logo

దూసుకొచ్చిన మృత్యువు..!

కొద్దిసేపట్లో పాఠశాలకు వెళ్లాల్సిన బాలుడిని మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ కబళించింది. జాతీయ రహదారి చినగంట్యాడ కూడలి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 22 Jun 2024 03:26 IST

లారీ ఢీకొని బాలుడి దుర్మరణం

తరుణ్‌ (పాతచిత్రం)

గాజువాక, న్యూస్‌టుడే : కొద్దిసేపట్లో పాఠశాలకు వెళ్లాల్సిన బాలుడిని మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ కబళించింది. జాతీయ రహదారి చినగంట్యాడ కూడలి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కోటేశ్వరరావు, బాధితుల వివరాల ప్రకారం... గాజువాక శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన తాపీమేస్త్రి సనపల అప్పలనాయుడు, సహస్ర దంపతులకు తరుణ్‌(10), వినయ్‌కృష్ణ సంతానం ఉన్నారు. గాజువాక ప్రైవేటు పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న తరుణ్‌.. ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో తండ్రి మార్కెట్‌కు బయలుదేరడంతో తానూ వస్తానని మారాం చేసి బైక్‌ ఎక్కాడు. తండ్రీకొడుకులు పని ముగించుకుని తిరిగి వస్తుండగా చినగంట్యాడ కూడలిలో వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అప్పలనాయుడు బైక్‌తో సహా రోడ్డు పక్కకు పడిపోగా, తరుణ్‌ లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు. చక్రాలు దూసుకెళ్లడంతో బాలుడి తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పలనాయుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ‘ఇప్పుడే వచ్చేస్తానమ్మా అని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా’’.... అంటూ తల్లి సహస్ర విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిర్లక్ష్యంగా లారీని నడిపిన డ్రైవర్‌ కమలేశ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజువాక ట్రాఫిక్‌ సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని