logo

అమెరికా డాలర్లు దోచుకుపోయిన ఆరుగురి అరెస్టు

అమెరికా డాలర్లకు అధిక మొత్తంలో భారతదేశ నగదు ఇప్పిస్తానని నమ్మబలికి వాటిని తీసుకొని పరారైన ముఠా సభ్యులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

Published : 21 Jun 2024 02:59 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: అమెరికా డాలర్లకు అధిక మొత్తంలో భారతదేశ నగదు ఇప్పిస్తానని నమ్మబలికి వాటిని తీసుకొని పరారైన ముఠా సభ్యులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా క్రైమ్‌ ఏఎస్పీ టి.సర్కార్‌ గురువారం వెల్లడించారు. విశాఖపట్టణానికి చెందిన వెలగల శివశంకర్‌రెడ్డి కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేసి ఇంటికి వచ్చినప్పుడల్లా కుటుంబీకుల వద్ద కొంత మొత్తంలో డాలర్లు ఉంచేవారు. అలా 50 వేల డాలర్లు (రూ.41.50 లక్షలు) వరకు దాచారు. ఇటీవల ఉద్యోగం మానేసి స్వగ్రామం వచ్చేశారు. తన వద్దనున్న డాలర్లను భారతదేశ కరెన్సీగా మార్చాలనుకున్నారు. ఈ క్రమంలో అక్కడి మాధవధార ప్రాంతానికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ కర్రి కనకరాజుతో పరిచయం ఏర్పడింది. అతడు రూ.80 విలువ ఉన్న డాలర్‌కు రూ.98 ఇప్పిస్తానని నమ్మబలికారు. అతను చెప్పిన ప్రకారం మే 30న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలోని జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల వద్దకు శివశంకర్‌రెడ్డి వెళ్లారు. అక్కడ పదిమంది ముఠా సభ్యులు ఆయనపై దాడిచేసి డాలర్లతో ఉన్న బ్యాగును లాక్కొని పరారయ్యారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికను వినియోగించి ఈ ఘటనలో మొత్తం 11 మంది నిందితులుగా గుర్తించారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేశారు. కనకరాజుతో పాటు విజయనగరం అశోక్‌నగర్‌కి చెందిన గణగల్ల అజయ్‌కుమార్, అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు టీచర్స్‌కాలనీకి చెందిన వంతల విష్ణు, పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన  సొంగా రమేష్, విజయవాడ గాంధీనగర్‌ వెంకటేశ్వరస్వామి వీధికి చెందిన ఉడత రవి, అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తునివలస గ్రామానికి చెందిన కోడూరు నవీన్‌ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వారినుంచి 36 వేల డాలర్లు (రూ.29.88 లక్షలు), రెండుకార్లు స్వాధీనం చేసుకున్నారు. చెంచు భార్గవిరంగస్వామి, సముద్రాల మమత, పైలా ప్రసాద్, గొట్లు రవితేజ, మరో గుర్తుతెలియని వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన డీఎస్పీ కె.శ్రీనివాసమూర్తి, సీఐ సురేష్‌బాబు, ఎస్సైలు శ్రీహరిరావు, అయ్యప్పరెడ్డి, ఇతర బృంద సభ్యులకు ఎస్పీ జగదీష్‌ రివార్డులు ప్రకటించి అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని