logo

ఓరుగల్లుతో కళాతపస్వి జ్ఞాపకాలు..

శంకరాభరణం, స్వర్ణకమలం లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను తెలుగు ప్రజలకు అందించి దివికేగిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌  (92) కు ఓరుగల్లుతో ఎంతో అనుబంధం ఉంది.

Updated : 03 Feb 2023 06:46 IST

‘ఘల్లుఘల్లుమంటూ’ సిరిమువ్వల్లే మీ సవ్వడి మా గుండెల్లో వినిపిస్తూనే ఉంటుంది..

‘శంకరా నాదశరీరాభరా’ అంటూ మీరు తీసిన భక్తి చిత్రాలతో ఈ జగమంతా ఓలలాడింది..

కళలకు కాణాచి అయిన ఓరుగల్లు మీరు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతోంది..

ఎంతో మంది కళాకారులను ఆశీర్వదించి   మీ నిండైన దీవెనలు అందించారు..

ఓ కళాతపస్వి మీ జ్ఞాపకాలు కలకాలం మా గుండెల్లో పదిలంగా ఉంటాయి!!


ఈనాడు, వరంగల్‌ : శంకరాభరణం, స్వర్ణకమలం లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను తెలుగు ప్రజలకు అందించి దివికేగిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌  (92) కు ఓరుగల్లుతో ఎంతో అనుబంధం ఉంది. పలుమార్లు నగరానికి వచ్చి మన దగ్గరి ప్రముఖ ఆలయాలను సందర్శించారు.  2016 ఆగస్టులో హనుమకొండలోని ఒక దుస్తుల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కె.విశ్వనాథ్‌ విచ్చేసి తన అభిమాన లోకాన్ని ఆనందంలో ముంచెత్తారు. లలిత కళల నేపథ్యంలోనే విశ్వనాథ్‌ అనేక సినిమాలను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ప్రాంతంలోని అనేక మంది కళాకారులను విశ్వనాథ్‌ అభిమానించేవారు.


మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా..:  ‘పరోపకారం ఇదం శరీరం.. ఇంత చిన్న వయస్సులో సమాజ అభ్యున్నతికి పరితపించి, ఒక మహోన్నత లక్ష్యంతో నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సులక్ష్య సేవా సమితిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ యువ బృందానికి మరెందరో జీవితాల్లో వెలుగులు నింపే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..

ఇవి కె.విశ్వనాథ్‌ తన స్వహస్తాలతో రాసిన ప్రశంస..


28 ఫిబ్రవరి 2017లో సినీ దర్శకుడు విశ్వనాథ్‌ వరంగల్‌ నగరంలోని ఓ సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓరుగల్లుకు చెందిన సులక్ష్య సేవా సమితి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మండువ సంతోష్‌ ఆయన్ను కలిశారు. సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించిన విషయాన్ని సంతోష్‌ గుర్తు చేసుకున్నారు.  

- న్యూస్‌టుడే, వరంగల్‌ సాంస్కృతికం

శివనగర్‌, న్యూస్‌టుడే: కళాతపస్వి ఆలోచనే తన టెంపుల్‌ డ్యాన్స్‌ ప్రాజెక్టుకు పునాది అని హనుమకొండకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి కాడ్రగడ్డ హిమాన్షి చౌదరి అన్నారు. తన పదేళ్ల వయస్సులో విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విశ్వనాథ్‌గారు పరిచయమయ్యారని, ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆయనను గురువుగా తలచి తాను అనేక కార్యక్రమాలు నిర్వహించానన్నారు.   తనకు దారి చూపిన గురువు  ఇక లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని