logo

కదిలేదెవరో.. మిగిలేదెవరో..!

జేసీ జాహ్నవి ఎన్నికల మూడు నెలలు ముందు వచ్చినా ఆమె పనితీరుపై అటు కలెక్టరేట్, ఇటు ప్రతిపక్షాలు సైతం గుర్రుగా ఉన్నారు. ఏం చెప్పినా పట్టించుకోరని, దస్త్రాలు అన్నీ ముందుకు కదలనివ్వకుండా తనవద్దే అట్టిపెట్టుకుంటారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.

Updated : 20 Jun 2024 05:37 IST

కూటమి ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు 
వైకాపా నేతలతో అంటకాగిన వారిపై ప్రత్యేక దృష్టి
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, కలెక్టరేట్

‘ఉద్యోగుల బదిలీల కోసం ఎవరూ నాకు సిఫార్సులు చేయొద్దు. పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది’ రెండు రోజుల క్రితం నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు స్థానిక నేతలతో అన్న మాటలివి. 


కొత్త ప్రభుత్వం ఇలా కొలువు తీరిందో లేదో అప్పుడే ఉద్యోగులు బదిలీల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. 


ఈ ఏడాది ఎన్నికల కారణంగా సాధారణ బదిలీలు జరగలేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత ఉద్యోగుల బదిలీలు పెద్దఎత్తున జరిగే అవకాశం ఉంది. 


ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన ఎంపీడీవోలు, తహసీల్దార్లు తిరిగి తమతమ జిల్లాలకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో జిల్లాలో గత ప్రభుత్వంలో వైకాపా నేతలతో అంటకాగి తిరిగిన అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం కల్పించనున్నారు. 


జేసీ జాహ్నవి ఎన్నికల మూడు నెలలు ముందు వచ్చినా ఆమె పనితీరుపై అటు కలెక్టరేట్, ఇటు ప్రతిపక్షాలు సైతం గుర్రుగా ఉన్నారు. ఏం చెప్పినా పట్టించుకోరని, దస్త్రాలు అన్నీ ముందుకు కదలనివ్వకుండా తనవద్దే అట్టిపెట్టుకుంటారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు సైతం బదిలీల జాబితాలో ఉన్నట్లు సమాచారం. పోలీసు శాఖలోను బదిలీలు పెద్దఎత్తున జరగనున్నాయి. 


అయ్యన్నపాత్రుడును ఇటీవల కలిసి అభినందనలు తెలుపుతున్న డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, ఉద్యోగులు  


కలెక్టర్‌ కదలక తప్పదు..

అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన దగ్గర నుంచి కలెక్టర్‌గా రవి పట్టన్‌శెట్టి పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు చాలా జిల్లాల కలెక్టర్లను మార్చినా ఆయన్ను మాత్రం కదపకుండా వదిలేశారు. కొత్త ప్రభుత్వం కొలువ తీరిన తర్వాత బదిలీల్లో ఈయనకు తప్పకుండా స్థానచలనం ఉంటుందని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈయన అప్పటి నేతలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునేవారు కాదు. తూతూమంత్రపు విచారణలు జరిపి నివేదికలు బయటపెట్టేవారు కాదు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌ తన బినామీలతో కశింకోట మండలం బయ్యవరంలో వేసిన లేఅవుట్ విషయంలో, సెజ్‌లోని ప్రమాదాలపై విచారణ జరిపినా వాటి నివేదికలు ఎక్కడా బయటపెట్టలేదు. బాధ్యులపై చర్యలు తీసుకోలేదు.


కార్యాలయాల్లో జరగని పనులు

ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వెలవెలబోతున్న తహసీల్దార్‌ కార్యాలయం 

కూటమి తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీ సీఎం.రమేశ్‌ చుట్టూ జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. నేతలను ప్రసన్నం చేసుకుని జిల్లాలో ఉండేలా సిఫార్సు లేఖల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఏ శాఖలో లేని విధంగా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు ఉండనున్నాయి. డీఆర్వో దగ్గర నుంచి ఆర్డీవో, ప్రత్యేక ఉపకలెక్టర్లను బదిలీ చేయడానికి ఇప్పటికే జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎలాగో బదిలీ అయిపోతామని అధికారుల దగ్గర నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు ఎవరూ పనిపై ఆసక్తి చూపడం లేదు. రెవెన్యూ కార్యాలయాల్లో మ్యుటేషన్‌ పనులు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలకు వచ్చినా సమాధానం చెప్పేవారే లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


అంతటా అదే చర్చ..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు, ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది. ఏ కార్యాలయంలో చూసిన ఇదే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో వైకాపా నాయకులతో సత్సంబంధాలు నెరిపిన ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొంతమంది జిల్లా, మండల స్థాయి అధికారులు వైకాపా నాయకులు అడుగులకు మడుగులొత్తుతూ కాలం వెళ్లదీశారు. అనకాపల్లి తహసీల్దార్‌గా ఉన్న గంగాధర్‌ ఏకంగా వైకాపా నాయకులతో అంటకాగి అక్రమంగా ఇళ్లపట్టాలపై సంతకాలు చేసేశారు. తర్వాత నెమ్మదిగా ఎన్నికల బదిలీల్లో జారుకున్నారు. ఇలా చాలామంది తహసీల్దార్లు వృత్తిధర్మం మరచి వైకాపాకు వీరవిధేయులుగా పనిచేశారు. మళ్లీ వైకాపా ప్రభుత్వం వస్తుందనే నమ్మకంతో ప్రతిపక్షాలను ఐదేళ్లపాటు ఎక్కడా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రావడంతో వీరంతా నేడు విజేతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో కొంతమంది మండల స్థాయి అధికారులు ఎన్నికల ముందర విశాఖలోని అప్పటి ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్లి మరీ తమకు కావాల్సిన పనులు చేసిపెట్టారనే ఆరోపణలున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని