logo

అమ్మాలనుకున్నారంతే!

సొమ్ముల కోసం వైకాపా ప్రభుత్వం ఎండాడలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన విలువైన స్థలాన్ని ఎలాగైనా విక్రయించాలని నిర్ణయించింది.

Published : 13 Jun 2024 04:06 IST

ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడే అధిక ప్లాట్ల విక్రయం
రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలంపై అనుమానాలు
ఈ నెల 13న జరిగే వేలం వాయిదా!?

ఈనాడు, విశాఖపట్నం : సొమ్ముల కోసం వైకాపా ప్రభుత్వం ఎండాడలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన విలువైన స్థలాన్ని ఎలాగైనా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయాన్ని ఆ సంస్థ  ఎంచుకోవడం గమనార్హం. విక్రయించిన మొత్తం ప్లాట్లలో సగానికిపైగా స్థలాలను ఆ సమయంలోనే ఇతరులకు అమ్మడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీ నిర్ణయించిన ధర కన్నా కేవలం రూ.500 అదనంగా పాడిన వారికి అమ్మేశారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న నిర్వహించే వేలాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ విలువైన స్థలంపై ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. 

ఆది నుంచి అనాసక్తి: రాజీవ్‌ స్వగృహకు చెందిన 57 ఎకరాల స్థలంలోని ప్లాట్ల కొనుగోలుకు ముందు నుంచీ ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మొదట్లో ఆ ప్రాంతమంతటినీ రెండు, మూడు బిట్లుగా చేసి అమ్మాలనుకున్నప్పటికీ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ నిర్ణయాన్ని విరమించుకొని 78 చిన్న ప్లాట్లుగా మార్చి విక్రయించాలని నిర్ణయించారు. అదే సమయంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చిన్న, మధ్యతరగతి ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని విక్రయించడం తగదని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కొద్ది రోజుల పాటు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. గత ఏడాది చివరిలో కేసు ఎత్తివేయడంతో తిరిగి సంస్థ విక్రయానికి పూనుకుంది. ఎం.ఎస్‌.టి.ఎస్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. పలుమార్లు చేపట్టిన వేలంలో 39 ప్లాట్లను అమ్మారు. 

ఆ సమయంలోనే: విక్రయించిన మొత్తం ప్లాట్లలో ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు అమ్మినవే ఎక్కువగా ఉండడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో రెండు ప్లాట్లను విక్రయించగా 2024 జనవరిలో 3, ఫిబ్రవరిలో 6, మార్చిలో 3, ఏప్రిల్‌లో 11, మేలో 12 ప్లాట్లను అమ్మారు. అంటే ఎన్నికల కోడ్‌ అమల్లోనే 26 ప్లాట్లను విక్రయించారు. విక్రయాలకు ఉంచిన ప్లాట్లకు రాజీవ్‌ స్వగృహ చదరపు గజం రూ.60 వేలుగా నిర్ణయించింది. వేలంలో పాల్గొన్న ఆసక్తిదారులు రూ.60,500లకు దక్కించుకోవడం గమనార్హం. విక్రయించిన మొత్తం ప్లాట్లలో 29 ప్లాట్లను  ప్రతిపాదించిన ధర కన్నా కేవలం రూ.500 అదనంగా పాడి కొనడం విశేషం. అమ్ముడైన వాటిల్లో 46వ నంబరు ప్లాటును (997 గజాలు)ఓ సంస్థ  గజం రూ.84వేలకు కొనుగోలు చేసింది. ఆతర్వాత 47వ ప్లాటుకు ఓ వ్యక్తి రూ.77,500 చొప్పున 1248.65 గజాలు కొన్నారు. 72వ నంబరు ప్లాటును ఒకరు గజం రూ.74,500లకు కొన్నారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు కొన్నవన్నీ రూ.60,500కే అమ్మారు. ఈ డబ్బులను అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలోని ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల కొనుగోలుకు కేటాయించారన్న విమర్శలు వచ్చాయి.

అభ్యంతరం: విలువైన స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు కాకుండా ఇతరులకు విక్రయించడంపై ముందునుంచీ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభ్యంతరం తెలుపుతున్నారు. గతంలో మధ్యతరగతి ప్రజల కోసం కేటాయించిన స్థలాలను వైకాపా ప్రభుత్వం స్వార్థపు ఆలోచనతో అమ్మకానికి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇక్కడ జరుగుతున్న విక్రయాలపై కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా అధిక సంఖ్యలో అమ్మకాలు జరగడాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఈ గురువారం జరగాల్సిన ప్లాట్ల వేలాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని