logo

విధేయతకు పట్టం

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పాయకరావు పేట తెదేపా ఎమ్మెల్యే వంగలపూడి అనిత...  కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు.

Updated : 13 Jun 2024 04:30 IST

అనితను వరించిన అమాత్య యోగం

నక్కపల్లి, పాయకరావుపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పాయకరావు పేట తెదేపా ఎమ్మెల్యే వంగలపూడి అనిత...  కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. గత పదేళ్లలో  అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సాధించిన విజయానికి ఇది నిదర్శనం. ఆరంభంలో ఓ ఎమ్మెల్యేగా మాత్రమే జిల్లాకు పరిచయం ఉన్న అనిత ఈ పదేళ్ల కాలంలో ఏకంగా రాష్ట్రస్థాయిలో  కీలక   నేతగా ఎదగడం వెనుక ఆమె సమర్ధత..పార్టీ పట్ల విధేయత ఉన్నాయి. 

  • జిల్లాలో సీనియర్‌ నేతలున్నా, వారిని కాదని అనితకు మాత్రమే మంత్రి పదవి కేటాయించడం తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి ఆమెపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులతోపాటు, ఐటీ మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు వద్ద తన విజ్ఞతను ప్రదర్శించి నిధులు రాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. 2019 ఎన్నికలకు ముందు అనుకోని విధంగా అసమ్మతిని ఎదుర్కోగా.. చంద్రబాబు సూచన మేరకు కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు పాయకరావుపేట నుంచి తెదేపా తరఫున బరిలో దిగిన బంగారయ్య సైతం ఓటమిని చవి చూశారు. దీంతో తిరిగి ‘పేట’ నియోజకవర్గానికి వచ్చారు. అనంతరం ఆమె పనితీరును గుర్తించిన అధినేత చంద్రబాబు తెదేపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ అయిదేళ్లలో వైకాపా చేసిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేశారు. ఈ క్రమంలో అనేక కేసులు ఆమెపై నమోదయ్యాయి. దీంతో అధినేత చంద్రబాబు వద్ద మంచి పోరాట నాయకురాలిగా పేరు పొందారు. లోకేశ్‌ నియోజకవర్గంలో సాగించిన యువగళం పాదయాత్రను విజయవంతం చేశారు. 
  • పార్టీ తరఫున ఓ వైపు ప్రజా పోరాటాలు చేస్తూనే, ఇన్‌ఛార్జిగా నియోజకవర్గంపైనా దృష్టి సారించారు. 2019లో ఎక్కడైతే అసమ్మతిని ఎదుర్కొన్నారో అదే చోట తనకు అనుకూలంగా మద్దతు కూడగట్టారు. నాయకులను, శ్రేణులను సమన్వయం చేసుకుని అందరి మద్దతు సాధించారు. ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి తన ప్రత్యర్థి..వైకాపా అభ్యర్థి జోగులుపై గత రికార్డులను తిరగరాస్తూ.. భారీ మెజార్టీతో(43,727) గెలిచి చరిత్ర సృష్టించారు. మంత్రివర్గ కూర్పులో ఎంతో పోటీ ఉన్నా..విధేయత, సమర్ధతతో క్యాబినెట్‌లో తన పేరు ఖరారు చేసుకోగలిగారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని