logo

తూర్పుతీరంలో వేటకు సిద్ధమైన బోట్లు

తూర్పు తీరంలో సముద్ర ఉత్పత్తులు చేపలు, రొయ్యలు, ఇతర రకాల మత్స్యరాశుల వేటకు రంగం సిద్ధమైంది. 61 రోజుల విరామం అనంతరం శుక్రవారం అర్ధరాత్రి దాటాక చేపలరేవు నుంచి బోట్లు వేటకు బయలుదేరనున్నాయి.

Published : 14 Jun 2024 03:21 IST

బోటుకు జెండా కడుతున్న మత్స్యకారుడు 

వన్‌టౌన్, న్యూస్‌టుడే: తూర్పు తీరంలో సముద్ర ఉత్పత్తులు చేపలు, రొయ్యలు, ఇతర రకాల మత్స్యరాశుల వేటకు రంగం సిద్ధమైంది. 61 రోజుల విరామం అనంతరం శుక్రవారం అర్ధరాత్రి దాటాక చేపలరేవు నుంచి బోట్లు వేటకు బయలుదేరనున్నాయి. అధికశాతం బోట్లు రెండు  వారాల పాటు సముద్ర జలాల్లో ఉండి వేట సాగించేందుకు పయనమవుతుండగా, మరికొన్ని బోట్లు మూడు నుంచి నాలుగువారాలకు.. ఇంకొన్ని ఏ రోజుకారోజు వెళ్లి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వేట సాగించే రోజులను బట్టి పెట్టుబడి అవసరమవుతోంది. ఒక్కో బోటుకు కనిష్ఠంగా రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి వేటకు సిద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఈనెల 14వ తేదీ వరకు వేటకు విరామం ప్రకటించారు. ఆ సమయంలో మత్స్యరాశులు సముద్ర గర్భంలో ఉంటూ చిరుచేపలను ఉత్పత్తి చేస్తాయి. ఎండల తీవ్రత తగ్గి వర్షాలు పడడం ఆరంభమైతే సముద్ర జలాల గర్భం నుంచి బయటకు వస్తాయి. విరామ సమయం ముగియడంతో చేపలరేవులో హడావుడి నెలకొంది.  

  • వేటకు వెళ్లేందుకు ఇతర జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలరేవుకు చేరుకుంటున్నారు. చేపలరేవులో 700 వరకు మర పడవలున్నాయి. మరో వెయ్యి వరకు ఇంజిను, 300 నాటు పడవులున్నాయి. మర పడవల్లో కనీసం 70 శాతం వేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన బోట్లు మరో రెండు మూడు రోజుల్లో దశలవారీ వేటకు బయలుదేరనున్నాయి. ఆయిల్, ఐస్‌ లభించక కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈసారి ఐస్‌ టన్ను ధర ఏకంగా రూ.1500లకు చేరింది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని భావించిన ఆయిల్‌ రాయితీ దక్కలేదు. దీని వల్ల పెట్టుబడి పెరిగిందన్నారు. అయితే వాతావరణం సానుకూలంగా ఉండడం, సముద్రంలో వర్షాలు పడడంతో సీజన్‌ కలిసి వస్తుందనే నమ్మకంతో బోటు ఆపరేటర్లు ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని