక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల తెదేపా, జనసేన నేతలు కూడళ్లలో డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేసుకున్నారు.

Updated : 13 Jun 2024 04:27 IST

బాణసంచా, కేకులతో కార్యకర్తల సందడి
ఈనాడు, అనకాపల్లి

జగన్‌ నిరంకుశ పాలనకు తెరపడి వారమైంది. తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం బుధవారం కొలువుతీరింది. నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కనుల పండగను చూసేందుకు కూటమి కార్యకర్తలు గన్నవరానికి పెద్దఎత్తున తరలివెళ్లారు. అక్కడి వెళ్లలేని వారి కోసం నియోజకవర్గం, మండల కేంద్రాల్లో టీవీలు, డిజిటల్‌ తెరలు ఏర్పాటుచేశారు. అనకాపల్లి కలెక్టర్‌ రవి, అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ సునీత ఆదేశాలతో మండల పరిషత్, వెలుగు, పురపాలక కార్యాలయాలు, ముఖ్య కూడళ్ల వద్ద టీవీలు, డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేసి ప్రజలంతా వీక్షించే సదుపాయం కల్పించారు. ప్రమాణస్వీకార పండగను ఊరూరా తిలకించారు. తమ నేతలు ప్రమాణం చేస్తున్నప్పుడు కూటమి కార్యకర్తలు కేకులు కోసి సంబరాలు జరుపుకొన్నారు.

నకాపల్లి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు, 24 మండల కేంద్రాల్లో చంద్రన్న ప్రమాణ స్వీకార వీక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్ల తెదేపా, జనసేన నేతలు కూడళ్లలో డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేసుకున్నారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంతో పాటు, నాలుగు రోడ్ల కూడలిలో డిజిటల్‌ తెరలపై ప్రమాణ స్వీకార పండగను ప్రదర్శించారు. అల్లూరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం అంబేడ్కర్‌ కూడళ్లలో, అరకులోయ గిరిజన మ్యూజియం ఎదుట బహిరంగ ప్రదేశాల్లో డిజిటల్‌ తెరలతో ప్రదర్శించారు. చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెరల ముందు కూటమి కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో హర్షం తెలిపారు. తెరల ముందే కేకులు కోసి, మిఠాయిలు పంచిపెట్టి ఒకరినొకరు అభినందించుకున్నారు. అంధకారం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామంటూ అనకాపల్లిలో నినాదాలు చేస్తూ కనిపించారు. దశాబ్దంన్నర తర్వాత రంపచోడవరంలో కూటమి అభ్యర్థిశిరీషాదేవి గెలవడంతో అక్కడ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి సందడి చేశారు. మధ్యాహ్నం స్థానికంగా పార్టీ కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని తలపించారు. 


తెలుగు మహిళల సంబరాలు...

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాడుగుల మండలం కె.జె.పురం గ్రామంలో తెలుగు మహిళలు సంబరాలు చేశారు. మాడుగుల నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో ముందుగా కేక్‌ కట్‌ చేసి అందరికి పంపిణీ చేశారు. నాగమణి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని