logo

చంద్రబాబు ప్రమాణ స్వీకారం మరో చరిత్రకు శ్రీకారం!!

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెదేపా కూటమిని గెలిపించిన ప్రజలు ఆశించిన సమయం ఆసన్నమవగానే...జిల్లా అంతటా కోలాహలం నిండిపోయింది.

Published : 13 Jun 2024 04:18 IST

జిల్లాలో పలు చోట్ల ప్రత్యక్ష ప్రసార కేంద్రాలు
తెరల వద్ద హారతులు పట్టిన అభిమానులు
కలెక్టరేట్‌లో తిలకించిన అధికారులు
ఈనాడు, విశాఖపట్నం

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో తెదేపా కూటమిని గెలిపించిన ప్రజలు ఆశించిన సమయం ఆసన్నమవగానే...జిల్లా అంతటా కోలాహలం నిండిపోయింది. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారాన్ని తిలకించిన ప్రజలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చీకటి పాలన అంతమయిందని... ఇక అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతుందని పలువురు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మరో చరిత్ర ఆరంభమయినట్లేనని తెలిపారు.  

బుధవారం కృష్ణాజిల్లా కేసరపల్లిలో నిర్వహించిన సభలో చంద్రబాబుతో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరమంతటా పండగ వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష ప్రసార కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాంగం ఏడు నియోజకవర్గాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు తెదేపా, జనసేన, భాజపా కార్యాలయాల్లో భారీ తెరలు ఏర్పాటు చేశారు. కొన్ని సినిమా థియేటర్లు, కల్యాణ మండపాల్లోనూ ప్రదర్శించారు. అపార్టుమెంట్ల వద్ద ప్రమాణ స్వీకారోత్సవాన్ని సందడి వాతావరణంలో తిలకించారు. చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టడంతో అనేక చోట్ల ప్రజలు రోడ్లమీదికొచ్చి మిఠాయిలు పంచుతూ, బాణసంచా కాల్చుతూ డీజే నృత్యాలతో సందడి చేశారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని తిలకించి జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై పవన్‌ కల్యాణ్, జనసేన, భాజపా అంటూ నినాదాలు చేశారు. భారీ తెరలవద్ద హారతులు పట్టారు.

  • సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తూర్పు నియోజవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆసాంతం తిలకించి సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ జయజయధ్వానాలు చేశారు. చంద్రబాబుతో గవర్నర్‌ ప్రమాణం చేయించే సందర్భంలో మహిళలు తెరముందుకొచ్చి పూలవర్షం కురిపించారు. మరికొందరు అభిమానులు హారతులు పట్టి అభిమానం చాటుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణం చేసినప్పుడూ హారతులిచ్చారు. అనంతరం విజయ చిహ్నం చూపిస్తూ మహిళలు సందడి చేశారు.
  • చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో దక్షిణ నియోజకవర్గం రైల్వేన్యూకాలనీలో పార్టీ అభిమానులు సంబరాలు చేశారు. న్యూకాలనీ రోడ్డు పొడవున  నృత్యాలతో, డీజే పాటలతో సందడి నెలకొంది. రైల్వేన్యూకాలనీ కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. జై చంద్రబాబు అంటూ నినదించారు. మీడియా కోఆర్డినేటర్‌ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. న్యూకాలనీలోని లక్ష్మీ గణేశ ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు.
  • పశ్చిమ నియోజకవర్గంలోని నరసింహ థియేటర్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారితో థియేటర్‌ నిండిపోయింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రమాణం చేస్తున్నప్పుడు అభిమానుల కేరింతలతో థియేటర్‌ మారుమోగిపోయింది. 
  • సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని  కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ మల్లికార్జునతో పాటు డీఆర్‌వో మోహన్‌కుమార్, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్, అధికారులు పాల్గొని వీక్షించారు. ప్రజలు చూసేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
  • అక్కయ్యపాలెంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన కేంద్రానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి తిలకించారు.
  • డాబాగార్డెన్స్‌ డ్వాక్రా బజారు, 57వ వార్డులోని కాయిత పైడయ్య కల్యాణ మండపం, వేపగుంట కమ్యూనిటీ హాలు, గాజువాక చైతన్యనగర్‌ కేంద్రాలకూ పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. పీఎం పాలెంలోని జీవీఎంసీ కమ్యూనిటీ హాలులో వీక్షించేందుకు తరలివచ్చారు. గాజువాక తెదేపా కార్యాలయానికి అభిమానులు తరలివచ్చారు. రామ్‌నగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో వీక్షణకు వీలుగా తెరలు ఏర్పాటు చేశారు. సింధియాలో టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని