logo

వీళ్లది.. పచ్చ‘ధన బంధం’!!

జీవీఎంసీని కొందరు వైకాపా కార్పొరేటర్లు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. వీరితో పాటు...‘మేం ఏం తక్కువ?’ అంటూ పలువురు అధికారులు అడ్డదారుల్లో అక్రమార్జనకు తెగబడ్డారు.

Updated : 17 Jun 2024 04:56 IST

గుత్తేదారులతో కుమ్మక్కైన ఉద్యాన అధికారులు
మొక్కల సంరక్షణ పేరుతో మాయ
జీవీఎంసీలో మరో కుంభకోణం

జీవీఎంసీని కొందరు వైకాపా కార్పొరేటర్లు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. వీరితో పాటు...‘మేం ఏం తక్కువ?’ అంటూ పలువురు అధికారులు అడ్డదారుల్లో అక్రమార్జనకు తెగబడ్డారు. ‘మొక్కలకు నీరు’ పేరిట రూ.లక్షల్లో నిధులు మింగేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మహానగరంలోని రహదారుల విభాగినులు, ఖాళీ ప్రదేశాల్లో ఉన్న మొక్కల సంరక్షణ పనుల్లో గుత్తేదారులతో కలిసి ఉద్యాన విభాగాధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.

ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్‌-న్యూస్‌టుడే: జీవీఎంసీలోని 98 వార్డుల పరిధిలో ప్రధాన రహదారులకు ఇరువైపులా, విభాగినుల మధ్య పచ్చదనం పెంపొందించే క్రమంలో మొక్కలు నాటుతుంటారు. వీటి సంరక్షణకు నీటి సరఫరా బాధ్యతలు గుత్తేదారులకు అప్పగిస్తారు. నగరంలో జాతీయ రహదారిపై ఎన్‌ఏడీ నుంచి వెంకోజిపాలెం వరకు, బీచ్‌రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ పరిసరాల్లో మొక్కల సంరక్షణ బాధ్యతలకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. గత ఏడాది మే నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.2.20కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. గత మూడేళ్ల నుంచి ఆయా పనులు ఇద్దరు గుత్తేదారులకు మాత్రమే దక్కేలా ఉద్యాన విభాగాధికారులు, సిబ్బంది చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది జనవరిలో మొక్కల సంరక్షణ సక్రమంగా లేదని గమనించిన కమిషనర్‌ సాయికాంత్‌వర్మ గుత్తేదారులను పిలిచి మాట్లాడారు. ఆ తరువాత గత ఏడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు గుత్తేదారులకు ఇవ్వాల్సిన పార్టు బిల్లులు  రూ.1.60కోట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. వాస్తవంగా ఆయా బిల్లులు విడుదల చేసేటప్పుడు టెండరు నిబంధనల మేరకు చేశారా? లేదా? అన్న అంశాలను అకౌంట్స్‌ విభాగం పరిశీలించాలి. అలా చేయకుండానే నిధులు మంజూరు చేయడం గమనార్హం.

అనుకూలంగా జీపీఎస్‌ నివేదికలకు ఒత్తిళ్లు: ఇటీవల మరో రూ.60లక్షలకు బిల్లులు పెట్టారు. మొక్కలకు నీరు పోసే ట్యాంకర్ల జీపీˆఎస్‌ నివేదిక కావాలని అకౌంట్స్‌ విభాగం నుంచి అభ్యంతరం తెరపైకి వచ్చింది. ఆయా వాహనాలకు అమర్చిన జీపీఎస్‌ ప్రకారం ఒక్కో వాహనం 700-920 ట్రిప్పులు మాత్రమే తిరిగినట్లు నివేదిక వచ్చింది. గుత్తేదారులు మాత్రం ఒక్కో వాహనం 2,500-3,400 వరకు తిరిగినట్లు పేర్కొని బిల్లులు పెట్టారు. తమకు అనుకూలంగా ట్రిప్పులు తిరిగినట్లు నివేదిక ఇవ్వాలని జీపీఎస్‌ గుత్తేదారుపై మొక్కల సంరక్షణ గుత్తేదార్లు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇదే విషయంలో వైకాపా నేత ఒకరు జోక్యం చేసుకున్నారు. గుత్తేదారు తమకు కావాల్సినవాడని, బిల్లులు మంజూరు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

సొమ్ములు కొట్టి..

పనులు చేయకుండా ప్రతిపాదించిన బిల్లుల్లో ఎలాంటి కొర్రీలు వేయకుండా నిధులన్నీ ఇచ్చేలా గుత్తేదారులు రూ.20లక్షలకు ఒప్పందం మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రూ.12లక్షలు చెల్లించగా, మరో రూ.8లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా కుంభకోణం వెలుగు చూపింది. ఈ వ్యవహారం మొత్తం ఉద్యానవన విభాగాధికారితోపాటు, పొరుగు సేవ ద్వారా పనిచేస్తున్న ఇద్దరు మహిళా అధికారులు నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. కూలీలతో మొక్కల సంరక్షణకు గోతులు తవ్వించడం, పిచ్చి మొక్కలు, గడ్డి తీయించడం వంటి పనులతోపాటు, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలనేది టెండరు నిబంధన. ఆయా పనులు జరగకపోయినా పెట్టిన బిల్లులకు ఆమోదం తెలిపేలా వ్యవహరించిన ఉద్యానవన విభాగంపై విచారణ జరపాలి.

పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యాన విభాగ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలన్న డిమాండ్‌ వినిపిస్తుంది. గత మూడేళ్ల నుంచి ఉద్యాన విభాగం టెండర్లను ఇద్దరు గుత్తేదారులే ప్రతిపాదన నిధుల కంటే 40-45 శాతం లెస్‌(తక్కువ)కు కోట్‌ చేసి దక్కించుకోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని