logo

అడిగేదెవరు.. చూసేదెవరు!

రుషికొండ బ్లూఫ్లాగ్‌ బీచ్‌ నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఓ ఏజెన్సీకి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు నిర్వహణ బాధ్యతలు అప్పగించగా... అప్పటి నుంచి వారు ఆడిందే ఆట... పాడిందే పాటగా మారిపోయింది.

Updated : 20 Jun 2024 05:35 IST

రుషికొండ బీచ్‌లో ప్రైవేటు పెత్తనం!
శుభ్రత మరచి... సొమ్ములపై ధ్యాస
ఈనాడు, విశాఖపట్నం

రుషికొండ బీచ్‌

రుషికొండ బ్లూఫ్లాగ్‌ బీచ్‌ నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఓ ఏజెన్సీకి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు నిర్వహణ బాధ్యతలు అప్పగించగా... అప్పటి నుంచి వారు ఆడిందే ఆట... పాడిందే పాటగా మారిపోయింది. టికెట్ల వసూలు, బీచ్‌లో శుభ్రత అన్నీ వారే చూడాల్సి ఉంది. ఈ క్రమంలో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.


ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయం అండదండలతోనే అవకతవకలకు పాల్పడుతున్నారని, నిర్వహణ ఎలా ఉన్నా బిల్లులు మంజూరైపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికంటే గతంలోనే బీచ్‌ పరిసరాలు బాగుండేవి. ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చాక తీసికట్టుగా మారాయి. బీచ్‌ పరిసరాల్లోనే చాలా మంది మద్యం తాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.


కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి పాత విధానాన్నే అమల్లోకి తీసుకురావాలని సందర్శకులు డిమాండు చేస్తున్నారు. త్వరలో బ్లూఫ్లాగ్‌ ధ్రువీకరణ కమిటీ వస్తున్న నేపథ్యంలో కొంత మెరుగులు దిద్దుతున్నా ...పూర్తి ప్రక్షాళనపై దృష్టి  సారించాలని కోరుతున్నారు.


సిబ్బంది ఉన్నట్లు చూపించి..

అంతర్జాతీయ ప్రమాణాలకు వీలుగా బ్లూఫ్లాగ్‌ బీచ్‌లో ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేపట్టాలి. ఏపీటీడీసీ హయాంలో ఉన్నప్పుడు సుమారు 50 మందికిపైగా సిబ్బందిని నియమించుకొని అన్ని రకాల పనులు చేసేవారు. శానిటరీ సిబ్బంది, బీచ్‌ గార్డులు ఉండేవారు. ఇందుకు ప్రతి నెలా రూ.20 లక్షల వరకు ఖర్చయ్యేది. ఈ నిర్వహణ బాధ్యతలను ఏపీటీడీసీ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. వీరికి ప్రతి నెలా రూ.12 లక్షల వరకు చెల్లిస్తుంది. అయితే...అసలు మోసం ఇక్కడే జరుగుతోంది. తక్కువ మంది సిబ్బందితో నిర్వహణ కొనసాగిస్తూనే ఎక్కువ మంది ఉన్నట్లు బిల్లులు తీసుకుంటున్నారని సమాచారం.


  • ఏజెన్సీ ఒక బీచ్‌ ఇంజినీరు, 12 మంది సెక్యూరిటీ, 30 మంది బీచ్‌ క్లీనర్లు, నలుగురు లైఫ్‌గార్డులు, ముగ్గురు పర్యవేక్షకులు, టికెట్‌ కౌంటర్‌ సహాయకులు ఆరుగురు, ఒక ఎలక్ట్రిషీయన్‌ను నియమించుకొని పనులు చేస్తున్నట్లు లెక్క చూపిస్తున్నారు. వాస్తవానికి అక్కడ 40 మందిలోపే పనిచేస్తున్నారు. 
  • 30 మంది బీచ్‌ క్లీనర్లను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సగం మందైనా కనిపించడం లేదు. ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాక శుభ్రతా చర్యలు గాడి తప్పాయని, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. 
  • ఒక్కో వ్యక్తికి రూ.12 వేల చొప్పున ప్రతి నెలా రూ. లక్షల్లో బిల్లులు ఏపీటీడీసీకి పంపిస్తున్నారు. 
  • సెక్యూరిటీ, టికెట్‌ సహాయకులకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.15 వేలు చొప్పున 18 మందికి  బిల్లులు పెడుతున్నారు. వీరిలో చాలామంది కనిపించడం లేదు. ఇవేకాకుండా ఇతర నిర్వహణ సామగ్రికి రూ.1.50 లక్షలు వరకు వసూలు చేస్తున్నారు.

ఆదాయం భారీగా వస్తున్నా..

బీచ్‌లో ఇలా.. 

పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఆదాయం భారీగా వస్తున్నా బీచ్‌ నిర్వహణ ఆ స్థాయిలో లేకపోవడంతో సందర్శకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ టికెట్ల వసూలు ప్రైవేటు సంస్థే చేస్తుంది. ఈ క్రమంలో డబ్బులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది మే నెల వరకు పార్కింగు రుసుం, దుస్తులు మార్చుకునే గదుల వద్ద వసూలు చేసే రుసుం రూపేణ  రూ.70 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. ప్రతి నెలా రూ.10 లక్షలకుపైనే అధికారికంగా వసూలు చేస్తున్నారు. అయితే... మరికొంత పక్కదారి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని