logo

అదుపు తప్పితే అనర్థాలే!

పెరుగుతున్న జనాభా అందరినీ ఆలోచనకు గురిచేస్తోంది. భారత దేశ జనాభా 140 కోట్లు దాటింది. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించి దీన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Published : 11 Jul 2024 02:40 IST

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

పెరుగుతున్న జనాభా అందరినీ ఆలోచనకు గురిచేస్తోంది. భారత దేశ జనాభా 140 కోట్లు దాటింది. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించి దీన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి ఈ నెల 24 వరకు మూడు దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్‌ 1 నుంచి 20 వరకు సన్నాహక దశ, జూన్‌ 27 నుంచి ఈ నెల 10 వరకు కుటుంబ సంక్షేమ సదుపాయాలు, సమాజానికి అవగాహన కల్పించడం, 11 నుంచి 24 వరకు లక్ష్యాలను చేరుకునేలా చొరవ తీసుకునే కార్యక్రమాలను జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 9,53,960 మంది ఉండగా.. 2022లో 10,53,897 మంది ఉన్నారు. 2023లో ఈ సంఖ్య 10,63,962కు పెరిగింది. 2024లో ఇప్పటివరకు ఈ సంఖ్య 10,74,133గా ఉంది. ఏటికేడు జనాభా పెరుగుతోందని సీసీఓ పట్నాయక్‌ తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 2022లో 15.85 లక్షల జనాభా ఉండగా 2023లో 17.18 లక్షలకు పెరిగింది. 2024లో 18.52 లక్షలకు చేరింది. ఇలా ఏడాదికేడాది జిల్లాలో జనాభా పెరుగుతూ వస్తోంది. ఇదెలా ఉన్నా.. ఆరోగ్యకరమైన జనాభా ఎంత ఉన్నారన్నది ప్రశ్నార్థకమే. గత కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పులు, పర్యావరణ ముప్పు, కొత్త కొత్త వ్యాధులు, వైరస్‌లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతంలోని వ్యాధులకు మందులు కనుక్కొని ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్నామని అనుకుంటున్న తరుణంలోనే కరోనా వంటి వైరస్‌లు దాడి చేయడంతోపాటు క్యాన్సర్, గుండెపోటు వంటివి ఎక్కువవుతున్నాయి. ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. చిన్న వయస్సు వారికే సుగర్, బీపీ, పక్షవాతం వంటి సమస్యలు రావడం అందరిలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆరోగ్యకరమైన జనాభాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా ఒకరు లేదా ఇద్దరు పిల్లలను కనడం, కాన్పుల మధ్య మూడేళ్ల కాల వ్యవధి ఉండాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

కు.ని. పద్ధతులతో నూతన అధ్యాయం

జనాభా పెరుగుదల చాలా వరకు ఇబ్బందులకు గురిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న జనాభాను స్థిరంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది.   తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించడం వల్ల జనాభా నియంత్రణతో పాటు మాతృ, శిశు సంరక్షణ చేయొచ్చని వైద్య సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. కు.ని. పద్ధతులు పాటించి నూతన అధ్యాయానికి నాంది పలకాలని వైద్య సిబ్బంది ప్రచారం చేస్తున్నారు.

విస్తృతంగా ప్రచారం: జిల్లాలో కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. వివాహ వయసుపై అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో చిన్న వయసుల్లోనే పెళ్లిళ్లు చేయడం వల్ల భవిష్యత్‌లో ఏర్పడే అనారోగ్య సమస్యలను వివరిస్తున్నాం. జనాభా పెరుగుదలను నియంత్రించడంతోపాటుగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కు.ని శస్త్రచికిత్సలు ప్రతి పీహెచ్‌సీ, ఆసుపత్రుల్లో జరిపేలా చేస్తున్నాం. కుటుంబ నియంత్రణ పాటించి. జనాభాను నియంత్రించడంతో అందరూ భాగస్వాములు కావాలి.

డాక్టర్‌ ఎంఎస్‌వీకే బాలాజీ, డీఎంహెచ్‌ఓ, అనకాపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని