logo

ఏరువాకకు రైతన్నలు సన్నద్ధం

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు పులకరించిపోతున్నారు. ఖరీఫ్‌ పనులకు శ్రీకారం చుట్టారు. వరినారు వేయడానికి దుక్కులు దున్నుతున్నారు. జిల్లాలో ఏటా 85,857 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తుంటారు. 

Published : 20 Jun 2024 04:50 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే 

సీతానగరంలో దుక్కులు చేస్తున్న రైతులు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు పులకరించిపోతున్నారు. ఖరీఫ్‌ పనులకు శ్రీకారం చుట్టారు. వరినారు వేయడానికి దుక్కులు దున్నుతున్నారు. జిల్లాలో ఏటా 85,857 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తుంటారు. 

విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా వ్యవసాయ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో అన్ని పంటల కంటే వరి సాగు ఎక్కువగా చేస్తారు. ఏటా 54,493 హెక్టార్లలో వరి సాగు చేస్తారు. వీరిలో 40 శాతం రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తారు. మిగిలిన వారు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలు వినియోగిస్తారు. ఈ ఏడాది ఎక్కడా విత్తనాల కొరత లేకుండా చూడాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

చెరకు నాట్లు వేస్తున్న రైతులు 

జోరుగా చెరకు నాట్లు .. వరి తర్వాత స్థానం చెరకు పంటదే. ఏటా 9వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాలలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాట్లు వేశారు. ఇక మిగిలిన ప్రాంతాలలో వర్షాధారంగా సాగు చేస్తుంటారు. వీరంతా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నాట్లు వేయడం ప్రారంభించారు. గంటి పంటను 1,156 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మునగపాక, సబ్బవరం, చోడవరం, బుచ్చెయ్యపేట ప్రాంతాలో నారు పోస్తున్నారు. వరి విత్తనాలు వేయడానికి అనుకూలంగా దుక్కులు చేస్తున్నారు.

మెట్టపాలెంలో గంటి విత్తనాలు వేస్తున్న రైతులు 


22,618 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం
- బి.మోహనరావు, జిల్లా వ్యవసాయాధికారి 

జిల్లాలోని రైతులకు అవసరమైన అన్ని రకాల వరి విత్తనాలు సిద్ధం చేశాం. గత ఏడాది 21 వేల క్వింటాళ్లు అమ్మకం చేయగా ఈ ఏడాది 22,618 క్వింటాళ్ల అమ్మకం చేయాలని నిర్ణయించాం. వరిలో శ్రీకాకుళం సన్నాలు ఎక్కువగా వేస్తారు. అందుకు అనుగుణంగానే వీటిని ఎక్కువగా రప్పించాం. ఇప్పుటికే 13 వేల క్వింటాళ్ల విత్తనాలు జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఉన్నాయి. మరో వారం రోజుల్లో మిగిలిన రకాలు వస్తాయి. ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే వెయ్యి కింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచాం. వీటిలో 300 క్వింటాళ్లు అమ్మకం చేశాం. వరిలో ఎంటీయూ 1224, 1318, 1121 కొత్త రకాలు రప్పించాం. 


దుక్కులు చేసుకోవాలి 
- పీవీకే జగన్నాథరావు, ఏడీఆర్, పరిశోధన కేంద్రం 

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు అవసరం. పచ్చిరొట్ట విత్తనాలు జల్లు కోవడం మంచిది. దమ్ము సమయంలో పచ్చిరొట్టను భూములో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరగుతుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని