logo

Warangal: మహిళలు నిల్చోలేక.. పురుషులు కూర్చోలేక..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులన్నీ కళకళలాడుతున్నాయి. మహిళా ప్రయాణికులతో నిండుగా  దర్శనమిస్తున్నాయి.  అదే సమయంలో సీట్ల కోసం వాగ్వాదాలు.. అప్పుడప్పుడు కొట్లాటలూ జరుగుతున్నాయి.

Updated : 15 Jun 2024 09:20 IST

విలేకరులే ప్రయాణికులై..!
ఆర్టీసీ బస్సులో ఇబ్బందులపై ‘ఈనాడు’ పరిశీలన 

మహబూబాబాద్‌లోని తొర్రూరు బస్టాండ్‌ వద్ద బస్సు ఎక్కడానికి  పోటీ పడుతూ..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులన్నీ కళకళలాడుతున్నాయి. మహిళా ప్రయాణికులతో నిండుగా దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో సీట్ల కోసం వాగ్వాదాలు.. అప్పుడప్పుడు కొట్లాటలూ జరుగుతున్నాయి. డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేస్తున్న పురుషులు తమ గమ్యస్థానానికి చేరుకునే వరకు నిలబడి ఉండాల్సి వస్తోంది. రద్దీని భరించలేక ఆర్టీసీ డ్రైవర్లు కొన్ని స్టేజీల వద్ద బస్సులను ఆపడం లేదు. ఇది మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ‘ఈనాడు-న్యూస్‌టుడే’ బృందం మహబూబాబాద్‌ నుంచి తొర్రూరు వెళ్లే బస్సులో  ప్రయాణిస్తూ ప్రయాణికుల అవస్థలు, సమస్యలు తెలుసుకుంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.  

ఈనాడు, మహబూబాబాద్, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌ రూరల్‌

90లో 70 మంది మహిళలే..  

మహబూబాబాద్‌ డిపో పల్లెవెలుగు బస్సు మహబూబాబాద్‌ నుంచి 41 కిలోమీటర్ల దూరంలోని తొర్రూరుకు సాయంత్రం 4:20కి బయల్దేరింది. గంటన్నరలో అంటే 5:50కి తొర్రూరుకు చేరాల్సింది 10 నిమిషాలు ఆలస్యమైంది. ప్రారంభంలోనే 90 మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.  కొంత మంది మహిళలు సీట్ల కోసం కదులుతున్న బస్సును ప్రమాదకరంగా ఎక్కారు. మెట్ల వద్ద తోసుకున్నారు. మరో 12 మంది ఎక్కలేకపోయారు. 

పరిమితికి మించి

పల్లెవెలుగు బస్సు సామర్థ్యం 50 మంది. అదనంగా 40 మంది ఎక్కారు. పెద్ద వయసు వారు నిల్చోవడానికి.. చిన్న పిల్లలు చాలా సమయం పాటు కూర్చోవడానికి అవస్థలు పడ్డారు.

ఉద్యోగుల అవస్థలు: ప్రతి రోజు ఉదయం, సాయంత్రం విధులకు వెళ్లి వస్తున్న సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. మహిళలు పోటీపడి బస్సు ఎక్కి అన్ని సీట్లలో కూర్చుంటున్నారు.. మరో బస్సు కోసం ప్రయత్నిస్తే ఉదయం విధులకు సమయానికి వెళ్లలేకపోతున్నామని  ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని మార్గాల్లో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.

మెట్ల వద్ద..: బస్సులోని మెట్ల వద్ద కింద కూర్చొని ప్రయాణిస్తున్న ఈ మహిళ పేరు  రమాదేవి. పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామం. బస్సులో కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో నిల్చోలేక కింద కూర్చున్నానని చెప్పారు. ఉదయం చిన్నవంగరలో  ఆపలేదని..  మరో బస్సులో వచ్చానని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. 
ఫుట్ బోర్డు ప్రయాణం: బస్సులో నిల్చోవడానికి స్థలం లేకున్నా బస్సు ఎక్కడానికి ప్రయాణికులు సిద్ధపడుతున్నారు. పుటÆ్బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా అక్కడే నిలబడుతున్నారు. వీరిలో మహిళలూ ఉంటున్నారు. 

డ్రైవర్‌ ఏమన్నారంటే.. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు వాహనం భద్రతను కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.. దాని వల్లనే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని స్టేజీల్లో ఆపడం లేదు.. 

కండక్టర్‌ మాట..  మహిళలు మరో బస్సు వచ్చేంత వరకు ఆగడం లేదు. కిక్కిరిసిన దాంట్లోనే ఎక్కడానికి ముందుకొస్తున్నారు. ఈ సమయంలో కొందరు ఫుట్ బోర్డు వద్ద నిల్చుంటున్నారు. ప్రమాదమని చెప్పినా వినడం లేదు.. దీంతో వారి పట్ల కాస్త కటువుగా ప్రవర్తించాల్సి వస్తోంది. రద్దీ విపరీతంగా పెరిగింది.  

పురుషులకు సీట్లు కేటాయించాలి

- రవి, ఉపాధ్యాయుడు, తొర్రూరు

మహబూబాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రతి రోజు తొర్రూరు నుంచి విధులకు హాజరవుతాను. బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉంటోంది. సీˆట్ల కోసం వాళ్లే కొట్లాడుకుంటున్నారు. మాకు సీట్లు దొరకడం లేదు. నిలబడి ప్రయాణం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. పురుషులకు కూడా సీట్లు కేటాయించాలి..  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని