logo

Tax For Waste: ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!

వైకాపా ప్రభుత్వ హయాంలో చెత్త పన్ను పేరిట నగర ప్రజలను పీడించారు. చెల్లించని వారి ఇళ్ల ముందు చెత్తను వేశారు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

Updated : 16 Jun 2024 08:11 IST

రద్దుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో చెత్త పన్ను పేరిట నగర ప్రజలను పీడించారు. చెల్లించని వారి ఇళ్ల ముందు చెత్తను వేశారు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. చివరికి ఓటు అనే వజ్రాయుధంతో ప్రజలు అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శనివారం మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ చెత్త పన్ను రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌శాఖలో కీలకంగా వ్యవహరించిన ఓ మహిళా అధికారి ఆలోచనతో రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) పేరుతో చెత్త సేకరణ ప్రాజెక్టును అమలులోకి తెచ్చారు. వైకాపాకు చెందిన ఓ గుత్తేదారుకు ప్రాజెక్టు టెండరు దక్కేలా పావులు కదిపిన ఆమె సఫలీకృతులయ్యారు. గుత్తేదారుకు చెల్లించాల్సిన నిధులను ప్రజల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. కేవలం గుత్తేదారుకు దోచిపెట్టడానికే వైకాపా ప్రభుత్వం ఈ చెత్త పన్నును ప్రవేశపెట్టింది.

ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైనా..: ‘క్లాప్‌’ ప్రాజెక్టు అమలులో భాగంగా విశాఖ నగరానికి 600 టాటాఏస్‌ వాహనాలను కేటాయించి, వాటితోనే ఇంటింటి నుంచి చెత్తను సేకరించాలని ఆదేశించారు. ఈ వ్యవహారమంతా అమరావతిలోని మహిళా అధికారి కనుసన్నల్లో నడిచింది. నెలకు ఒక్కో వాహనానికి రూ.65వేల చొప్పున ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మురికివాడల్లోని నివాసితుల నుంచి నెలకు రూ.60, మిగతా ప్రాంతాల్లోని నివాసితుల నుంచి రూ.120 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ పన్నుపై ఎప్పటికప్పుడు ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర వివాదాస్పదమైన చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్నికల ముందు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఒక్కో వాహనానికి రూ.20వేలు అదనం..: విశాఖ నగరంలో 2015 నుంచి ఇళ్ల నుంచి చెత్త సేకరించే విధానం అమలైంది. ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో భాగంగా నాడు 450 టాటా ఏస్‌ వాహనాలతో చెత్తను సేకరించేవారు. స్థానిక గుత్తేదారులకు ఒక్కో వాహనానికి రూ.45 వేలు ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ‘క్లాప్‌’ పథకాన్ని అమలులోకి తెచ్చి గుత్తేదారుకు రూ.65 వేలు ఇచ్చారు. అంటే ఒక్కో వాహనానికి రూ.20వేలు ఎక్కువ అన్నమాట. పైగా కార్మికులను కూడా జీవీఎంసీయే సమకూర్చింది. ఈ పథకానికి ఏటా రూ.46కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. జీవీఎంసీకి ఈ ప్రాజెక్టు తీవ్ర భారమని అధికారుల్లో చర్చ జరిగినా, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ఉండటంతో మిన్నకుండిపోయారు.

‘క్లాప్‌’ ప్రాజెక్టుకూ మంగళం..

గత ప్రభుత్వం నగరంలో చెత్త ఛార్జీలు వసూలు బాధ్యతలను వార్డు వాలంటీర్లు, వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులకు అప్పగించింది. వారు రెండు నెలలకు ఓసారి ఇళ్లకు వచ్చి ఛార్జీలను వసూలు చేసి, నేరుగా సీడీఎంఏ (కమిషనర్, డైరెక్టర్‌ మున్సిపల్‌ పరిపాలన) ఖాతాలో నిధులు జమ చేసేవారు. వాటిని అమరావతి నుంచే నేరుగా గుత్తేదారుకు ఇచ్చేవారు. చెత్త ఛార్జీలు చెల్లించకపోతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తామని, రేషన్‌కార్డులు తొలగిస్తామని ప్రజలను భయపెట్టారు. ఇలా నగరంలో ఏటా రూ.4కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేశారు. మిగతా రూ.42కోట్లు జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి మళ్లించి గుత్తేదారుకు చెల్లించారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేస్తే క్లాప్‌ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు