logo

జనమే ‘పంచ’ప్రాణాలుగా!!

అంతా అనుకున్నట్లే రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి. ఎన్నికల్లో భారీ విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అయిదు కీలక దస్త్రాలపై గురువారం సంతకాలు చేశారు.

Updated : 14 Jun 2024 05:14 IST

ఐదు కీలక దస్త్రాలపైసంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖ వాసులకు ఎంతో మేలు చేయనున్న నిర్ణయాలు

అంతా అనుకున్నట్లే రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి. ఎన్నికల్లో భారీ విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అయిదు కీలక దస్త్రాలపై గురువారం సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సత్వరం పూనుకున్నారు. ఐదేళ్ల అరాచక పాలనను కళ్లారా చూసి... వైకాపా ప్రభుత్వాన్ని  కుప్పకూల్చిన ప్రజలకు మేలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. నవశకానికి స్వాగతం పలికేలా... మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, పింఛను పెంపు, అన్న క్యాంటీన్ల పునః 
ప్రారంభం, నైపుణ్య గణనపై చంద్రబాబు సంతకాలు చేసి ప్రజాపాలనకు నాంది పలికారు. జిల్లా వాసులకు ఎన్నో రూపాల్లో మేలు జరగనుంది.

ఈనాడు, విశాఖపట్నం

ప్రజల ఆస్తులు ఇక భద్రం..

వైకాపా ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. విలువైన ఆస్తులెన్నో కీలక నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వివాదాస్పద స్థలాలు వారి పరం అయ్యాయి. బెదిరించడం...అప్పటికీ లొంగకపోతే అధికారులతో వేధించడం ద్వారా వందల ఎకరాలను అక్రమార్కులు హస్తగతం చేసుకున్నారు. ఈ ఆక్రమణలను అధికారికం చేసుకునే క్రమంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెరమీదికి తెచ్చారు. దీని ద్వారా ప్రజలకు తెలియకుండానే వారి ఆస్తులను కాజేయాలని చూశారు. ఈ చట్టం ప్రకారం టైటిల్‌ రిజిస్టర్‌లో భూమి ఉన్నట్లు టీఆర్‌వో (టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌) ధ్రువీకరించాలి. టీఆర్‌వో మాటే శాసనం అన్నమాట. దీంతో ఎక్కడికక్కడ భూములు ఇతరుల పేరున మార్చే  ప్రమాదాన్ని ప్రజలు పసిగట్టి...వైకాపాను ఓడించి...తెదేపా కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం సంతకం చేశారు. తమ ఆస్తులకు భరోసా దక్కడంతో  ఇప్పటి వరకు ఆందోళనలో ఉన్న జనం ఊపిరి పీల్చుకున్నారు.

యువతకు నైపుణ్యం...ఉపాధి

విశాఖ పరిసరాల్లో అనేక ఫార్మా, ఇంజినీరింగ్, ఇతరత్రా పరిశ్రమలున్నాయి. యువత ఉన్నత విద్య పూర్తి చేసినా.. తగిన నైపుణ్యం లేకపోవడంతో చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదు. నైపుణ్యమున్న మానవ వనరులు లేవనే కారణంతో జిల్లాలోని పరిశ్రమలు ఆటోనగర్‌లో వెండర్లకు ఆర్డర్లు ఇవ్వట్లేదు. భారీగా ఖర్చు చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుంచి సామగ్రి తెప్పించుకుంటున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతటా ఉంది. ఈ తరహా సమస్య పరిష్కారానికి సీఎం ‘నైపుణ్య గణన’ దస్త్రంపై సంతకం పెట్టారు. ఈ నిర్ణయం ద్వారా యువతలో ఎలాంటి నైపుణ్యాలున్నాయో తేల్చనున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించనున్నారు. జిల్లాలోని లక్షలాది మంది యువతకు మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించడానికి కృషి చేయనున్నారు.

అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయ్‌..

గతంలో తెదేపా ప్రభుత్వం కేవలం రూ.5లకే అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ‘అన్న క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అన్యాయంగా వాటిని మూయించింది. పేదలను పస్తులుంచింది. 2024లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ గురువారం సంతకం చేయడంతో పేదల కళ్లల్లో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. జిల్లాలో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, తోపుడుబండ్ల నిర్వాహకులు, వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. నాడు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి వేలాది మంది భోజనాలు చేసేవారు. ఈసారి మళ్లీ అన్ని చోట్ల ఈ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించనున్నారు. మరిన్ని కొత్త ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

‘మెగా’ హామీ అమలు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా వంచించింది. మెగా డీఎస్సీ వస్తుందనే ఆశతో దాదాపు అయిదేళ్లుగా అభ్యర్థులు కోచింగ్‌ కోసం రూ.వేలల్లో ఖర్చు చేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. సరదాలు, సంతోషాలు పక్కనపెట్టి పుస్తకాలతో కుస్తీలు పడ్డారు. జిల్లాలోని పౌర గ్రంథాలయం, ఏయూలోని వీఎస్‌ కృష్ణ గ్రంథాలయం, కోచింగ్‌ సెంటర్లు, రీడింగ్‌ రూంలలో అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. 

  • ఎన్నికలకు ముందు వైకాపా ఇచ్చిన నోటిఫికేషన్‌లో పోస్టులు తక్కువగా ఉండటంతో నిరాశకు గురయ్యారు. చంద్రబాబు హామీతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఉమ్మడి జిల్లాలలో 329 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆ నోటిఫికేషన్‌ను సవరించిన నేపథ్యంలో పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయ ఖాళీలు పెద్ద సంఖ్యలో భర్తీ కానున్నాయి.

పింఛను పెరిగింది!

తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా వృద్ధులకు ఇచ్చే పింఛను రూ. 3 వేల నుంచి....రూ.4 వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు ఆ దస్త్రంపై గురువారం సంతకం చేసి వృద్ధులు, అభాగ్యులపై ఆప్యాయతను చాటుకున్నారు. ఈ నిర్ణయం వల్ల  జిల్లాలో 1.64 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. గత వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ పింఛను పంపిణీ సమయంలో తెదేపా కూటమిపై అనేక ఆరోపణలు చేసింది. వాలంటీర్లతో పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం చెబితే... ఇంటింటికీ వెళ్లి ఇవ్వొద్దని ప్రతిపక్షాలు కుట్ర పన్నాయనే అసత్యాలను ప్రచారం చేశారు. వాస్తవాలు తెలుసుకున్న పేదలు జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ప్రస్తుతం పెంచిన పింఛను జులైలో అందించనున్నారు. దీనికి ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రూ.3 వేలు కూడా కలిపి మొత్తం రూ.7 వేల చొప్పున  ఇవ్వనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని