logo

మళ్లీ మంచిరోజులు..

ఈ ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కూడా పుస్తకాలు, బ్యాగులను ప్రభుత్వం ఉచితంగా అందజేయనుంది. కొత్త ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Published : 20 Jun 2024 04:32 IST

ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఈ ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కూడా పుస్తకాలు, బ్యాగులను ప్రభుత్వం ఉచితంగా అందజేయనుంది. కొత్త ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం వీటిని విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఇచ్చేవారు. తర్వాత ఆపేశారు. మళ్లీ ప్రభుత్వం ఉచిత పుస్తకాలు ఇవ్వాలన్న నిర్ణయం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరమని విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు.

విశాఖ జిల్లాలో భీమిలి జూనియర్‌ కళాశాల, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పెందుర్తి జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, అగనంపూడి, ఆనందపురం, ఇస్లాంపేట, మధురవాడ, మల్కాపురం, ప్రభుత్వ ఒకేషనల్‌ కళాశాలల్లో 6400 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు బ్యాగులు కూడా అందజేయనుంది. దీని కోసం జీవోనెంబర్‌ 28 విడుదల చేసింది. అన్ని గ్రూపుల విద్యార్థులకు కూడా ఇవి అందనున్నాయి. జులై 15లోపు ఈ పుస్తకాల పంపిణీ పూర్తికావాలని జీవోలో పేర్కొంది.

మళ్లీ అమల్లోకి..

గతంలో ఉచిత పుస్తకాల పంపిణీ ఉన్నా..మూడేళ్ల నుంచి పూర్తిగా ఆపేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీన్ని మళ్లీ అమల్లోకి తీసుకువస్తోంది. దీనివల్ల ఒక్కో విద్యార్థికి సుమారు రూ. 2 వేల వరకు ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది.


ప్రవేశాలు పొందండి..
- బొడ్డేపల్లి రాధా, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారిణి (డీవీఈఓ)

ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు అందిస్తోంది. పేద విద్యార్థులకు ఇది ఒక వరం. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చదవడం వల్ల ఈ ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులు తమ సమీప ప్రభుత్వ కళాశాలల్లో తమకు నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవచ్చు.


కొత్త ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం..
- డాక్టర్‌ మర్రివేముల శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు 

కొత్తగా వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. వెంటనే జీవో కూడా జారీ చేయటం విశేషం. గత మూడేళ్లుగా ఆగిపోయిన ఈ పంపిణీని పునరుద్ధరించటం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుంది. వైకాపా ప్రభుత్వం పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని