logo

రసకందాయంలో ‘మహా’ రాజకీయం..!

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో మహా విశాఖ నగరపాలక సంస్థ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కౌన్సిల్‌ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారా అని తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఎదురు చూస్తున్నారు.

Published : 20 Jun 2024 05:14 IST

సమరోత్సాహంలో కూటమి నాయకులు 
కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుకు డిమాండ్‌
ముందుకు రాని పాలకవర్గ సభ్యులు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు (పాతచిత్రం)

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో మహా విశాఖ నగరపాలక సంస్థ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కౌన్సిల్‌ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారా అని తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఎదురు చూస్తున్నారు. మరో పక్క వైకాపా కార్పొరేటర్లలో అంతర్మథనం మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఏప్రిల్‌ నుంచి పాలకవర్గ (కౌన్సిల్‌) సమావేశం జరగలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలైంది. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతలు స్వీకరించినా, కౌన్సిల్, స్థాయీ సంఘ సమావేశాల ఏర్పాటుపై మేయర్, ఇతర వైకాపా సభ్యులు చొరవ చూపక పోవడం గమనార్హం.


ముఖం చాటేస్తున్న వైకాపా కార్పొరేటర్లు..

వైకాపా తరఫున అత్యధికంగా కార్పొరేటర్లు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నగర పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా దక్కించుకోలేదనే చర్చ వారిలో నడుస్తోంది. మరో పక్క తెదేపా, జనసేన, భాజపా తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కలిసి రావడంతో వారంతా సమరోత్సాహంలో ఉన్నారు. జీవీఎంసీలో జరిగిన అవినీతిపై నిలదీయడానికి సిద్ధంగా ఉండడంతో వైకాపా నాయకులు స్థాయీ, కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించడానికి ముందుకు రావడంలేదని సమాచారం. జీవీఎంసీ మేయరు, ఉప మేయర్లు, ఫ్లోర్‌ లీడర్‌ కార్యాలయానికి వచ్చినా కొద్ది సేపు ఉండి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా అధిక శాఖం ముఖం చాటేస్తున్నారు. మరో పక్క అధికార మార్పిడి జరగడంతో, వైకాపా నాయకులతో అంటకాగిన అధికారుల్లో అలజడి నెలకొంది. త్వరలో బదిలీలు కూడా ఉంటాయన్న సమాచారంతో వారంతా విధులపై దృష్టి సారించడంలేదు.

సహకరించని జీవీఎంసీ అధికారులు: కౌన్సిల్, స్థాయీ సంఘ సమావేశం నిర్వహించడానికి జీవీఎంసీ అధికారులు కూడా సహకరించడంలేదని తెలిసింది. ప్రభుత్వం మారిపోవడంతో వైకాపా నాయకుల ప్రతిపాదనలు అజెండాలో పెడితే కూటమి సభ్యులు వ్యతిరేకించే అవకాశం ఉందని, అది తమకు ఇబ్బందిగా మారుతుందనే ఆలోచనలో కమిషనర్, ఇతర అధికారులు ఉన్నట్లు సమాచారం. స్థాయీ సంఘ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పాలకవర్గంలోని కీలక నాయకులు సూచించినా, ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని జీవీఎంసీ సిబ్బంది నుంచి సమాధానం రావడం గమనార్హం.


ఆందోళనలో గుత్తేదారులు

ఎన్నికల ముందు కొన్ని అభివృద్ధి పనులను నామినేషన్‌ విధానంలో గుత్తేదారులకు కేటాయించారు. వారికి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏటా గుత్తకు ఇచ్చే పనులకు సంబంధించిన దస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి ఆయా పనులకు తిరిగి టెండర్లు ఆహ్వానించడం, ఇప్పటి వరకు నామినేషన్‌పై చేసిన పనులకు ఆమోదం తెలపడం వంటి అంశాలను అజెండాలో పొందుపరచాల్సి ఉంది. ప్రభుత్వం మారిపోవడంతో నామినేషన్‌ పనులపై కూటమి సభ్యులు నిలదీసే అవకాశం ఉంది. దీంతో ఆయా పనులకు బిల్లులు మంజూరవుతాయా..లేదా అనే ఆందోళనలో గుత్తేదారులు ఉన్నారు. 

  • మరో పక్క స్థాయీ సంఘం ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెదేపా, వైకాపా నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే నెలలో స్థాయీ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు స్థాయీ సంఘం సభ్యులను ఎన్నుకోగా, అందులో ఒక్క ప్రతిపక్ష సభ్యుడు కూడా లేరు. ఈసారి అందులో పాగా వేయడానికి కూటమి సభ్యులు సిద్ధమవుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని