logo

నిబంధనల పేరుతో అక్రమ వసూళ్లు..

సొంతింటి కళను సాకారం చేసుకునేందుకు భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంటి నిర్మాణ అనుమతులకు అవసరమైన ఇంటి స్థలానికి సంబంధించి ఈసీ, డాక్యూమెంట్,

Published : 13 Jun 2024 05:20 IST

అనుమతి లేని కట్టడాలతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి 

భూపాలపల్లి పట్టణం

భూపాలపల్లి, న్యూస్‌టుడే: సొంతింటి కళను సాకారం చేసుకునేందుకు భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇంటి నిర్మాణ అనుమతులకు అవసరమైన ఇంటి స్థలానికి సంబంధించి ఈసీ, డాక్యూమెంట్, వాల్యువేష్‌ సర్టిఫికెట్, యాజమాన్య ధ్రువీకరణ పత్రం, తదితర రిజిస్ట్రేషన్‌ పత్రాలతో ఆన్‌లైన్‌లో టీజీ-బీపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్జాలంలో యజమానులు సైతం సొంతంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కానీ నిబంధనల ప్రకారం అన్ని ఉన్నా అక్రమ వసూళ్లకు తెరలేపుతూ, ఇంటి యజమాని నుంచి ముడుపులు ముడితే కాని వారి పనులు కావడం లేదు. ఎవరైనా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే సాంకేతిక కారణాలు చూపుతూ.. అనుమతుల జారీలో కొర్రీలు పెట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ ముడుపుల వ్యవహరం మున్సిపాలిటీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

  • భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 30 వార్డుల్లో సుమారు 12,658 ఇళ్లు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా మంజూరునగర్, బీసీ కాలనీ, మైసమ్మ గుడి ప్రాంతంలో కట్టడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే పట్టణ ప్రణాళిక విభాగంలో సిబ్బంది కొరత ఉంది. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో ఒక టీపీవోతో పాటు ఇద్దరు ప్రైవేటు జవాన్లతో నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇద్దరు టీపీబీవోలు, ఒక టీపీఎస్‌ ఉండాలి. వీరు లేకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై సరైన పర్యవేక్షణ కొరవడుతుంది.  

రహదారులను ఆక్రమించి నిర్మాణాలు..

పట్టణంలో నిర్మాణాలు చాలా వరకు అనుమతులు లేకుండా సెట్‌ బ్యాక్‌ నిబంధనలు విస్మరించినట్లు తెలుస్తోంది. మంజూరునగర్, రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ ప్రాంతంలో వరద కాలువను సైతం పూడ్చి వేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. పాత ఇళ్లు కూల్చివేసి, అదే స్థలంలో రెండు, మూడు అంతస్తులు నిర్మించడం, రోడ్లపైన మెట్లు ఏర్పాటు చేసి, దారులను కబ్జా చేస్తున్నారు. 30 అడుగుల రోడ్డు వెడల్పు, 5 అడుగుల సెట్‌ బ్యాక్‌ వదిలి నిర్మాణాలు చేయాలి. స్థానిక నాయకుల పలుకుబడితో కొందరు నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చూసి, చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.  

టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారులెక్కడా..?

టీజీ- బీపాస్‌ అనుమతులు పొంది నిబంధనలు అతిక్రమించినా, అనుమతి లేని కట్టడాలను నియంత్రించేందుకు 2021 ఫిబ్రవరి 20న జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాన్ని నియమించారు. ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, రోడ్లు భవనాల శాఖ, పట్టణ ప్రణాళిక విభాగం, తదితర శాఖల అధికారులను సభ్యులుగా నియమించారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఉన్నా.. అవి పని చేస్తున్న దాఖలాలు లేవు. 

మచ్చుకు కొన్ని..

  • జిల్లా కేంద్రంలోని 170 సర్వే నెంబర్‌లో జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ, సీలింగ్‌ భూములున్నాయి. అందులో ఓ వ్యక్తి కొన్ని నెలల క్రితం రేకుల షెడ్‌ను నిర్మించి ఓ ప్రజాప్రతినిధి అండతోనే ఇళ్లు నిర్మించాడు.   
  • పట్టణంలోని బీసీ కాలనీలో ఓ వ్యక్తి 200 గజాల భూమిలో ఇంటి నిర్మాణం కోసం మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ భూమి కోర్టు కేసులో ఉంది. మరో వ్యక్తి ఆ స్థలం కబ్జా చేసి ఓ ప్రజాప్రతినిధి బలంతో పక్కా భవనాన్ని నిర్మించుకున్నాడు.
  • కృష్ణాకాలనీలో ఓ సింగరేణి కార్మికుడికి కేటాయించిన ఇంటి స్థలంలో వేరే వ్యక్తి తప్పుడు ఇంటి నెంబరు పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఇంటిని నిర్మించాడు. ఇలాంటి ఘటనలు ఈ కాలనీలో పదుల సంఖ్యలో ఉన్నాయి. 

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.
- రాజేశ్వర్, కమిషనర్‌. భూపాలపల్లి పురపాలక సంఘం 

ఇంటి నిర్మాణాలకు అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలి. రెండు నెలలుగా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అక్రమ కట్టడాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేక పోయాం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. అనుమతి లేకుండా నిర్మించిన ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని