logo

‘రుషికొండకు’ ఆ వైభవం ఎలా?!

‘బ్లూఫ్లాగ్‌ బీచ్‌’ ధ్రువీకరణ ఉన్న బీచ్‌లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది. ఆ బీచ్‌లకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇప్పటికే బ్లూఫ్లాగ్‌ బీచ్‌ ధ్రువీకరణన పొందిన ‘రుషికొండ బీచ్‌’...మళ్లీ ఆ స్థాయిలో మెరవాలంటే ఎన్నో ఆటంకాలు దాటాల్సి ఉంది.

Updated : 17 Jun 2024 04:57 IST

బ్లూఫ్లాగ్‌ బీచ్‌’ ధ్రువీకరణకు పాట్లు
ప్రమాణాల పునరుద్ధరణే కీలకం

బీచ్‌ వద్ద పర్యాటకులు

ఈనాడు, విశాఖపట్నం: ‘బ్లూఫ్లాగ్‌ బీచ్‌’ ధ్రువీకరణ ఉన్న బీచ్‌లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది. ఆ బీచ్‌లకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇప్పటికే బ్లూఫ్లాగ్‌ బీచ్‌ ధ్రువీకరణన పొందిన ‘రుషికొండ బీచ్‌’...మళ్లీ ఆ స్థాయిలో మెరవాలంటే ఎన్నో ఆటంకాలు దాటాల్సి ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసానికి రుషికొండ తీరం చెరగని సాక్ష్యంగా మిగిలింది. ఈ నేపథ్యంలో గుర్తింపు కొనసాగింపుపై అనుమానాలు కలుగుతున్నాయి. రుషికొండ తీరాన్ని 2018లో కేంద్రం ఈ గుర్తింపునకు ఎంపిక చేసి రూ. 7.3 కోట్లతో వసతులు కల్పించింది. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు వచ్చాక ఆ ప్రమాణాలు పాటిస్తేనే తిరిగి పునరుద్ధరిస్తారు. లేకుంటే మరో ఆలోచనే లేకుండా రద్దు చేసేస్తారు. తగిన ప్రమాణాలు పాటించని కారణంగా గత ఏడాది ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని ఓ బీచ్‌ గుర్తింపును రద్దు చేశారు. ఈ ఏడాది ధ్రువీకరణ కొనసాగింపునకు డెన్మార్క్‌ నుంచి అధ్యయన కమిటీ త్వరలో రుషికొండకు రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో బీచ్‌లో తిరిగి పునరుద్ధరణ చర్యలు అధికారులు వేగవంతం చేశారు. అవి ఎంత వరకు ఫలితం ఇస్తాయో చూడాలి.

వైకాపా హయాంలో: జగన్‌ రుషికొండపై సాగించిన విధ్వంసానికి ఈ  బీచ్‌ కళావిహీనమైంది. సీఎం క్యాంపు కార్యాలయం కోసమంటూ ప్రజాధనం వృథా చేసి హడావుడి చేశారు. ఈ క్రమంలో బీచ్‌లోని వసతులను ఎత్తిపారేశారు. సువిశాలంగా ఉండే తీరంలో ఆంక్షలు విధించారు. కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఇనుప కంచెతో వలయం ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రసిద్ధ బ్లూఫ్లాగ్‌ బీచ్‌లోనే చేశారు. మరుగుదొడ్లను మార్చేశారు. శాప్‌ ఆధ్వర్యంలో జల క్రీడలకు వినియోగించిన కేంద్రాలను కూల్చేశారు. బోట్లను తరలించేశారు. గతంలో ఈ బీచ్‌కు వెళ్తే ఎంతో ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలికేది. రాత్రిళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్తు కాంతులతో అలరారేది. ఇప్పుడు ఆ పరిస్థితే కనిపించడం లేదు. రాత్రివేళ ఎక్కడ చూసినా అంధకారమే దర్శనమిస్తుంది. వెదురు నిర్మాణాలు పాడైపోయాయి. కుటీరాలు కుప్పకూలాయి.

పనులు వేగవంతం

బ్లూఫ్లాగ్‌ గుర్తింపు పునరుద్ధరించే తనిఖీ బృందం ఈ నెలాఖరుకు రానుంది. సహజంగా నీటి స్వచ్ఛత, బీచ్‌ శుభ్రతకు సంబంధించి అన్ని ప్రమాణాలు సక్రమంగానే పాటిస్తున్నాం. రోజూ నిర్వహించే వసతులకు సంబంధించిన మరమ్మతు పనులు జరుగుతున్నాయి. వారంలోపే అవీ పూర్తవుతాయి. ఇప్పటికే పిల్లల పార్క్‌ను బాగు చేశాం. పాడైన క్రీడా పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశాం. మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులను ఆధునికీకరిస్తున్నాం. వాటర్‌ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. 

- శ్రీనివాస పాణి, ప్రాంతీయ సంచాలకులు, పర్యాటకశాఖ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని