logo

గుడ్డు కథలు కాదు.. ‘నిబంధనలు పాటించాలిగా?’

‘నిబంధనలు ఎవరికైనా ఒకటే. సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా. సామాన్యులు అనుమతుల్లేకుండా చిన్న రేకుల షెడ్డు వేస్తే అధికారులు వెంటనే వెళ్లి కూలగొడతారు.

Updated : 25 Jun 2024 06:07 IST

గాజువాకలో అమర్‌నాథ్‌ బాగోతం వెలుగులోకి
జీవీఎంసీ అనుమతుల్లేకుండా వాణిజ్య సముదాయ నిర్మాణం
భవనాలు పూర్తయినా... నేటికీ పన్నులు చెల్లించని వైనం!
మాస్టర్‌ ప్లాన్‌ రహదారి విస్తరణ నిబంధనలకు తూట్లు
ఈనాడు- విశాఖపట్నం

మాజీ మంత్రి అమర్‌నాథ్‌ పేరుతో గాజువాకలో నిర్మించిన వాణిజ్య సముదాయ భవనం

‘నిబంధనలు ఎవరికైనా ఒకటే. సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా. సామాన్యులు అనుమతుల్లేకుండా చిన్న రేకుల షెడ్డు వేస్తే అధికారులు వెంటనే వెళ్లి కూలగొడతారు. అదే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నది పక్కనే నిర్మాణాలు చేపడితే ఒక న్యాయమా? అధికారంలోని వ్యక్తులే మాకు రూల్స్‌ వర్తించవు అంటే వ్యవస్థ బతకదు’...

ఇవీ ‘ప్రజావేదిక’ కూల్చివేత తరువాత జగన్‌ అసెంబ్లీలో చెప్పిన నీతులు. ఐదేళ్ల వైకాపా పాలనలో తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి, వైకాపా కార్యాలయాల వరకు దేనికీ పూర్తి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. ఇక మీడియా ముందు గుడ్డు కథలు చెప్పే మాజీ మంత్రి అమర్‌నాథ్‌  కూడా నిబంధనలు తుంగలో తొక్కి గాజువాకలో అక్రమంగా భారీ వాణిజ్య సముదాయం నిర్మించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు చెందిన ఈ భవనాన్ని అధికారులు గతంలో కూల్చేశారు

మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు విస్తరణ సాకుతో

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా గాజువాకలో ప్లాన్‌ అనుమతులతో వాణిజ్య భవనం నిర్మించారు. మాస్టర్‌ ప్లాన్‌ రహదారి విస్తరణకు భూమి వదలకుండా నిర్మాణాలు చేపట్టారంటూ పూర్తయిన భవనాన్ని సగానికి కూలగొట్టారు. పోలీసు బందోబస్తు మధ్య ఆగమేఘాలపై కూల్చేశారు. నాడు వైకాపా అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఇది ఒకటి.

ఆ నిబంధన అమర్‌కు వర్తించదా?

జీవీఎంసీ 70వ వార్డులో చట్టివానిపాలెం వద్ద జాతీయ రహదారిని ఆనుకుని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ జి+4 వాణిజ్య భవనాన్ని నిర్మించారు. ఈ జాతీయ రహదారిని మాస్టర్‌ప్లాన్‌ (2041)లో భాగంగా 200 అడుగుల నుంచి 266 అడుగులు విస్తరించాలని జీవో 136లో పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకారం అమర్‌ నిర్మించిన భవనం వైపు 33 అడుగుల రోడ్డు విస్తరణ జరగాల్సి ఉంది. దీంతోపాటు మరో ఇరవై అడుగులు సెట్‌బ్యాక్‌ వదిలి భవన నిర్మాణం చేపటాల్సి ఉంటుంది. అంటే 53 అడుగులు వదిలి నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా, కేవలం ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరవై అడుగుల్లోపే భారీ భవనం నిర్మించారు.  సెట్‌బ్యాక్‌ కూడా తగినంత వదల్లేదు. అయినా జీవీఎంసీ అధికారులు కళ్లు మూసుకున్నారు.

పట్టణ ప్రణాళిక అనుమతుల్లేకుండానే..: మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు  చట్టివానిపాలెం వద్ద జాతీయ రహదారిని ఆనుకుని సర్వే నెంబరు 79/7ఏలో సుమారు 447.33 చదరపు గజాల స్థలం ఉంది. 2021 ఫిబ్రవరి 9న రూ.10వేలు చెల్లించి ప్లాన్‌కు దరఖాస్తు పెట్టారు. ఎల్‌టీపీ లాగిన్‌లో పెట్టాక.. ఎంత ఫీజులు చెల్లించాలో చూపించినప్పటికీ 1236 రోజులుగా (ఈ నెల 24వ తేదీ వరకు) పన్నులు చెల్లించని కారణంగా దరఖాస్తు ముందుకు కదల్లేదు. 46 చదరపు గజాల గిఫ్ట్‌డీడ్‌ సైతం జీవీఎంసీకి చేయలేదు. జీవీఎంసీ అనుమతుల్లేకుండానే భవనాలు మాత్రం పూర్తి చేసేశారు. ఎన్నికల సమయంలో ఈ భవనంలోనే పార్టీ కార్యాలయం సైతం ప్రారంభించారు. గతేడాది నవంబరు, డిసెంబరు మొదటి వారాల్లో అనుమతుల్లేని నిర్మాణంపై జోన్‌-6 నుంచి రెండుసార్లు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసులు తీసుకోకుండా.. అధికార అండతో జీవీఎంసీలో ఒత్తిళ్లు తెచ్చి అమర్‌ నిర్మాణం పూర్తి చేశారు. తాజాగా వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏపీసీ స్వయంగా అమర్‌ ఇంటికి వెళ్లి నోటీసులందించారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే ఉద్దేశపూర్వక నేరంగా పరిగణించబడుతుందని అందులో హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని