logo

రక్షకుడే.. కాటేస్తున్నాడు..!

కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖపై ప్రజలకు నమ్మకం పోతోంది. న్యాయం కోసం వెళ్లిన వారి వద్ద ముడుపులకు ఆశపడడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు మాయని మచ్చలా  మిగిలిపోతున్నాయి.

Updated : 13 Jun 2024 06:04 IST

న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం 

కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖపై ప్రజలకు నమ్మకం పోతోంది. న్యాయం కోసం వెళ్లిన వారి వద్ద ముడుపులకు ఆశపడడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు మాయని మచ్చలా  మిగిలిపోతున్నాయి.  ఇతర శాఖలతో పోల్చితే పోలీసు ఉద్యోగం భిన్నంగా ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన వీరు కట్టు తప్పుతున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే నిందితులుగా మారుతున్నారు. 


‘ఇటీవల హనుమకొండలో ఓ యువకుడిపై మగ్గురు కానిస్టేబుళ్లు దాడిచేసి గాయపర్చారు. ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం కేసు నమోదు, తాజాగా ఓ సీఐ మహిళతో అతిథిగృహంలో దొరికిపోవడం వంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. ఇలా వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే ఉంటున్నాయి.’


ప్రజలకు నమ్మకం కలిగించాలి.. 

పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం పెరగాలని ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ తరహా ఘటనలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటున్నారు. వీరి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు సమావేశాల్లో పోలీసు ఉన్నతాధికారుల హిత బోధనలను  ఠాణాల్లో పనిచేసే అధికారులు పట్టించుకోవడంలేదు. ఇటువంటి ఘటనలు ఇక ముందు జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


జరిగిన ఘటనలు.. 

  • మూడు నెలల నాడు కేయూ ఠాణాలో ఎస్సైగా పనిచేసి ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన పోలీసు అధికారి ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు  ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
  • తాజాగా ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి కేయూ ఠాణా పరిధిలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో మహిళతో ఉండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 
  • ఆరు నెలల కిందట కేయూ ఠాణాలో పనిచేసిన ఓ ఎస్సై మరో ప్రభుత్వ శాఖలో ఉద్యోగిని వేధించాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఎస్సైని మరో చోటుకు బదిలీ చేశారు. 
  • గత ఏడాది జనవరిలో మామునూరు డివిజన్‌లో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ పరకాల పోలీసు డివిజన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమె భర్త పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సస్పెన్షన్‌ వేటు పడింది. 

ఎస్‌ఐబీ సీఐపై కొనసాగుతున్న విచారణ 

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ విభాగం (ఎస్‌ఐబీ) సీఐపై బుధవారం కూడా విచారణ కొనసాగింది. ఓ మహిళతో ఉన్నట్లు గుర్తించి ఆయనను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని అర్ధరాత్రి వరకు అక్కడే విచారించిన పోలీసులు ఆ తర్వాత ఆయనను వదలి వేశారు. ఈ ఘటనపై బుధవారం సాయంత్రం వరకు కూడా స్పెషల్‌ బ్రాంచి పోలీసులతో పాటు కేయూ పోలీసులు రహస్య విచారణ నిర్వహించారు. సదరు యువతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి,.. గతంలో ఈయన ప్రవర్తన ఎలా ఉంది తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పోలీసులు మంగళవారం జరిపిన విచారణను వరంగల్‌ నగర పోలీసు కమిషనర్‌కు నివేదించారు. రాష్ట్రవాప్తంగా ఈ ఘటన పెద్ద చర్చానీయాంశంగా మారడంతో శాఖాపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంలో పోలీసు బాసు ఉన్నట్లు తెలిసింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని