logo

కూలిన వంతెనలు.. రోడ్డంతా గుంతలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీఎన్‌ రహదారి అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తిగా ధ్వంసమైన రోడ్డుకు కాయకల్ప చికిత్స చేయడానికి కూటమి సర్కారు సిద్ధమవుతుంది.

Published : 20 Jun 2024 05:05 IST

విజయరామరాజుపేట దగ్గర కూలిన వంతెన 

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీఎన్‌ రహదారి అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తిగా ధ్వంసమైన రోడ్డుకు కాయకల్ప చికిత్స చేయడానికి కూటమి సర్కారు సిద్ధమవుతుంది. రెండు రోజుల కిందట ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే రాజు ఈ రోడ్డులో పర్యటించి కూలిన వంతెనలు, గుంతల రోడ్డును పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను పూర్తిచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

బీఎన్‌ రాష్ట్ర రహదారి ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధానమైనది. భీమునిపట్నం నుంచి నర్సీపట్నం వరకు సుమారు వంద కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. ఓడరేవు కేంద్రమైన భీమిలి నుంచి ఏజెన్సీకి ముఖద్వారమైన నర్సీపట్నానికి చేరుకోవడానికి బ్రిటీష్‌ పాలకుల హయాంలో దీన్ని నిర్మించారు. కాలక్రమేణా ఇది ఉమ్మడి విశాఖలో కీలకంగా మారింది. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ రోడ్డును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సరైన నిర్వహణ, మరమ్మతులు చేపట్టకుండా గాలికొదిలేసింది.

వడ్డాది వద్ద బీఎన్‌ రహదారిపై గుంతలు

పడకేసిన ఎన్‌డీబీ ప్రాజెక్టు పనులు

నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రాజెక్టు కింద ఈ రోడ్డు అభివృద్ధికి గతంలో రూ. 78 కోట్ల నిధులు మంజూరయ్యాయి. చోడవరం మండలం గంధవరం నుంచి రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వరకు రోడ్డును విస్తరించి అభివృద్ధి చేయడానికి మూడేళ్ల కిందట పనులు ప్రారంభించారు. కొంతవరకు పనులు చేపట్టినా, గుత్తేదారుడుకు బిల్లులు చెల్లించకపోవడంతో అవి అసంపూర్తిగా నిలిచిపోయాయి.

వర్షం పడితే చెరువే...

ఈ రోడ్డులో అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. వడ్డాది జంక్షన్‌లో విశాఖ డెయిరీ బల్క్‌మిల్క్‌ కేంద్రం, బంగారుమెట్ట కూడలి, ఎల్‌.సింగవరం, పొట్టిదొరపాలెం, బుదిరెడ్లపాలెం, రావికమతం మండలం గర్నికం, మేడివాడ ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రాకపోకలు సాగించడానికి వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. 

పెద్దేరుపై శిథిలమైన వంతెన

పట్టించుకోని వైకాపా ప్రభుత్వం

ఈ రోడ్డులో పురాతన వంతెనలు శిథిలమయ్యాయి. విజయరామరాజుపేట దగ్గర తాచేరుపై ఉన్న వంతెన గతేడాది డిసెంబరు 20న కూలిపోయింది. పాడేరు, మాడుగుల, వడ్డాది నుంచి వాహనాలు చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం వైపు వెళ్లాలంటే ఈ వంతెన మీదుగానే ప్రయాణించాలి. వంతెన కూలిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రయాణికులు వ్యయ ప్రయాసలకు గురయ్యారు. వారం రోజుల తర్వాత తాత్కాలికంగా డైవర్షన్‌ రోడ్డు నిర్మించి రాకపోకలను పునరుద్ధరించారు. వర్షాకాలంలో ఈ తాత్కాలిక మార్గం కొట్టుకుపోయి మళ్లీ రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. వడ్డాది దగ్గర పెద్దేరుపై వంతెన రెండు సంవత్సరాల కిందట కూలిపోయింది. నెలరోజులపాటు ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. నెల తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి కూలిన వంతెనపై నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. పక్కన రూ. కోటి వ్యయంతో కాజ్‌వే నిర్మాణం చేపట్టారు. దీన్ని తక్కువ ఎత్తులో నిర్మించడంతో తరచూ ముంపు బారిన పడుతోంది. గతేడాది భారీ వర్షాల సమయంలో పెద్దేరు పొంగి ప్రవహించడంతో మరలా రాకపోకలు స్తంభించిపోయాయి. శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులు రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించినప్పటికీ గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కొత్త వంతెన నిర్మాణం జరగకపోవడంతో ఏటా వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

  • బీఎన్‌ రోడ్డు పరిస్థితిపై ఆర్‌అండ్‌బీ మాడుగుల సెక్షన్‌ ఏఈ సాయిశ్రీనివాస్‌తో ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఈ రోడ్డును పరిశీలించి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని, దానికి అనుగుణంగా కార్యాచరణ తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. వడ్డాది వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని