logo

Visakhapatnam: విశాఖలో జరిగిన ఆ కిడ్నాప్‌.. ఇప్పటికీ ఓ మిస్టరీ!

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఆ కిడ్నాప్‌ జరిగి ఏడాది పూర్తయింది.

Updated : 18 Jun 2024 08:59 IST

రౌడీషీటర్‌కు, ఎంవీవీకి మధ్య ఆర్థిక సంబంధాలు నడిచాయా?
కారణాలు వెల్లడించకుండా తొక్కిపెట్టిన పోలీసులు
మాజీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌పై పునర్విచారణకు డిమాండ్‌

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఆ కిడ్నాప్‌ జరిగి ఏడాది పూర్తయింది. రౌడీషీటర్‌ హేమంత్‌కుమార్, మరో ఇద్దరితో కలిసి చేసిన ఈ కిడ్నాప్‌ నేటికీ మిస్టరీగానే మిగిలింది. 

ఈనాడు, విశాఖపట్నం: రౌడీషీటర్‌కు, ఎంవీవీకి మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలేంటి? సెటిల్‌మెంటే కిడ్నాప్‌కు దారితీసిందా? అంతకు ముందునుంచి వీరిమధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయన్న ప్రశ్నలకు సమాధానాల్లేవు. సీపీలు మారినా ఈ మిస్టరీ మాత్రం వీడలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో విశాఖ పోలీసులు కిడ్నాపర్‌కు, ఎంవీవీకి మధ్య లింకులు బయటకు రాకుండా తొక్కిపెట్టారని నాటి ప్రతిపక్షాలు ఆరోపించాయి. కూటమి ప్రభుత్వంలో హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనిత.. సోమవారం విశాఖలో మాట్లాడుతూ ఈ కేసుపై అన్ని కోణాల్లో దృష్టిసారిస్తా మనడంతో.. మళ్లీ చర్చనీయాంశమయింది.

అప్పుడు ఏం జరిగింది?

గతేడాది జూన్‌ 13న రుషికొండలోని ఎంవీవీ కుమారుడు శరత్‌ ఇంట్లోకి రౌడీషీటర్‌ హేమంత్‌... మరో ఇద్దరితో కలిసి చొరబడ్డారు. శరత్‌ను బంధించి ఆయనతో తల్లి జ్యోతికి ఫోన్‌ చేయించి రప్పించారు. ఆమెనూ కిడ్నాప్‌ చేశాక.. వారిద్దరితో ఎంవీవీకి సన్నిహితుడైన ఆడిటర్‌ జీవీకి ఫోన్‌ చేయించి పిలిపించారు. ఇలా సినీఫక్కీలో రుషికొండలోని ఇంట్లో ఎంవీవీ కుటుంబసభ్యులను బంధించి మూడు రోజులు చిత్రహింసలు పెట్టారు. బ్యాట్లతో దాడిచేసి రూ.1.75 కోట్లు తీసుకున్నారు. 15న పోలీసులు విచారణ చేస్తున్నారన్న అనుమానం రాగానే ఎంవీవీ కుమారుడి కారులోనే పారిపోయే క్రమంలో చిక్కారు. డబ్బుకు ఆశపడే హేమంత్‌ కిడ్నాప్‌ చేశాడంటూ అప్పటి సీపీ త్రివిక్రమవర్మ తెలిపారు. రౌడీషీటర్‌ హేమంత్‌కు, ఎంవీవీకి ఎలాంటి ఆర్థిక పరమైన సంబంధాల్లేవని చెప్పారు. అయితే హేమంత్‌ మధురవాడలోని ఓ ఎన్‌ఆర్‌ఐ భూముల విషయంలో ఎంవీవీతో కలిసి రియల్‌ ఎస్టేట్‌ డీల్‌ చేసినట్లు తర్వాత వెలుగులోకి వచ్చింది. ఎంవీవీ కార్యాలయానికి హేమంత్‌ తరచూ వచ్చేవాడని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు అసలు విషయం కప్పిపుచ్చారని, ఎంవీవీకి రౌడీషీటర్‌తో ముందుగా పరిచయాలున్నాయని ప్రచారం సాగింది.

హేమంత్‌ గ్యాంగ్‌తో ఎంవీవీకి సంబంధం ఏంటి?: ‘రాష్ట్రమంతా మా గ్యాంగులున్నాయి. మాకేం కాదు’ అంటూ హేమంత్‌ హెచ్చరించినట్లు కిడ్నాప్‌ తర్వాత ఎంవీవీ కుటుంబసభ్యులు, జీవీ మీడియాకు తెలిపారు. హేమంత్‌ ‘డేగ వెంకట్‌ గ్యాంగ్‌స్టర్స్‌’ పేరుతో 11 మందితో ఓ గ్యాంగ్‌ను నడిపినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌ ద్వారానే సెటిల్‌మెంట్లు, బలవంతంగా భూములు లాక్కోవడం వంటివి జరిగాయని, మధురవాడ పరిధిలో ఈ గ్యాంగ్‌ భూ పంచాయితీలు ఎక్కువగా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ గ్యాంగ్‌కు.. ఎంవీవీ, జీవీలకు ఉన్న సంబంధమేంటో విచారణ చేయాలంటూ జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ డిమాండ్‌ చేశారు.

సిట్‌ విచారణ చేస్తే..

నాటి ప్రతిపక్ష నేతలు ఈ కిడ్నాప్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మీడియా అప్పటి సీపీని ప్రశ్నించినా.. హేమంత్‌కు, ఎంవీవీకి ముఖపరిచయమే లేదంటూ సమాధానం దాటవేశారు. రౌడీషీటర్లతో స్థలాల సెటిల్‌మెంట్‌ చేస్తున్నారంటూ ఎంవీవీ, జీవీల స్థిరాస్తి వ్యాపారాలపై అప్పట్లో ప్రతిపక్ష నేతలు వాదించారు. ‘ఎంవీవీ నాకు రూ.55 కోట్లు సెటిల్‌మెంట్‌ చేయాల్సి ఉంది. నా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టుచేయించి జైలుకు పంపారు. గతేడాది జూన్‌లో విశాఖలోని ఓ నిర్మాణసంస్థపై ఐటీ దాడులు జరిగాయి. అదే సమయంలో ఎంవీవీకి చెందిన బ్లాక్‌మనీని మా గ్యాంగే తప్పించింది. మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, కేసుల్లో ఇరికిస్తున్నారనే కిడ్నాప్‌కు దిగాం’ అంటూ హేమంత్‌ కొందరితో చెప్పినట్లు తెలుస్తోంది.

  • ఏదేమైనా ఎంవీవీ కుటుంబసభ్యుల కిడ్నాప్‌ వెనక అసలు కథ ఏంటో కొత్త ప్రభుత్వం తక్షణం దృష్టిసారించి ప్రత్యేక అధికారినో, సిట్‌నో నియమించి విచారణ చేయించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని