logo

ఆచరిస్తే.. రాజ‘యోగ’మే..!!

ఉరుకుల పరుగుల జీవితంలో బాల్యం నుంచే ఒత్తిడి మొదలవుతోంది. పాఠశాల దశలో మంచి మార్కులు సాధించాలనే పోటీతత్వం.. యుక్తవయసులో ఉద్యోగం, పనిభారంతో ఒత్తిడి.. తర్వాత కుటుంబ సమస్యలు.. ఇలా అన్ని దశల్లో ఒత్తిడికి గురై మానసిక, శారీరక అనారోగ్యం బారిన పడుతున్నారు.

Published : 21 Jun 2024 03:45 IST

నిత్య సాధనతో ఆరోగ్యం.. ఆనందం..!
నేడు ప్రపంచ యోగా దినోత్సవం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం

ఉరుకుల పరుగుల జీవితంలో బాల్యం నుంచే ఒత్తిడి మొదలవుతోంది. పాఠశాల దశలో మంచి మార్కులు సాధించాలనే పోటీతత్వం.. యుక్తవయసులో ఉద్యోగం, పనిభారంతో ఒత్తిడి.. తర్వాత కుటుంబ సమస్యలు.. ఇలా అన్ని దశల్లో ఒత్తిడికి గురై మానసిక, శారీరక అనారోగ్యం బారిన పడుతున్నారు. కొవిడ్‌ తర్వాత ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. చాలా మంది యువత అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు.

యోగాసనాల ద్వారా మానసిక, శారీరక సమస్యల నుంచి బయటపడగలమని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని స్పష్టం చేస్తున్నారు. విభిన్న లక్ష్యాలతో తొమ్మిదేళ్లుగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘మహిళా సాధికారతకు యోగా’ పేరిట నిర్వహిస్తున్నారు. నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

కొవిడ్‌ తర్వాత అవగాహన: దీర్ఘకాలంగా యోగా సాధన చేస్తున్న వ్యక్తులు కొవిడ్‌ విపత్తు సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని వైద్యులు గుర్తించారు. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో కొవిడ్‌ మరణాలు రేటు తక్కువగా ఉండటానికి యోగా ఒక కారణమని చెబుతున్నారు. కొవిడ్‌ తర్వాత యోగాసనాల ప్రాముఖ్యతపై చాలా మందిలో అవగాహన పెరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నారు. పవర్‌ యోగా, బరువు తగ్గడానికి, శరీర సౌందర్యానికి, వృద్ధులకు.. ఇలా అందరి అవసరానికి తగ్గట్లుగా మార్పులు చేశారు. యోగాతోపాటు ధ్యాన సాధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉదయం 6:00 నుంచి 7:30 వరకు అనేక మంది ఔత్సాహికులు యోగా సాధన చేస్తుంటారు. చిన్న పిల్లల నుంచి 85 ఏళ్ల వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

యోగా గ్రామంలో వివిధ కోర్సులు..

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ‘యోగా గ్రామం’ విశేష సేవలందిస్తూ.. వేలాది మంది నిపుణులను తీర్చిదిద్దింది. నాలుగు దశాబ్దాల క్రితం ఏయూలో నాటి ఉపకులపతి దివంగత ఆచార్య కె.రామకృష్ణారావు మార్గదర్శకత్వంలో దీన్ని ప్రత్యేక విభాగంగా ఏర్పాటుచేశారు. విశాఖ సాగర తీరంలోని ఈ విభాగం క్రమంగా యోగా గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటివరకు లక్షలాది మంది శిక్షణ పొందారు. జిల్లా యోగా సంఘంతో కలసి ఉత్తరాంధ్ర ప్రజలకు యోగాసన పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా శ్రీలంక సహా పది కేంద్రాలకు సేవలను విస్తరించారు. ఏయూ ద్వారా ఆయా చోట్ల పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విభాగంలో పీˆజీ డిప్లమో, ఎంఏ కోర్సులు అందిస్తున్నారు. 6 నెలలు, ఏడాది పీజీ డిప్లమో కోర్సులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష, వయోపరిమితి లేదు.

ఉద్యోగులు నేర్చుకునేందుకు వీలుగా తీర్చిదిద్దిన ఈ కోర్సులో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వడంతోపాటు సాధన చేయిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, వైద్యులు ఈ కోర్సులో చేరుతున్నారు. ఎంఏ కోర్సులో 30 సీట్లుండగా.. ప్రవేశ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినవారికి, రిజర్వేషన్‌ ప్రకారం కేటాయిస్తున్నారు. యోగాకు అనుసంధానంగా ఆయుర్వేదం, నేచురోపతి విభాగాలు పనిచేస్తున్నాయి.

పాఠశాల దశలోనే యోగా కోర్సుండాలి

మా నాన్న సహకారంతో పన్నెండో యేట నుంచే యోగా చేస్తున్నా. మా కుటుంబ సభ్యులందరూ యోగా నేర్చుకున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగ విరమణ చేసిన వారే ఎక్కువగా యోగా సాధన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోజులో గంట నుంచి గంటన్నర సమయం యోగాకు కేటాయించాలి. బాల్యం నుంచే సాధన ప్రారంభిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. పాఠశాలల్లో యోగా కోర్సును చేరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. పిల్లలకు పాఠశాల దశ నుంచే యోగా ప్రయోజనాలపై అవగాహన వస్తుంది.

 ప్రొఫెసర్‌ భానుకుమార్, డైరెక్టర్, యోగా విభాగం, ఏయూ
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని