logo

ఆరోగ్య చైతన్యం.. అందరికీ..!

పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం సమీప సెయింట్‌ ఆన్స్‌ మిషనరీ సంస్థల ఆధ్వర్యంలో నెలకొల్పిన విద్యా సంస్థలు, ఆసుపత్రి ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

Published : 20 Jun 2024 05:04 IST

ఆయుర్వేద మందులు తయారు చేస్తున్న మహిళలు
సామాజిక బాధ్యతగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ

ప్రత్యేకంగా పెంచుతున్న ఔషధ గుణాలు కలిగిన మొక్కలు

సింధియా, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం సమీప సెయింట్‌ ఆన్స్‌ మిషనరీ సంస్థల ఆధ్వర్యంలో నెలకొల్పిన విద్యా సంస్థలు, ఆసుపత్రి ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వాటితో పాటు కొండవాలు ప్రాంతాలు, మురికివాడల్లో నివాసం ఉండే ప్రజలకు వారి ఆరోగ్యంపై చైతన్యం కల్పించి, ఆయుర్వేద మందుల వినియోగంపై అవగాహన కల్పించేందుకు కొన్నేళ్ల నుంచి మహిళా బృందం కృషి చేస్తోంది.

  • మిషనరీ సంస్థ పర్యవేక్షణలోనే సాధారణ రోగులకు అవసరమైన ఆయుర్వేద మందుల తయారీకి కొన్నేళ్ల కిందటే ‘నవజ్యోతి మహిళా పొదుపు సంఘం’ ఏర్పాటు చేశారు. ఈ సంఘం పూర్తిగా సెయింట్‌ ఆన్స్‌ ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతోంది. 

నవజ్యోతి పొదుపు సంఘం డైరెక్టర్‌ సిస్టర్‌ సంగీత, ఇతర మహిళలు

  • సంఘం సభ్యులంతా వనమూలికలకు సంబంధించిన మొక్కల్ని పెంచుతూ, వాటి ద్వారా చూర్ణాలు తయారు చేస్తూ నామమాత్రపు ధరలకే అమ్మకాలు సాగిస్తున్నారు. కేరళ నుంచి వచ్చే నిపుణుల సూచనలతో మందులు తయారు చేస్తున్నారు.జు అలాగే మహిళల్లో అక్షరాస్యత, శుభ్రత, వ్యక్తిగత-కుటుంబ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జు మొత్తం 20 రకాల వరకు మందులు తయారు చేస్తున్నారు. బృందంలో 20 మంది సభ్యులు క్రీయాశీలకంగా, ఇతరులు సహాయకులుగా పని చేస్తున్నారు. మందుల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముతో పాటు, మిషనరీ అందిస్తున్న ఆర్థిక సాయంతో వారంతా మొక్కల్ని పెంచుతూ, మందుల తయారు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రధాన సభ్యులుగా హేమలత, లక్ష్మి, తులసి సేవలు అందిస్తుండగా, సిస్టర్‌ సంగీత పర్యవేక్షిస్తున్నారు.

తయారు చేసిన చూర్ణాన్ని ప్యాకింగ్‌ చేస్తూ... 


సమష్టిగా సేవలు అందిస్తున్నాం..
- సిస్టర్‌ సంగీత, సంస్థ డైరెక్టర్‌

ఉసిరి, కరక్కాయ, మునగ, వేప బెరడు తదితర ఔషధ గుణాలు కలిగిన కాయలు, వేర్లను ఎండబెట్టి చూర్ణంగా చేయిస్తున్నాం. వాటి వినియోగంతో వివిధ అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇదే అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... సామాజిక బాధ్యతగా ఆరోగ్యం స్పృహ పెంచుతున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని