logo

పసుపు దళాధిపతి పల్లా!!

గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కీలక పదవి వరించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటన విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన నేతకు తగిన గుర్తింపు దక్కిందని అభినందిస్తున్నారు.

Updated : 17 Jun 2024 04:54 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవితో అంతటా హర్షం
వినయ విధేయతకు దక్కిన గుర్తింపంటున్న నేతలు

ఈనాడు, విశాఖపట్నం, గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కీలక పదవి వరించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటన విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన నేతకు తగిన గుర్తింపు దక్కిందని అభినందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్‌ నియోజవర్గం పరిధిలో ఎమ్మెల్యేలందరూ మంచి మెజార్టీలతో గెలుపొందారు. మంత్రివర్గ కూర్పులో జిల్లాకు ప్రాధాన్యం ఉంటుందని భావించారు. వివిధ సమీకరణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ తరుణంలో విశాఖ జిల్లాకు చెందిన నేతకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి అన్నట్లు వ్యవహరించారు. 2014-19లో ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించారు. వైకాపా పాలనలో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రజాపోరాటాలను సాగించారు. పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అనేక సార్లు అరెస్టులు, గృహనిర్బంధం తప్పలేదు. వైకాపా ప్రభుత్వం ఆయన మీద అనేక రకాలుగా రాజకీయ కక్షసాధింపులు సాగించినా తొణకలేదు. విశాఖ స్టీలుప్లాంటు పరిరక్షణకు ఏడు రోజుల పాటు ఆమరణదీక్ష చేపట్టి ఉద్యమానికి ఊపు తెచ్చారు. అగనంపూడి టోల్‌గేటు, గాజువాక హౌస్‌ కమిటీ భూముల సమస్య, ఇతర ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ.. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తీరును మెచ్చి పార్టీ అధినేత నేడు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని