logo

ప్రాణదాతలూ.. ముందుకు రండి!

అత్యవసర పరిస్థితుల్లో వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. జిల్లాలో విక్టోరియా ఘోసాసుపత్రి, సంజీవని, లయన్స్‌ క్లబ్‌ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది.

Updated : 14 Jun 2024 05:17 IST

రక్తనిధి కేంద్రాల్లో తగ్గిన నిల్వలు
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం : అత్యవసర పరిస్థితుల్లో వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. జిల్లాలో విక్టోరియా ఘోసాసుపత్రి, సంజీవని, లయన్స్‌ క్లబ్‌ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలు, ఎండ తీవ్రత అధికంగా ఉండటం, వేసవి సెలవుల నేపథ్యంలో కళాశాలలు మూతపడటంతో ఎక్కడా రక్తదాన శిబిరాలు నిర్వహించలేదు. దాతలు కూడా ముందుకు రాకపోవడంతో మూడు నెలలుగా రక్తనిల్వలు భారీగా తగ్గిపోయాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 16 శిబిరాలు నిర్వహించేందుకు ‘ఈ-రక్త్‌కోస్‌’ వెబ్‌సైట్‌లో పలువురు నమోదు చేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు దాతలను ప్రోత్సహించి నిల్వలు పెంచేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుంటే ముప్పు తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
శిబిరాలు జరగక ఇబ్బందులు: కేజీహెచ్‌లో రోజుకు కనీసం 30 నుంచి 40 యూనిట్ల రక్తం అవసరం. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఇతర భద్రతా దళాలు ఎన్నికల విధుల్లో ఉండటంతో శిబిరాలు నిర్వహించలేదు. అక్కడి వైద్యులు, విభాగాల వారీగా వైద్య విద్యార్థులందరూ రక్తమిచ్చారు. ఆ రక్తనిధిపై 221 మంది సికెల్‌సెల్, 104 తలసేమియా, 10 మంది హిమోఫిలియా బాధితులు ఆధారపడి ఉన్నారు. జిల్లాతోపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం నుంచి బాధితులు వస్తుంటారు. వారికి క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాలి. నిల్వలు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసరమైతే బయటి నుంచి తెప్పిస్తున్నారు. ‘రక్తదాతల దినోత్సవం సందర్భంగా శిబిరాలు నిర్వహిస్తే కొన్ని యూనిట్లు సమకూరుతాయి. సరిపడా నిల్వలు సమకూరేందుకు మరో నెల రోజులు పడుతుందని అంచనా వేస్తున్నాం’ అని కేజీహెచ్‌ రక్తనిధి కేంద్రం వైద్యులు ఈవీఎస్‌ నాయుడు తెలిపారు.  
ఇందులో చూసుకోవచ్చు: రక్తనిల్వల సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఈ-రక్త్‌కోస్‌’ అనే వెబ్‌సైట్, యాప్‌ తీసుకొచ్చింది. దీని ద్వారా ఏ రక్తనిధి కేంద్రంలో.. ఏయే వర్గాల (గ్రూప్‌) నిల్వలున్నాయి? సంప్రదించాల్సిన వివరాలు.. తదితరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్లడ్‌ బ్యాంకుల వివరాలు ఇందులో ఉంటాయి. 
18 కేంద్రాల్లో ‘సున్నా’: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలతో కలిపి మొత్తం 26 రక్త నిల్వ కేంద్రాలున్నాయి. రెడ్‌క్రాస్, ఏఎస్‌ రాజా, లయన్స్‌ క్లబ్, రోటరీ క్లబ్, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్, సంజీవని వంటి సంస్థలు బ్లడ్‌ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ‘ఈ-రక్త్‌కోస్‌’ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం మేరకు 18 కేంద్రాల్లో నిల్వలు లేవు. కేజీహెచ్‌లోని రక్తనిధిలోనూ అదే పరిస్థితి. మరో అయిదు కేంద్రాల్లో రెండు లేదా మూడు వర్గాల రక్తం మాత్రమే.. అదీ తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంది. వర్షాకాలం నేపథ్యంలో విషజ్వరాలు వ్యాపిస్తే ప్రస్తుతమున్న నిల్వలు ఏమాత్రం సరిపోవు. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్, మే నెలల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. దీంతో సాధారణం కంటే ఎక్కువ యూనిట్లు అవసరమయ్యాయి. వారితోపాటు శస్త్రచికిత్సలు, ప్రసవాల సమయంలో రోగులకు కచ్చితంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కొరత కారణంగా ఆపదలో వచ్చినవారికి రక్తం అందజేయలేకపోతున్నామని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
అవగాహన కల్పించాలి: కొద్ది రోజులుగా స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. క్రమం తప్పకుండా రక్తమిస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. యువత జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో నిల్వలు తగ్గడం ఆశ్చర్యంగా ఉంది. రక్తదానంపై యువతకు అవగాహన కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పురుషులు 90 రోజులకోసారి, మహిళలు 120 రోజులకోసారి రక్తదానం చేయొచ్చు. 18 ఏళ్లు దాటి, 12.5 గ్రాముల హిమోగ్లోబిన్‌ కలిగి, ఆరోగ్యంగా ఉన్నవారెవరైనా రక్తమివ్వొచ్చు.

డాక్టర్‌ సుగంధిని, డైరెక్టర్, ఏఎస్‌ రాజా బ్లడ్‌బ్యాంకు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని