logo

25 లక్షలకు చేరువలో జిల్లా జనాభా

ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ జిల్లా జనాభా క్రమంగా పెరుగుతోంది. 2011 తర్వాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టలేదు. 2021లో జనాభా లెక్కలు చేపట్టాలని భావించినప్పటికీ కొవిడ్‌ కారణంగా ప్రభుత్వం గణన చేపట్టలేకపోయింది.

Updated : 11 Jul 2024 04:28 IST

నేడు జనాభా దినోత్సవం
ఏటా ఒక శాతం పెరుగుతున్నట్లు అంచనా

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ జిల్లా జనాభా క్రమంగా పెరుగుతోంది. 2011 తర్వాత మళ్లీ జనాభా లెక్కలు చేపట్టలేదు. 2021లో జనాభా లెక్కలు చేపట్టాలని భావించినప్పటికీ కొవిడ్‌ కారణంగా ప్రభుత్వం గణన చేపట్టలేకపోయింది. అయితే ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా పెరుగుతున్న జనాభాను అంచనా వేస్తూ ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతోంది.

ఓటర్లు ఆధారంగా..

2011 లెక్కల ప్రకారం జిల్లాలో 19.60 లక్షల మంది జనాభా ఉన్నారు. పురుషులు-9.88 లక్షలు, మహిళలు-9.72 లక్షల మంది ఉన్నారు. దీన్ని అనుసరించి ఏటా ఒక శాతం చొప్పున జనాభా పెరుగుతూ వస్తోందని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 2023 డిసెంబరు నాటికి జిల్లా జనాభా 22.60 లక్షలకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో గణాంకాలు తీసినట్లయితే జనాభా 25 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనాకు వస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఓటర్ల సంఖ్య 20.12 లక్షలుగా తేలింది. ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే జనాభా 25 లక్షలు దాటే అవకాశం ఉంది.

విశాఖలో ఎందుకు పెరుగుతుందంటే...

విశాఖలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉండడం, చదువులు, వైద్య అవసరాలు వంటి కారణాల రీత్యా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే వలసదారుల సంఖ్య పెరుగుతోంది. జనాభా పెరుగుదలకు ఇదొక కారణంగా కనిపిస్తోంది. ఎక్కువ మంది జీవీఎంసీ పరిధిలోనే ఉన్నారు. జిల్లాలో పెందుర్తి, భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం మండలాలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలున్నాయి. మిగిలిన ప్రాంతమంతా నగర పరిధిలోనే ఉంది.


జనాభా పరిశోధనలో ఏయూ..

47 ఏళ్లుగా సేవలందిస్తున్న విశ్వవిద్యాలయం
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1977లో జనాభా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇలాంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 18 ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తుంటాయి.

డిజిటల్‌ గడియారం..

జనాభా లెక్కలకు, జనాభా పరిశోధన కేంద్రాలకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు. జనాభా లెక్కలు, సెన్సెస్‌ తదితర అంశాలు కేంద్ర ప్రభుత్వ స్టాటస్టిక్స్, ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ, రాష్ట్రస్థాయిలో డైరెక్టర్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఆపరేషన్‌ విభాగం పరిధిలోకి వస్తాయి. జనాభా పరిశోధనా కేంద్రాలు జనాభా పెరుగుదలకు కారణాలు.. లాభ నష్టాలపై ప్రజలను చైతన్యపరచడానికి దోహదపడతాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షిస్తాయి.

డిజిటల్‌ గడియారం..

ఈ కేంద్రాల వద్ద కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ పాపులేషన్‌ గడియారాలు ఉంటాయి. ఈ గడియారం ద్వారా దేశ జనాభా, ఆయా రాష్ట్ర జనాభా రియల్‌టైమ్‌ ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా ప్రసారమవుతాయి. ముంబయిలో గల ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌(ఐఐపీఎస్‌) వారు ప్రామాణికంగా తీసుకున్న కొన్ని అంశాల ఆధారంగా జనాభా పెరుగుదల ఆధారంగా ఒక ప్రోగ్రాం డిజైన్‌ చేసిన చిప్‌ను డిజిటల్‌ పాపులేషన్‌ క్లాక్‌లో అమర్చడం ద్వారా ప్రతి క్షణం జనాభా పెరుగుదల తెలుస్తుంటుందని జనాభా పరిశోధనా కేంద్రం గౌరవ సంచాలకులు ఆచార్య మునిస్వామి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని