logo

కరవు నేలపై మూడు పంటల సాగు

సాధారణ, అంతకు మించి వర్షపాతం కురిసిన ప్రాంతాల్లోనూ రైతులు రెండు పంటలు సాగు చేస్తారు. కరవు, దుర్భిక్ష ప్రాంతానికి నెలవైన జనగామ ప్రాంతంలో మూడో పంటగా ఎడగారు సాగు చేయడం విశేషం.

Updated : 13 Jun 2024 06:03 IST

జనగామ మండలం గానుగుపహాడ్‌లో..

జనగామ రూరల్, న్యూస్‌టుడే: సాధారణ, అంతకు మించి వర్షపాతం కురిసిన ప్రాంతాల్లోనూ రైతులు రెండు పంటలు సాగు చేస్తారు. కరవు, దుర్భిక్ష ప్రాంతానికి నెలవైన జనగామ ప్రాంతంలో మూడో పంటగా ఎడగారు సాగు చేయడం విశేషం. పలు మండలాల్లో ఎడగారు(కత్తెర) పంట సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. యాసంగి-వానాకాలం మధ్యలో వచ్చే సాగునే కత్తెర పంటగా పిలుస్తారు. మిగతా జిల్లాలతో పోలిస్తే జనగామలో ముందుగానే కోతలు అయి, నాట్లకు సిద్ధమవుతారు. బోర్లు, బావుల ఆధారితంగా నీటి వనరులు కల్గిన కర్షకులు ఆసక్తిని చూపుతున్నారు. మూడో పంటకు జిల్లాలో కల్గిన వనరులు, రైతుల అవసరార్థంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

చీడ, పీడల నుంచి విముక్తి..

సగటు, అంతకు తక్కువగానే వర్షపాతం నమోదయ్యే జనగామ ప్రాంతంలో గత అనేక ఏళ్లుగా అన్నదాతలు ఎడగారు సాగు చేస్తున్నారు. సాధారణంగా వానాకాలం సీజన్‌లో రైతులు జులై, ఆగస్టు మాసాల్లో వరి నాట్లు వేస్తారు. ఎడగారు పంట వేసుకునే వారు మే నెలలో వరి నార్లు సిద్ధం చేసుకొని మే చివరి, జూన్‌ మొదటి వారంలో నాట్లు వేసుకుంటారు. ఈ విధంగా సాగు చేసుకోవడం ద్వారా ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం లేకుండానే.. పంటకు చీడ, పీడలు వ్యాప్తి చెందకుండా ఉండటం, వరి గొలుసుకు ప్రతి గింజ తాలుపోకుండా నిండుగా, అధిక దిగుబడులు రావడంతో నీటి వసతులున్న వారు దీనిపై మక్కువ చూపిస్తారు. 

5-6 వేల ఎకరాల్లో వరి..

జిల్లాలోని జనగామ, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, బచ్చన్నపేట, లింగాలఘనపురం మండలాల్లో రైతులు అధికంగా ప్రతి యేటా సుమారుగా 5-6వేల ఎకరాల్లో వరిని పండిస్తున్నారు.


కత్తెర పంటతో అధిక దిగుబడులు.. 
- వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, జనగామ.

తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కత్తెర (ఎడగారు) నాట్లు వేస్తారు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ వంటి జిల్లాలో ఈ పంటను కొంత మేరకు సాగు చేస్తారు. దీని వల్ల రసాయనాల వాడకం తగ్గి, అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని