logo

‘భూ కుంభకోణంపై ఏసీబీ కోర్టులో విచారణ’

వీఎంఆర్‌డీఏ చేపట్టిన భూ సమీకరణ ముసుగులో జరిగిన భూ కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) కోర్టులో ఛార్జిషీటు దాఖలైందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ వెల్లడించారు.

Published : 21 Jun 2024 03:00 IST

మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, చిత్రంలో న్యాయవాది గిరిధర్‌

వన్‌టౌన్, న్యూస్‌టుడే: వీఎంఆర్‌డీఏ చేపట్టిన భూ సమీకరణ ముసుగులో జరిగిన భూ కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) కోర్టులో ఛార్జిషీటు దాఖలైందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ వుడా (విశాఖ నగరాభివృద్ధి సంస్థ)గా ఉన్న సమయంలో 2012లో భారీ కుంభకోణం జరిగిందన్నారు. ప్రభుత్వ భూములకు బోగస్‌ పట్టాదారులను సృష్టించి ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెట్టారని ఆయన తెలిపారు. వాటిపై తాము పోరు సాగించి.. అనిశాకు అప్పట్లో ఫిర్యాదు చేశామన్నారు. గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఆయన తెదేపా న్యాయ విభాగ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి గిరిధర్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

 అప్పట్లో సీఆర్‌ సంఖ్య 04/2012తో అనిశా కోర్టులో కేసు నమోదైందన్నారు. ఇప్పుడు ఈ కేసు విచారణకు వచ్చిందన్నారు. భూ కుంభకోణంలో నాటి కాంగ్రెస్‌ పార్టీ పెద్దల హస్తం సైతం ఉందన్నారు. దీనిలో ప్రమేయం ఉన్న జీవీఎంసీ, వుడా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన 11 మంది అధికారులపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయని చెప్పారు. అధికారులు, నాయకులు కుమ్మక్కై విలువైన భూములను కొట్టేశారన్నారు. మధురవాడ, రుషికొండ, ఎంవీపీకాలనీ, పాండురంగాపురం ప్రాంతాల్లో ల్యాండ్‌ యూజ్‌ ప్లాన్‌కు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు నాటి వుడా అధికారులు అప్పనంగా భూములను కేటాయించడాన్ని తాను కోర్టులో సవాలు చేసినట్లు చెప్పారు. దీని వెనుక అప్పటి రాష్ట్ర మంత్రులుగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణల హస్తం ఉందన్నారు. గజం ధర రూ.లక్ష పలుకుతున్న పాండురంగాపురం సర్వే సంఖ్య1011లో కొన్ని ప్లాట్లను సృష్టించి కేవలం రూ.118లకే రిజిస్ట్రేషన్లు చేశారన్నారు. ఇదే విషయాన్ని తాము కోర్టు దృష్టికి తెచ్చామన్నారు. ప్రభుత్వ భూమిని ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు కేటాయించామని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి పేరిట 5 ఎకరాల చొప్పున కేటాయింపులు జరిపారన్నారు. ఎంవీపీ కాలనీలో ల్యాండ్‌ యూజ్‌ ప్లాన్‌ను పక్కన పెట్టి ప్రైవేటు పార్టీలకు విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. ఇప్పుడు ఆయా అంశాలకు సంబంధించి అనిశా కోర్టులో ఛార్జిషీటు దాఖలవడంతో అసలు బాగోతం వెలుగు చూడనుందని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకొనే వరకు పోరు సాగిస్తామని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని