logo

తూకాల్లో.. అక్రమాలు నిగ్గుతేల్చేలా..

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న సరకుల తూకాల్లో అక్రమాలను నిగ్గుతేల్చడానికి తెదేపా కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. 

Updated : 17 Jun 2024 04:54 IST

పౌరసరఫరాల గోదాముల్లో అధికారుల తనిఖీ
నిశితంగా ‘అంగన్‌వాడీ’ సరకుల పరిశీలన

భీమిలి గోదాములో ప్యాకెట్లను తూకం వేస్తున్న అధికారులు

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న సరకుల తూకాల్లో అక్రమాలను నిగ్గుతేల్చడానికి తెదేపా కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. 

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌: జిల్లా పరిధిలోని పౌరసరఫరాల సంస్థ (సీఎస్‌సీ) గోదాముల్లో ఆదివారం అధికార బృందాలు తనిఖీలు నిర్వహించాయి. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లాలోని ఓ గోదాములో శనివారం తనిఖీలు నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కందిపప్పు, వంటనూనెలు, పంచదార ప్యాకెట్ల తూకాల్లో మోసాలున్నట్లు గుర్తించారు. 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తక్కువ ఉన్నట్లు మంత్రి పరిశీలనలో వెల్లడైంది. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గోదాముల్లో తనిఖీలు చేయాలని, అప్పటి వరకు సరకుల పంపిణీ నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు.

మూడు బృందాలు.. ఆరు చోట్ల సోదాలు: మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని అగనంపూడి, మర్రిపాలెం 1,2, పెందుర్తి, పద్మనాభం, భీమిలిలోని గోదాముల్లో తనిఖీల కోసం సహాయ సరఫరా అధికారులు కృష్ణ, మురళీనాథ్, ఉప తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేస్తూ జేసీ మయూర్‌ అశోక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఆదివారం జిల్లాలోని ఆరు గోదాములను తనిఖీ చేసి నిల్వలను పరిశీలించారు. కందిపప్పు, వంటనూనె, పంచదార ప్యాకెట్ల బరువును తూచారు. కొన్ని ప్యాకెట్లు తక్కువ బరువు ఉన్నట్లు నిర్ధారించారు. నిల్వల్లో కూడా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలతో సోమవారం జేసీకి నివేదిక ఇవ్వనున్నారు. తనిఖీల ప్రక్రియను జేసీ పర్యవేక్షించారు.

వైకాపా పాలనలో తనిఖీలు శూన్యం: జిల్లాలో పౌరసరఫరాల సంస్థ గోదాములు ఆరు ఉన్నాయి. గుత్తేదారులు ఆయా గోదాములకే రేషన్‌ సరకులు చేరవేస్తారు. గోదాముల నుంచి సరకులు రేషను డిపోలకు వెళతాయి. అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతారు. సరకులు వచ్చిన సమయంలో గోదాముల వద్ద ఉండే అధికారులు తూకాలు వేసి సరిచూసుకోవాలి. ప్యాకెట్లే కదా అని డీలర్లు వాటిని తీసుకొని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. వైకాపా పాలన ఐదేళ్లలో సరకుల తూకాల్లో లోపాలను గుర్తించలేకపోయారు. తనిఖీలు సరిగా జరగకపోవడమే దీనికి కారణమని విమర్శలొస్తున్నాయి. ఫలితంగా రూ.కోట్లలో ప్రజాధనాన్ని అక్రమార్కులు స్వాహా చేశారు. రేషన్‌ బియ్యం తూకాల్లో సైతం మోసాలు జరుగుతున్నాయని, క్వింటాలుకు 5కిలోల వరకు తక్కువగా ఇస్తున్నారని ఎప్పటి నుంచో డీలర్లు గగ్గోలు పెడుతున్నా పట్టించుకున్నవారు లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమాలు వెలుగు చూశాయి. తూకాల్లో తేడాలకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని