logo

కళ్లుమూసుకొని వైకాపా నేతలకు సహకారం!!

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) కమిషనర్‌గా సీఎం సాయికాంత్‌వర్మ సాగించిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Updated : 11 Jul 2024 05:19 IST

జీవీఎంసీలో అధికారుల ఇష్టారాజ్యం
వెలుగులోకి ‘డీమ్డ్‌ అప్రూవల్‌’ దస్త్రాల బాగోతం
దిద్దుబాటు చర్యల్లో కమిషనర్‌
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

కమిషనర్‌ సాయికాంత్‌వర్మ

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) కమిషనర్‌గా సీఎం సాయికాంత్‌వర్మ సాగించిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మున్ముందు ఇబ్బందులు తప్పవని భావించిన ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటి వరకు కమిషనర్‌ లాగిన్‌ ద్వారా ‘డీమ్డ్‌ అప్రూవల్‌’ పొందిన 16 దస్త్రాలను డీటీసీపీ (డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌)కు పంపించారు. ఆయా అనుమతులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రణాళిక సిబ్బందితో పాటు తాను ఎన్నికల విధుల్లో ఉండటంతో దస్త్రాలు చూడలేకపోయామని, నిర్ణీత గడువు ముగియడంతో ‘డీమ్డ్‌ అప్రూవల్‌’ స్థాయికి వెళ్లినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఓ ప్రాజెక్ట్‌ నిర్మాణాలకు కమిషనర్‌ డీమ్డ్‌ అప్రూవల్‌ ఇచ్చారనే విషయం ఈ నెల 8న 22వ వార్డు జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ వెలుగులోకి తెచ్చారు. దీంతో కళ్లు తెరిచిన కమిషనర్‌ అప్పటి వరకు డీమ్డ్‌ అప్రూవల్‌ అయిన దస్త్రాలను అదే రోజు రాత్రి 9.20 గంటలకు డీటీసీపీకి పంపించారు. దాదాపు నాలుగు నెలల పాటు ఎన్నికల విధుల్లోనే ఉన్నామని చెప్పుకొచ్చిన కమిషనర్‌కు...ప్రణాళిక విభాగంలో దస్త్రాలను అలాగే 15 రోజులు ఉంచితే వాటంతటవే ‘డీమ్డ్‌ అప్రూవల్‌’ అవుతాయన్న అవగాహన ఉండదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన తరువాత దాదాపు రెండు నెలలు గడిచినా దస్త్రాలు పరిశీలించుకోలేదా అన్న సందేహాలు రేగుతున్నాయి. ప్రస్తుతం ‘డీమ్డ్‌ అప్రూవల్‌’ అయిన ప్లాన్‌లలో అత్యధికం  వైకాపా నాయకులకు సంబంధించినవే కావడం గమనార్హం. కమిషనర్‌ పంపించిన దస్త్రాలను పరిశీలించిన డీటీసీపీ విద్యుల్లత..వాటిని వేర్వేరు అధికారులకు అప్పగించారు. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు పరిష్కరించి.. తిరిగి జీవీఎంసీ ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి (సీసీపీ) లాగిన్‌కు పంపించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా దస్త్రాలు సీసీపీ తన లాగిన్‌ నుంచి ఎల్‌టీపీ (లైసెన్స్డ్‌ టెక్నికల్‌ పర్సన్‌) లాగిన్‌కు పంపించనున్నారు. అనంతరం డీమ్డ్‌ అప్రూవల్‌ పొందిన భవన యజమానులకు వర్క్‌ స్టాప్‌ (పనులు నిలిపివేత) నోటీసులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం డీమ్డ్‌ అప్రూవల్‌ పొందిన నిర్మాణాలతో జీవీఎంసీకి కోట్లలో ఆదాయం రావాల్సి ఉంది. చాలా ప్లాన్లకు వీఎల్‌టీ (ఖాళీ స్థలాల పన్ను) చెల్లించలేదు. పైగా భారీగా టీడీఆర్‌ (ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట రైట) పత్రాలు కొట్టేసే అవకాశాలున్నవే ఎక్కువ. ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న కమిషనర్‌ సాయికాంత్‌వర్మను ప్రభుత్వం ఏపీ టౌన్‌షిప్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా  బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చిన విషయం విధితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని