logo

UCD: వైకాపా జేబు సంస్థగా మార్చేశారు.. బొత్స అండతో చక్రం తిప్పిన యూసీడీ పీడీ

విశాఖ మహా నగరపాలక సంస్థ పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం (యూసీడీ)ని.. ఒక్కమాటలో చెప్పాలంటే వైకాపా యూసీడీగా మార్చేశారు.

Published : 19 Jun 2024 07:50 IST

విధులు మానేసి వైకాపాప్రచారానికే పెద్దపీట
ఎన్ని ఆరోపణలొచ్చినా చర్యలు శూన్యం!

యూసీడీ పీడీ పాపునాయుడు 

విశాఖ మహా నగరపాలక సంస్థ పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం (యూసీడీ)ని.. ఒక్కమాటలో చెప్పాలంటే వైకాపా యూసీడీగా మార్చేశారు.

ఈనాడు-విశాఖపట్నం: ప్రధానంగా ప్రాజెక్టు డైరెక్టర్‌ పాపునాయుడు వైకాపా జేబు సంస్థగా యూసీడీని తీర్చిదిద్దారంటూ ఆరోపణలు వెల్లువెత్తినా చర్యలు శూన్యమే. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అండతో జీవీఎంసీలో ఆయన చక్రం తిప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ విధులు మానేసి, వైకాపా ప్రచారానికే పెద్దపీట వేశారు. డ్వాక్రా మహిళల ఓట్లు వైకాపాకు వేయించాలంటూ సీఈవో, ఆర్పీలకు ఆదేశాలిచ్చారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టినా వైకాపా నేతల ఒత్తిళ్లతో నీరుగార్చేసినవెన్నో. వైకాపాతో అంటకాగిన ఆ అధికారి అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం నేతలు ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు.

డిప్యుటేషన్‌పై వచ్చి పాగా వేసిన 

అధికారి: ఎక్సైజ్‌ శాఖలో సీఐ హోదాలో పాపునాయుడు పనిచేశారు. బొత్స కుటుంబంతో సత్సంబంధాలు ఉండటంతో జీవీఎంసీకి డిప్యుటేషన్‌పై 2022 ఏప్రిల్‌ 7న వచ్చారు. పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం ప్రాజెక్టు డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదికి డిప్యుటేషన్‌ ముగిసినా, మరో ఏడాది గడువు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7తో ఆ పదవీకాలం ముగిసి కొనసాగింపు ఉత్తర్వులు రాకపోయినా జీవీఎంసీలోనే కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా తాయిలాలు డ్వాక్రా మహిళలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.

విచారణలు నీరుగార్చేశారు ఇలా...

యూసీడీ పీడీ పాపునాయుడు దగ్గరుండి తూర్పు వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్దకు ఏపీడీ, సీవోలు, ఆర్పీలను తీసుకెళ్లి డబ్బులిప్పించినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలపై అడిషనల్‌ కమిషనర్‌ విచారణాధికారిగా వెళ్లగా, ఓ ఆర్పీ స్టేట్‌మెంట్‌ రాత పూర్వకంగా ఇచ్చారు. దీని సారాంశం ఏమిటంటే.. ‘ఎంవీవీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఒక్కొక్కరికి రూ.25వేలు పీడీ, ఏపీడీ, సీవోలు ఇప్పించారు. తీసుకోకపోతే కుదరదు అన్నారు. లాగిన్‌ ఆపేసి ఉద్యోగాలు తీసేస్తామన్నారు. కచ్చితంగా చెప్పినట్లు పనిచేయాల్సిందే అన్నారు.’ అయినా అతనిపై చర్యలు తీసుకోలేదు. స్వీట్లు, చీరలు సైతం యూసీడీ ఉన్నతాధికారి ఆదేశాలతోనే సీవోలు డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారన్న ఆరోపణలపైనా నిగ్గు తేల్చలేదు. పోలింగ్‌ ముందు ఏపీడీలు జోన్‌-4 పుణ్యవతి, జోన్‌-3 దుర్గా ప్రసాద్‌లు సీవో, ఆర్పీలకు సమావేశం ఏర్పాటు చేసి.. ఓటరు కార్డులు, ఆధార్‌ కార్డులు సేకరించాలని సూచించారు. వాట్సప్‌ గ్రూపుల్లోనూ ఆధారాలతో సహా ఆదేశాలిచ్చిన సమాచారం ఉంది. ఇవన్నీ పీడీ ఆదేశాల్లేకుండా జరుగుతాయా? ఏపీడీలు సమావేశం ఏర్పాటు చేస్తారా? అనే ఫిర్యాదులొచ్చినా, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఆది నుంచీ ఆరోపణలే!

సీవో (కమ్యూనిటీ ఆర్గనైజర్‌) ఉద్యోగాలిప్పిస్తానని ఆర్పీల వద్ద రూ.5లక్షలు వసూళ్లు చేశారని పీడీ పాపునాయుడుపై జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ గతంలో ఆరోపించారు. పెదజాలారిపేట ఆదర్శ గ్రామంలోని ఇళ్ల కేటాయింపులో రూ.లక్షల ముడుపులు తీసుకుని వైకాపా కార్యకర్తలకు అమ్ముకున్నట్లు ఆయన ఆరోపించారు. రాయితీతో నిత్యావసర సరుకుల వ్యాపారం పేరుతో జేఎంఆర్‌ సంస్థతో కుమ్మక్కై 1080 మంది ఆర్పీల ద్వారా డ్వాక్రా మహిళల నుంచి సుమారు రూ.2.50కోట్లు వసూళ్లు చేశారని ఆధారాలతో గతంలో జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. ఎక్సైజ్‌శాఖ నుంచి డిప్యుటేషన్‌పై యూసీడీ విభాగానికి వచ్చాక ఎండాడలో పెట్రోలు బంకు సమీపంలో రూ.కోటితో ప్లాటు కొనుగోలు చేసినట్లు ఆ అధికారిపై ఆరోపణలున్నాయి. ఇన్ని ఆరోపణలున్నా వైకాపా మాజీ మంత్రి బొత్స సొంత జిల్లావాసి కావడంతో కాపాడుకుంటూ వచ్చారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం పాపునాయుడు అక్రమాలపై కూటమి నేతలు దృష్టి పెట్టడంతో ఆ శాఖలో చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని