logo

మత్స్య వేటలో..ప్రమాదాల బాట

చేపలరేవులో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో బోటు ఆపరేటర్లలో గుబులు రేగుతోంది. గత సీజన్‌లో కూడా పలు ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. 

Published : 20 Jun 2024 05:10 IST

భారీగా నష్టపోతున్న ఆపరేటర్లు
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

జెట్టీలో దగ్ధమవుతున్న బోట్లు (పాతచిత్రం)

చేపలరేవులో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో బోటు ఆపరేటర్లలో గుబులు రేగుతోంది. గత సీజన్‌లో కూడా పలు ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. 

నాటి ప్రమాదాల్లో నష్టపోయిన బోటు ఆపరేటర్లకు పూర్తిస్థాయిలో పరిహారం రాకపోవడంతో బాధితులు ఇంత వరకు కోలుకోలేదు. ఆయా ఘటనలు మరువక ముందే మళ్లీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనెల 15వ తేదీ నుంచి తూర్పు తీరంలో చేపలవేట ప్రారంభమైంది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో బోట్లలో అత్యధికం వేటకు వెళ్లాయి.

అలా అగ్గి: చేపలరేవు జెట్టీ నుంచి వేటకు వెళ్లిన మూడు రోజుల తర్వాత ఓ బోటు నడిసంద్రంలో దగ్ధమైంది. బోటు, దానిలో ఉన్న వస్తు సామగ్రి కలిపి రూ. లక్షల్లో యజమానికి నష్టం జరిగిందని అంచనా. అందులో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ప్రాణనష్టం తప్పింది. చేపలరేవులో 700 మర పడవలు ఉన్నాయి. మరో వెయ్యి వరకు ఇంజిను, నాటు పడవలు ఉన్నాయి. మరపడవలు, ఇంజిను పడవలు డీజిల్‌తో నడుస్తాయి. లీటరుకు రూ.9 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఇటీవల కాలంలో డీజిల్‌ ధర గణనీయంగా పెరిగింది. రాయితీ పోను లీటరు రూ.90 చెల్లించాల్సి వస్తోంది. వేటకు అయ్యే ఖర్చులో ఇదే అత్యధికంగా ఉండడంతో ఆపరేటర్లపై ఆర్థిక భారం పడుతోంది. దీంతో రూ.80కు లభ్యమయ్యే బయో డీజిల్‌ వినియోగిస్తున్నారు. దానికి మండే స్వభావం అధికంగా ఉంటుందని, ఏమాత్రం తేడా వచ్చినా మంటలు రేగుతాయని, దీని వల్ల బోట్లకు నిత్యం ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


వివిధ మార్గాల్లో రాక..

మార్కెట్‌లో బయో డీజిల్‌ను అధికారికంగా విక్రయించడం లేదు. కొందరు ఆపరేటర్లు కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో రప్పించుకొని వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి అంశాల జోలికి వెళ్లకుండా ఉంటే ముప్పు తప్పుతుందని చెబుతున్నారు. గత ఏడాది నవంబరులో చేపలరేవులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 40 బోట్లు దగ్ధమయ్యాయి. కొన్ని బోట్లలో బయో డీజిల్‌ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైందని తెలిసింది. దీనిపై మత్స్యశాఖ అధికారులు ఆపరేటర్లకు అవగాహన కల్పించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


జెట్టీలో మునిగితే పరిహారం కష్టమే:  జెట్టీలో మూడు రోజుల కిందట ఒక బోటు మునిగిపోయింది.  బోటు యజమానికి భారీగానే నష్టం జరిగింది. జెట్టీలో బోటు మునిగిపోతే ప్రభుత్వ పరంగా నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు. వేట సాగిస్తుండగా మునిగిపోతే పరిహారం ఇస్తారు. అగ్ని ప్రమాదంలో నష్టపోతే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. నడిసంద్రంలో బోటు దగ్ధం కావడంపై మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ఘటనలో రూ.20లక్షల వరకు నష్టం జరిగిందని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వస్తే పరిహార చెల్లింపులు జరగనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని