logo

వైకాపా శ్రేణులకు అండగా ఉంటాం: సుబ్బారెడ్డి

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, అధికార తెదేపా ఎలాంటి దాడులకు పాల్పడినా వైకాపా నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి అన్నారు.

Published : 14 Jun 2024 03:09 IST

సుబ్బారెడ్డిని కలిసిన మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు 

మధురవాడ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, అధికార తెదేపా ఎలాంటి దాడులకు పాల్పడినా వైకాపా నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ నగర పరిధి ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులోని వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో గురువారం ఆయన సమావేశమయ్యారు. అధికార పార్టీ ఏ విధమైన ప్రలోభాలకు గురి చేసినా కార్పొరేటర్లు లొంగకుండా ఉండాలన్నారు. ఈ విషయంలో పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్న విషయం గుర్తెరగాలన్నారు. ఎన్డీఏకు పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజారిటీ లేనందున త్వరలో జరగనున్న సమావేశాలు కీలక మవుతాయన్నారు. వైకాపాకు 15 మంది ఎంపీలు ఉన్నారని, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.గురువులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మధురవాడ ఐటీ హిల్స్‌ రోడ్డులోని సుబ్బారెడ్డి అతిథి గృహంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వి.గణేష్‌కుమార్, కన్నబాబురాజు, నాయకులు కె.కె.రాజు తదితరులు ఆయన్ను కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని