logo

వైకాపా సర్పంచి అధికార ‘దాహం’..

వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారం అండ చూసుకుని గుడ్డిప సర్పంచి గుమ్మాల గణేశ్వరరావు ఊరందరి దాహం తీర్చే తాగునీటి పథకాన్ని సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు.

Published : 11 Jul 2024 02:31 IST

సొంత స్థలంలో ప్రభుత్వ నిధులతో తాగునీటి పథకం

సర్పంచి స్థలంలో సోలార్‌ తాగునీటి పథకం

రావికమతం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారం అండ చూసుకుని గుడ్డిప సర్పంచి గుమ్మాల గణేశ్వరరావు ఊరందరి దాహం తీర్చే తాగునీటి పథకాన్ని సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా ఈ గ్రామానికి రూ. 7.5 లక్షలతో సోలార్‌ పథకం మంజూరైంది. గుమ్మాల వారి పాకలు దగ్గర తన కుటుంబీకులకు చెందిన పశువుల పాకలు, మరో రెండు ఇళ్లకు మాత్రమే ఉపయోగపడేలా సర్పంచి తన సొంతస్థలంలో బోరు తీయించి, ట్యాంకు నిర్మించారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే తాగునీటి పథకాన్ని సర్పంచి సొంతస్థలంలో ఏర్పాటు చేయడం ఏంటని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ స్థలం తమదని, బోరుతో సహా సోలార్‌ పథకాన్ని సర్పంచి వర్గీయులు స్వాధీనం చేసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాధనం వృథా చేయడమేనంటూ తెదేపా నాయకులు మజ్జి అప్పారావు, గల్లా నానిబాబు తదితరులు ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో సర్పంచి నుంచి సమస్య ఎదురుకాకుండా ఆయన నుంచి బాండ్‌ పేపర్‌పై ఒప్పందం రాయించి తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఎమ్మెల్యే రాజు సూచించారు. కానీ తెల్ల కాగితంపై సంతకం తీసుకుని మమ అనిపించారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
బీ దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సుజాత మాట్లాడుతూ సర్పంచి గణేశ్వరరావు నుంచి తెల్లపేపరుపై ఒప్పంద పత్రం తీసుకొని సోలార్‌ పథకం ఏర్పాటు చేశామని, ఈ ట్యాంకుతో మోదమ్మ పాదాలు, ప్రాథమికోన్నత పాఠశాల, పశువుల పాకల ఏరియాలోని వారికి తాగునీటి సమస్య తీరుతుందని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని