logo

రైతులకు అండగా.. పరిశోధనల్లో మేటిగా..

అనకాపల్లి పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న ఇరువురు మహిళా శాస్త్రవేత్తలకు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60వ వార్షికోత్సవాలు బుధవారం గుంటూరులో నిర్వహించారు.

Published : 14 Jun 2024 03:04 IST

అనకాపల్లి శాస్త్రవేత్తలకు రాష్ట్రస్థాయి అవార్డులు

అవార్డు అందుకుంటున్న శాస్త్రవేత్తలు శ్రీదేవి, రామలక్ష్మి 

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న ఇరువురు మహిళా శాస్త్రవేత్తలకు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60వ వార్షికోత్సవాలు బుధవారం గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ విధానంలో చెరకు సాగుపై చేసిన పరిశోధనల నిమిత్తం ఇచ్చే డాక్టరు వీఆర్‌ దుర్గమాంబ అవార్డు స్థానిక పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టరు పి.శ్రీదేవిని వరించింది. ఉత్తమ వ్యవసాయ శాస్త్రవేత్తకు ఇచ్చే ఏవీ కృష్ణయ్య అవార్డు స్థానిక పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టరు సీహెచ్‌ఎస్‌ రామలక్ష్మికి లభించింది. వీరికి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

సేంద్రియ ఎరువుల తయారీ: మృత్తికా శాస్త్రం విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రామలక్ష్మి ఆధ్వర్యంలో పోషకాలు సమృద్ధిగా గల సేంద్రియ ఎరువులను తయారీ చేశారు. కూరగాయల వ్యర్థాలు, చెరకు చెత్త, పిప్పి, మడ్డితో సేంద్రియ ఎరువులను తయారీ చేశారు. సేంద్రియ విధానంలో వర్షాధార చెరకు సాగుపై ఈమె చేసిన పరిశోధనలు ఫలించాయి. వరి తర్వాత సేంద్రియ విధానంలో పెసర, మొక్కజొన్న, కూరగాయల సాగుపై గత మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయి. మరో రెండేళ్లు పరిశోధనలు చేయాల్సి ఉందని రామలక్ష్మి తెలిపారు.

బెల్లం తయారీలో మునగ రసం: శ్రీదేవి పంట కోత పరిజ్ఞాన విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. బెల్లం తయారీలో రైతులు రంగు కోసం రసాయనాలు ఉపయోగిస్తారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం మునగ ఆకు లేదా కలబంద రసం వేసి మంచి రంగు, నాణ్యత కలిగిన బెల్లం తయారీ చేయవచ్చని ఈమె నిరూపించారు. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గుతుంది. చెరకులో కలుపు నివారణకు రసాయనిక మందులు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివల్ల వాతావరణం కాలుష్యం అవుతుంది. దీంతో కలుపు తీసేందుకు చిన్న చిన్న యంత్రాలు రూపొందించారు. చెరకు చెత్త, పిప్పిని వృథాగా వదిలేస్తారు. వీటితో అందమైన కప్పులు, ప్లేట్లు తయారీ చేసే విధానాన్ని శ్రీదేవి రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని