logo

ఏ కన్నూ చూడదనా.. ఈ విచ్చల‘విడిది!’

విశాఖ నగరంలో సాగరం చెంత సాగిన విధ్వంసకర పరిణామాలకు మౌన సాక్షి ‘రుషికొండ’. వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం చర్చనీయాంశమైన ‘రుషికొండ’పై అసలు ఏం జరిగింది? అనేది ఆదివారం బయటపడింది.

Updated : 17 Jun 2024 04:55 IST

రుషికొండపై జనం సొమ్ములు వెదజల్లిన జగన్‌ ప్రభుత్వం
అడుగడుగునా విలాసవంతమైన నిర్మాణాలు
ఎమ్మెల్యే గంటా పరిశీలనతో బయటపడిన రహస్యాలు

కొండపై తీర్చిదిద్దిన పచ్చదనం

విశాఖ నగరంలో సాగరం చెంత సాగిన విధ్వంసకర పరిణామాలకు మౌన సాక్షి ‘రుషికొండ’. వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం చర్చనీయాంశమైన ‘రుషికొండ’పై అసలు ఏం జరిగింది? అనేది ఆదివారం బయటపడింది.

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పీఎంపాలెం, సాగర్‌నగర్‌: వైకాపా పాలనలో ఇక్కడి రాజసౌధం వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి! అటు వైపుగా అడుగు వేయాలన్నా దడే! కొండ చుట్టూ పోలీసులు డేగ కళ్లతో అనుక్షణం పహారా కాస్తూ... కాకి కూడా వాలని విధంగా భద్రత కొనసాగించారు. ప్రతిపక్షంలో కీలక నేతలు ఇటు రావాలన్నా పోలీసులు ఎన్నో ఆంక్షలు విధించారు! నాటి ముఖ్యమంత్రి జగన్‌ హెలికాఫ్టర్‌లో వెళ్లినా... ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అంతేనా... ఎంతో అందమైన రుషికొండ బీచ్‌ను సైతం ధ్వంసం చేసి..పర్యాటకులను హడలెత్తించారు! ఇంత అరాచకంగా పాలించిన వైకాపా నేతలు...ఆ రాజసౌధంలో ఏం కట్టారు? ఎలా కట్టారు? అనేది బాహ్య ప్రపంచానికి తెలపాలని... మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూటమి నేతలతో కలిసి ఆదివారం పరిశీలిస్తే... నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

బాత్‌టబ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నేతలు

రుషికొండపై సాగించిన ఈ నిర్మాణాలు... ఎందుకోసం? అనే ప్రశ్నకు ఎన్నికలయ్యే వరకూ జవాబే లేదు. ఆది నుంచీ అంతా రహస్యమే! ఆ గుట్టు ఇప్పుడు బయటపడింది. అడుగడుగునా జనం సొమ్ములు విచ్చలవిడిగా ఖర్చు చేసిన తీరు వెలుగులోకి వచ్చింది. నాలుగు బ్లాకుల్లోని ఏడు భవనాల్లో ఎటు చూసినా విలాసవంతమైన నిర్మాణాలే! పడక గదులు, మరుగుదొడ్లు, సమావేశ మందిరాలు, హాళ్లు...విడిది గదులు...ఇలా ఏది చూసినా పాలరాతి మయమే. అత్యాధునిక పరికరాలకు సొమ్ములు నీళ్లలా ఖర్చు చేశారు. ప్రతి గదిలో విభిన్న ఆకృతులతో కూడిన ఫ్యాన్లు అమర్చారు. స్నానాలు, మరుగుదొడ్లకు కేంద్రీకృత శీతల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుర్చీలు, పాలరాయితో  కూడిన టేబుళ్లు ఏర్పాటు చేశారు.

సీఎంవో కార్యకలాపాలకు అనేలా నిర్మించిన భవనంలో భారీ సమావేశ మందిరాలు, సీఎం నేరుగా సమీక్షించేందుకు హాళ్లు, భోజన మందిరాలు, కిచెన్లను అత్యంత ఆధునికంగా నిర్మించారు. కిటికీలు, కబోర్డులను విలాసవంతంగా రూపొందించారు. భవనాల్లోపల బయట విద్యుత్తు మిరుమిట్లు గొలిపే వివిధ రకాల దీపాలను సుందరంగా అమర్చారు. పార్క్‌లో అందంగా కనిపించేలా దీప స్తంభాలను ఏర్పాటు చేశారు. సముద్రపు అందాలను తిలకించేలా ప్రతి భవనం నుంచి చేసిన ఏర్పాట్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. జనసేన, భాజపా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తలు పంచకర్ల సందీప్, కె.రామానాయుడు, చిక్కాల విజయ్‌బాబు, గాడు వెంకటప్పడు పలువురు నేతలు గంటాతో పాటు పరిశీలించారు.
విలాసవంత దీపాలు, పడకగదులు, మరుగుదొడ్లు, వంటగది, సమావేశ మందిరాలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని