logo

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేద్దామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టర్‌ రవి, ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం అనకాపల్లిలో నిర్వహించారు.

Updated : 17 Jun 2024 02:58 IST

రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత

మాట్లాడుతున్న మంత్రి అనిత, వేదికపై కలెక్టర్, ఎస్పీ 

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేద్దామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టర్‌ రవి, ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం అనకాపల్లిలో నిర్వహించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు మంత్రిని పరిచయం చేసుకుని ఆమెను సత్కరించారు. అనంతరం మంత్రి అనిత విలేకరులతో మాట్లాడుతూ నిబంధనలకు లోబడి అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలకుల మెప్పు కోసం కొందరు, మరికొంత మంది వారి స్వప్రయోజనాల కోసం పనిచేసి ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్నారు. అలాంటివాటికి స్వస్తి చెప్పాలని కోరారు. అధికారులకు రాజకీయాలు అవసరం లేదని, ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా నిబంధనలకు లోబడి పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖకూ నిధులు కేటాయించక పోవడంతో పనులు జరగలేదన్నారు. గ్రామాల్లో తాము తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. జలవనరుల శాఖకు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడంతో గ్రోయిన్ల మరమ్మతులు లేక సాగునీరు సముద్రంలో కలిసిపోతోందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారని, సాగునీరు ఎక్కడ అంటే చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు. వైకాపా హయాంలో గంజాయి మూలాలకు విశాఖను ప్రతీకగా నిలిపారన్నారు. అదృశ్యం కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నికల అనంతరం విశాఖపట్నం నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్‌చేసి తన కుమార్తె అదృశ్యమైనా పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలపై విచారణ చేసి శాంతిభద్రతల పరిరక్షణతోపాటు క్రైం రేటు తగ్గిస్తామన్నారు. తాను మంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఉన్నతాధికారులంతా సహకరించి మెరుగైన పాలన అందించేలా చొరవ చూపాలని కోరారు. 

కష్టించి పనిచేస్తే పదవులు వస్తాయి: ఎంపీ 

అనకాపల్లి పట్టణం: కష్టపడి పనిచేస్తే పదవులు కచ్చితంగా వస్తాయనడానికి మంత్రి అనితే నిదర్శమని ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. అనకాపల్లిలోని ఎంపీ కార్యాలయానికి ఆదివారం అనిత వచ్చి సీఎం రమేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని ఎంపీ సత్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలమైన హోంశాఖ అనకాపల్లి జిల్లాకు చెందిన అనితకు దక్కడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, తెదేపా జిల్లా అధ్యక్షులు తాతయ్యబాబు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని