logo

‘షిప్‌యార్డు’.. పడిలేచిన కెరటం!

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ కేంద్రమైన విశాఖపట్నం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు(రక్షణ ఉత్పత్తుల సంస్థ)’ పడిలేచిన కెరటంలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

Updated : 21 Jun 2024 04:27 IST

నేడు 84వ వ్యవస్థాపక దినోత్సవం
న్యూస్‌టుడే, సింధియా

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ కేంద్రమైన విశాఖపట్నం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు(రక్షణ ఉత్పత్తుల సంస్థ)’ పడిలేచిన కెరటంలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దేశ, రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి తనవంతుగా సేవలు అందజేస్తూ జాతీయస్థాయిలో ఎనలేని కీర్తిని సముపార్జించింది. నేడు సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా...ప్రస్థాన పర్వం తెలుసుకుందాం.

ఎంతో చరిత్ర ఉన్న సంస్థకు ఓ దశలో ఆర్థిక వనరులు సన్నగిల్లి కార్మికవర్గాలకు ఎన్నో సవాళ్లు విసిరింది. 2010లో కేంద్ర రక్షణ ఉత్పత్తుల సంస్థకు బదిలీ కావడంతో సంస్థకు ఆర్థిక చేయూత దక్కింది. ప్రైవేట్‌ సంస్థల పోటీని తట్టుకొని ఆర్డర్లు చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

తొలినౌక ‘జల ఉష’ జలప్రవేశ కార్యక్రమంలో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ

తొలి నౌక నిర్మాణం..: మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త శేఠ్‌వాల్‌చంద్‌ హీరాచంద్‌ ఆధ్వర్యంలో 1941 జూన్‌ 21న సింధియా సమీప సముద్ర తీరంలో నౌకల నిర్మాణ సంస్థకు పునాది పడింది. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ రావాల్సి ఉన్నా, స్వాతంత్య్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండటంతో అప్పటి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. తొలుత ‘సింధియా స్టీమ్‌ నావిగేషన్‌ లిమిటెడ్‌’గా పేరు పెట్టారు. ఆ తర్వాత క్రమేపీ ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌’గా రూపాంతరం చెందింది. తొలి నౌక ‘జల ఉష’ను స్వాతంత్య్రం అనంతరం 1948 మార్చి 14న నాటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేయించారు.

నాడు వేలల్లో... నేడు వందల్లో: ఎంతో పేరొందిన షిప్‌యార్డులో ఒకానొక దశలో ఏకంగా 10వేల మంది వరకు ఉద్యోగులు పని చేసేవారు. 1990 నుంచి సంస్థకు సరైన ఆర్డర్లు లేక ఆర్థికంగా బలహీన పడడం ప్రారంభమైంది. దీంతో చాలా మంది  ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణతో వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. 2005 తర్వాత ఓ ప్రైవేట్‌ సంస్థ ఆధ్వర్యంలో పది నౌకల నిర్మాణ ఆర్డర్లు షిప్‌యార్డు చేతికి వచ్చాయి. దీంతో దాదాపు పదేళ్ల పాటు ఉద్యోగులకు ఉపాధి, ఆర్థిక ఆసరా దక్కింది. అయితే నాటి నుంచి ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో పాటు, ఏటా వందలాది మంది ఉద్యోగ విరమణ చేస్తుండటంతో.. ప్రస్తుతం 300 మంది స్టాఫ్‌ కేటగిరీలో, 110 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇవీ విజయాలు..!

 •  భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల మీడియం రీఫిట్‌ పనులు పూర్తి చేయడం.
 •  విదేశీ నౌకలకు అత్యవసర మరమ్మతులు సకాలంలోనే నిర్వహించడం.
 • నౌకాదళానికి చెందిన రెండు డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌ను ఏకకాలంలో జలప్రవేశం చేయించడం.
 • కొత్తగా రూ.20 వేల కోట్ల విలువైన ‘ఫ్లీట్‌ సపోర్టు వెసల్స్‌’ ఆర్డర్‌ దక్కించుకోవడం.
 • ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా మూడు విడతలుగా క్వార్టర్స్‌ సిద్ధం చేయడం.
 •  కాలనీలో పార్కులు, రహదారులు ఆధునికీకరించడం.
 • గత ఏడాదిలో సంస్థ ఏకంగా 21 ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకోవడం.

ఇవీ సమస్యలు...

 •  సంస్థలో కార్మిక నైపుణ్యం కొరవడుతోంది. అధికారుల నియామకం తప్ప, టెక్నీషియన్ల నియామకం చేపట్టడం లేదు.
 •  నౌకాదళంలో సర్వీసు చేసిన వారికే తప్ప, స్థానికంగా ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు.
 •  ఎల్‌ సిరీస్, ఎండీ సొసైటీ కార్మికులను క్రమబద్ధీకరించకపోవడం.
 • పదోన్నతుల విధానం పక్కాగా అమలు చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని