logo

మారింది అధికారం.. పోవాలి ఐదేళ్ల అంధకారం!!

వైకాపా అయిదేళ్ల పాలనలో విశాఖ నగరం ఆక్రమణలు, అక్రమాలకు నిలయంగా మారిపోయింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన పెద్దలే భక్షకులయ్యారు.

Updated : 11 Jul 2024 03:51 IST

ముఖ్యమంత్రి పర్యటనపై ఆశలెన్నో
చంద్రబాబు దూరదృష్టిపైనే ప్రజల విశ్వాసం
ఈనాడు, విశాఖపట్నం

వైకాపా అయిదేళ్ల పాలనలో విశాఖ నగరం ఆక్రమణలు, అక్రమాలకు నిలయంగా మారిపోయింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన పెద్దలే భక్షకులయ్యారు. విలువైన భూములెన్నో చేతులు మారిపోయాయి. ఎన్నో ప్రాజెక్టులను అడ్డదారుల్లో చేజిక్కించుకున్నారు. మధ్యవర్తుల పేరుతో దోపిడీలకు పాల్పడ్డారు. వివాదాస్పద స్థలాలు చేతుల్లోకి తీసుకున్నారు. ఒక్క విశాఖలోనే రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన ఎన్నో ప్రాజెక్టులను పక్కన పెట్టారు.

మరో వైపు హత్యలు, రాజకీయ కక్షలు పెరిగిపోయాయి. శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. డ్రగ్స్‌ మాఫియా, గంజాయి విచ్చలవిడి వినియోగం ఎక్కువైంది. వీటన్నింటినీ ప్రక్షాళన చేసి ప్రశాంత నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి విశాఖకు వస్తున్న చంద్రబాబు పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాసంక్షేమానికి కీలకమైన పలు ప్రాజెక్టులపై దృష్టిసారించి పూర్తి చేయాలని కోరుతున్నారు. అవేంటో చూద్దాం.

పర్యాటకం

వైకాపా సర్కారు పర్యాటకరంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పర్యాటకాభివృద్ధికి అవకాశాలున్నా పట్టించుకోలేదు. ఆదాయం వచ్చే రుషికొండపై భవనాలను కూల్చేసి రాజసౌధాలను జగన్‌ నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ భవనాలను ఏవిధంగా ఉపయోగించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకుంటే కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంటుంది.

రైల్వేజోన్‌..

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఎంతో ప్రాధాన్యమైన ఈ అంశాన్ని వైకాపా ప్రభుత్వం విస్మరించింది. జోన్‌ కార్యాలయం భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కదిలినా నాటి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడింది. రైల్వేకు అప్పగించాల్సిన భూములు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చింది. రైల్వే అధికారులు ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. ఫలితంగా పనులు ప్రారంభించలేని దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వంలో భూసమస్యను పరిష్కరించి త్వరలోనే రాష్ట్ర ప్రజల కల నెరవేర్చుతారని అంతా ఎదురుచూస్తున్నారు.

మెట్రోపై ఆశలు..

జగన్‌ సర్కారు విశాఖ మెట్రో ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసింది. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం తప్ప మరేమీ చేయలేదు. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని మార్చేసి కొత్త ప్రతిపాదనలను వైకాపా తీసుకొచ్చింది. ఆ తరువాత పక్కన పడేసింది. చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించి ఊపిరిపోయాలని, త్వరితగతిన పట్టాలెక్కించాలని నగర వాసులు కోరుతున్నారు.

భూఅక్రమాలు

వైకాపా పెద్దలు విశాఖలోని భూములను కొల్లగొట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భూములపై కన్నేసి కాజేశారు. ప్రతిపాదిత భీమిలి-భోగాపురం ఆరువరుసల రహదారికి ఇరువైపులా తమ కుటుంబ సభ్యుల పేరుతో రూ.వేల కోట్ల విలువ చేసే భూములను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. మధురవాడ, భీమిలి, ఆనందపురం, పెందుర్తిలో వివాదాల్లో ఉన్నవీ సొంతం చేసుకున్నారు. భూసమీకరణ తరువాత రైతులకు పరిహారంగా ఇచ్చిన భూములను వైకాపా నేతలు కొట్టేశారు. డీపట్టాల క్రమబద్ధీకరణ పేరుతో ఎన్నో భూములు పేదల నుంచి లాగేశారు. వీటన్నింటి మీద దర్యాప్తు అవసరం.

పెండింగు ప్రాజెక్టులు

పెండింగు ప్రాజెక్టులు పూర్తయితే విశాఖ రూపురేఖలు మారిపోనున్నాయి. హుద్‌హుద్‌ తర్వాత అప్పటి తెదేపా ప్రభుత్వం భూగర్భ విద్యుత్తు సరఫరా వ్యవస్థ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఆ పనులు పూర్తికావాల్సి ఉంది. ఎన్‌ఏడీ పైవంతెన వద్ద   ఆర్‌వోబీ పనులను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ప్రతిపాదిత ప్రాజెక్టులు ఎన్నో పెండింగులో ఉన్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పైవంతెనలు, హిస్టరీ మ్యూజియం, ప్లానెటోరియం, బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్‌ వంటివెన్నో ఉన్నాయి. వీటన్ని పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని