logo

‘ఉక్కు’కు చుక్కలు చూపించారు!

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ ఆధీనంలో కిరండోల్, బచేలి మైన్స్‌ (ఇనుప ఖనిజం) ఉన్నాయి. 2004 నుంచి ఇనుప ఖనిజం తక్కువ ధరకే స్టీలు ప్లాంటుకు సరఫరా చేస్తున్నారు.

Updated : 11 Jul 2024 05:20 IST

బొగ్గు రవాణాకు ఎన్నో అవాంతరాలు
నేడు ఉక్కు మంత్రి సమీక్షతోనైనా పరిస్థితి మారేనా?
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఉక్కునగరం

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు...ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు ఎన్‌ఎండీసీ, అదానీ గంగవరం పోర్టు, రైల్వే రేక్‌ల కొరత..ఎప్పటి కప్పుడు సరికొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి గురువారం సమీక్ష నిర్వహిస్తున్న వేళ.. స్టీలు ప్లాంటును వేధిస్తున్న సమస్యలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇకనైనా ఈ కష్టాల సుడిగుండం దాటి ఉత్పత్తి పుంజుకోవాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ ఆధీనంలో కిరండోల్, బచేలి మైన్స్‌ (ఇనుప ఖనిజం) ఉన్నాయి. 2004 నుంచి ఇనుప ఖనిజం తక్కువ ధరకే స్టీలు ప్లాంటుకు సరఫరా చేస్తున్నారు. ఒక టన్ను ఉక్కు తయారీకి 1.6 టన్నుల ఇనుప ఖనిజం అవసరం. 2020 వరకు వంద మిలియన్‌ టన్నుల ఖనిజం సరఫరా చేసిన ఎన్‌ఎండీసీ ఆ తర్వాత సరఫరా తగ్గించేసింది. దీంతో బయట కొనుగోలు చేయలేక... సకాలంలో ఇనుప ఖనిజం అందక స్టీలు ప్లాంటు మరింత నష్టాల్లో వెళ్లిపోయింది.

రైల్వే రేక్‌ల కొరత వేధిస్తున్నా: 1980లో డీజిల్‌ ఇంజిన్‌లు ఉన్నప్పుడు కొండ ప్రాంతాల మీదుగా గూడ్స్‌ రైళ్లు రావటానికి ఎక్కువ ఇంధనం ఖర్చవడం వల్ల కిలో మీటరుకు రూ.100లు ఖర్చయితే  రూ.180వసూలు చేశారు. కిరండోల్,  బచేలి నుంచి కొత్తవలస వరకు 400 కి.మీ. ఉంటుంది. ఈ దూరానికి అదనంగా 20 శాతం ఛార్జీలను ఇప్పటికీ రైల్వే వసూలు చేస్తోంది. పైగా అవసరమైన రేక్‌(రైళ్లు)లను కేటాయించకపోవడంతో స్టీలు ప్లాంటు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. స్టీలు, బొగ్గు పార్లమెంటరీ కమిటీలో వైకాపా ఎంపీలు ఇద్దరు ఉన్నా కనీసం పరిష్కారం మార్గాలు చూడలేదు.

అదానీకి చౌకగా కట్టబెట్టి: జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను కారు చౌకగా రూ.650 కోట్లకు ‘అదానీ’కి కట్టబెట్టారు.  అప్పటి నుంచి హ్యాండ్లింగ్‌ ఛార్జీలు పెంచేశారు. స్టీలు ప్లాంటుకు ప్రత్యేకంగా ఉండాల్సిన యార్డు, బెర్త్‌లను తొలగించారు. ఇటీవల గంగవరం కార్మికుల మెరుపు సమ్మెను విరమింపజేయకుండా తాత్సారం చేశారు. ఫలితంగా 45 రోజుల్లో 3.50 లక్షల టన్నుల బొగ్గు సరఫరా ఆగిపోయింది. ఫలితంగా ఉక్కు ఉత్పత్తికి ఇటీవల తీవ్ర విఘాతం కలిగింది. గత వైకాపా ప్రభుత్వ తీరు వల్ల గంగవరం పోర్టు విశాఖ ఉక్కును చావుదెబ్బ తీసింది.

స్వయంగా పరిశీలించనున్న కుమారస్వామి: విశాఖ ఉక్కు అంశంపై దిల్లీలో పలుసార్లు సమావేశమైన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి నేడు స్వయంగా స్టీలు ప్లాంటును సందర్శించనున్నారు. ఆర్థికంగా, వ్యవస్థాగత ఉన్న ఇబ్బందులు, కారణాలు, మెరుగుపర్చే అంశాలపై ఉక్కు సహాయ మంత్రి భూపతి శ్రీనివాసవర్మతో ఇప్పటికే ఆయన చర్చించారు. విశాఖ స్టీలుకు గత వైభవం తీసుకొచ్చేలా కుమారస్వామి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఉక్కు పరిరక్షణకున్న మార్గాలన్నీ పరిశీలిస్తాం

కేంద్ర ఉక్కు సహాయమంత్రి శ్రీనివాసవర్మ

ఉక్కు హౌస్‌లో జరిగిన సమావేశంలో సీఎండీ అతుల్‌భట్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా తదితరులు

విశాఖపట్నం (ఎన్‌ఏడీకూడలి, ఉక్కునగరం), న్యూస్‌టుడే: కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ఉక్కుపై సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఉక్కు సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ బుధవారం విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలన చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో ఎలాంటి కీలక ప్రకటనలు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం, ఉపసంహరణ అనేది మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని, ప్రధాని మోదీ నాయకత్వంలో కేబినెట్‌లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నారు. సెయిల్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నా.. వాటిపైనా కొన్ని హద్దులు, అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. సెయిల్, ఎన్‌ఎండీసీ, స్టీల్‌ప్లాంట్‌ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో కేంద్ర మంత్రి కుమారస్వామి సమావేశమవుతారన్నారు.

ఉక్కును కాపాడుకుంటాం: విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌ అన్నారు. బుధవారం ఉక్కు హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆ వివరాలు... ‘గురువారం కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ విశాఖ ఉక్కును సందర్శించనున్న నేపథ్యంలోనే ఉక్కు అధికారులతో సమావేశమై కీలక అంశాలు చర్చించాం. కర్మాగారాన్ని ముందుకు నడపాలంటే ఉక్కు మంత్రిత్వశాఖ ద్వారా తక్షణమే రూ.3 వేల కోట్లు విడుదల చేయడంతో పాటు, ఉక్కు మిగులు భూముల అమ్మకం ద్వారా మరో రూ.వెయ్యి కోట్లు సేకరించుకోవచ్చని ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గనుల లీజు పొడిగించడంతో పాటు, ఉక్కులో విద్యుత్తు సమస్య పరిష్కారానికి ఆరు నెలల గడువు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఉక్కు ఉద్యోగుల వేతనాలు 15వ తేదీ కొంత, మిగిలినది 22వ తేదీన చెల్లించేందుకు సీఎండీ హామీ ఇచ్చారు. అలాగే విశాఖ నగరంతో పాటు, ఉక్కుపై సాగుతున్న దుష్ప్రచారం  నమ్మొద్దు. గురువారం జరిగే చర్చల ద్వారా కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం’ అని పల్లా, శ్రీభరత్‌ ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, కార్మిక సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్, యు.రామస్వామి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని