logo

వైకాపా సేవలో.. విశాఖ పోలీసులు!

విశాఖలో కొందరు పోలీసులు ఐదేళ్లుగా ప్రజల రక్షణను గాలికొదిలేసి.. వైకాపా నాయకులు ఏది చెబితే అది చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ఆ నాయకులను అడ్డుకోవడం, అక్రమ కేసులు బనాయించడం, ప్రజల పక్షాన పోరాడిన మీడియా మీద కక్షతో కేసులు పెట్టడం తప్ప..

Published : 16 Jun 2024 06:05 IST

నియోజకవర్గ నాయకుల దాడులు, దాష్టీకాలకు వెన్నుదన్ను
కూటమి నేతల ర్యాలీపై ఉక్కుపాదం
ఎన్నికల వేళ అడ్డగోలుగా బైండోవర్‌ కేసులు
ఈనాడు- విశాఖపట్నం

విశాఖలో కొందరు పోలీసులు ఐదేళ్లుగా ప్రజల రక్షణను గాలికొదిలేసి.. వైకాపా నాయకులు ఏది చెబితే అది చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ఆ నాయకులను అడ్డుకోవడం, అక్రమ కేసులు బనాయించడం, ప్రజల పక్షాన పోరాడిన మీడియా మీద కక్షతో కేసులు పెట్టడం తప్ప.. ప్రశాంత నగరంలో శాంతిభద్రతలు ఏమైపోతున్నాయో కనీసం పట్టించుకోలేదు.

శాంతియుత ర్యాలీలపైనా ఆంక్షలు విధించి ఉక్కుపాదం మోపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కడికక్కడ నియోజకవర్గ వైకాపా నాయకుల కనుసన్నల్లో పోలీస్‌ స్టేషన్లు పనిచేశాయి. విధులు మరిచి.. వైకాపా నేతలకు సేవలో మునిగిన విశాఖ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి.


ఆ నేతలకు అనుకూలంగా..

గరంలో డీసీపీ-2గా కొద్ది నెలల కిత్రం బాధ్యతలు చేపట్టిన మోకా సత్తిబాబు వైకాపాకు వీర విధేయుడుగా ముద్ర వేసుకున్నారు. ఆ అధికారి కుటుంబ సభ్యులొకరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమలాపురం నుంచి వైకాపా తరఫున టికెటు కోసం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వైకాపా నేతల ఆదేశాలను తూచాతప్పకుండా పాటించి, ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపడానికి అత్యుత్సాహం చూపారన్న విమర్శలున్నాయి. బర్మాక్యాంపులో వైకాపా అనుచరుల దాడిలో ఓ కుటుంబం తీవ్ర గాయాలపాలైంది. ‘కూటమికి ఓటేశామన్న అక్కసుతో మా తలలు పగలగొట్టారు’ అంటూ బాధితులు మీడియా ముందుకొచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అయితే దాడికి, వైకాపా పార్టీకి సంబంధం లేదని, కేవలం కుటుంబ గొడవలంటూ ఆ పోలీసు అధికారి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనేది కీలక ఆరోపణ. దాడిలో తొమ్మిది మంది ఉన్నారని బాధితులు మొరపెట్టుకున్నా, కేవలం ఒకరినే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు మీడియా ముందుకు రాగా.. ఆ ఆవేదనను ప్రసారం చేసినందుకు ఛానల్స్‌పైనా, వార్తలు రాసిన పత్రికలపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం గమనార్హం. ఆ తర్వాత మరో ఆరుగురు వైకాపా అనుచరులపై కేసు పెట్టినప్పటికీ, బెయిల్‌ వచ్చే సెక్షన్లతో మమ అనిపించారన్న విమర్శలున్నాయి.


తెదేపా నాయకులపైనే బైండోవర్లు..

విశాఖ నార్త్‌ ఏసీపీగా ఉన్న సునీల్‌.. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మనిషి అంటూ విశాఖ కమిషనరేట్‌లో ముద్ర వేసుకున్నారు. రాష్ట్రంలో సింగిల్‌ డీవోతో కడప నుంచి అనకాపల్లికి డీఎస్పీగా బదిలీపై వచ్చారు. అక్కడ పనిచేసిన సమయంలో గంజాయి కేసులో దొరికిన ఓ కారు నెంబరు ప్లేటు మార్చి.. సునీల్‌ సొంతానికి ఉపయోగించడం వివాదాస్పదమైంది. ఆ కారు విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రమాదానికి కారణమవగా... పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వైకాపా అండతో సస్పెండ్‌ వేటు పడకుండా బయటపడ్డారని సమాచారం. తరువాత కొద్ది కాలంలోనే  ఆయన్ని విశాఖ ఏసీపీ(క్రైం)గా బదిలీ చేశారు. ఎన్నికల ముందు నార్త్‌ ఏసీపీగా పోస్టు ఇవ్వడం గమనార్హం. ఏసీపీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూటమి కార్యకర్తలపై దాష్టీకాన్ని చూపారన్న విమర్శలున్నాయి. ఎన్నికల సమయంలో గతంలో ఎలాంటి కేసుల్లేకపోయినా ఎక్కువ మంది తెదేపా నాయకులపై బైండోవర్లు చేశారు.


సీపీ తీరుపైనా విమర్శలు..

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో శాంతియుతంగా సాగుతున్న ర్యాలీలపై... అప్పుడే సీపీగా వచ్చిన రవిశంకర్‌ కర్కశంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. శాంతియుత ర్యాలీలకు సీపీ కార్యాలయంలో అనుమతి కోరగా... సీఎం క్యాంప్‌ ఆఫీసు నుంచి అనుమతి తెచ్చుకోవాలంటూ సూచించడం చర్చనీయాంశమైంది. 3కిమీ పరిధిలో ముగ్గురు ఏసీపీలు, ఒక డీసీపీ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులను మోహరించి శాంతి ర్యాలీ చేపట్టిన మహిళలను నిరంకుశంగా స్టేషన్‌కు తరలించారు. పసుపు దుస్తులు ధరించిన ఓ మహిళను సైతం అదుపులోకి తీసుకోవడం పోలీసుల అత్యుత్సాహనికి తార్కాణం. టైకూన్‌ కూడలిలో డివైడర్లు తొలగించాలంటూ కూటమి కార్యకర్తలు చేపట్టిన ధర్నాను, బలగాలతో అణిచివేసి మాజీ ఎంపీ ఎంవీవీకి అనుకూలంగా వ్యవహ రించారన్న విమర్శలొచ్చాయి.

ఎన్నికల వేళ విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్‌లో డ్రైడ్‌ ఈస్ట్‌ మాటున భారీగా డ్రగ్స్‌ వచ్చాయని సీబీఐ కేసు నమోదు చేసింది. వైకాపా నాయకులపైనా ఆరోపణలు వచ్చాయి. విచారణ సమయంలో కంటైనర్‌ తెరవకుండా కొందరు అధికారులు ప్రయత్నించినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. ‘అధికారులు, పోర్టు ఉద్యోగులు గుమిగూడటం వల్ల వీడియో చిత్రీకరణకు కొంత ఆటంకం కల్గింది’ అని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో సైతం పేర్కొంది. ‘సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో టెక్నికల్‌ టర్మ్‌ కోసం రాశారు తప్ప, ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోలేదు. కస్టమ్స్‌ ఎస్పీ అభ్యర్థన మేరకే డాగ్‌ స్క్వాడ్‌ పంపాం’ అని సీపీ దీనిపై వివరణ ఇచ్చారు. సీబీఐ విచారణ చేస్తున్న చోటుకు సీపీ ఎందుకు వెళ్లారనేది స్పష్టత ఇవ్వకుండా దాటేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు