logo

ఆర్టీసీ బస్సుకు అడ్డం తిరిగిన మహిళా ప్రయాణికురాలు

ఆర్టీసీ బస్సులో ఎక్కే వరకు ఆగకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు వాహనానికి అడ్డం తిరిగి ఆందోళన చేశారు. ఈ ఘటన బుధవారం వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 13 Jun 2024 06:02 IST

దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించుకోలేదని ఆగ్రహం

బస్సు ముందు కూర్చొని నిరసన తెలుపుతున్న మహిళ

శివనగర్‌(వరంగల్‌), న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ఎక్కే వరకు ఆగకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు వాహనానికి అడ్డం తిరిగి ఆందోళన చేశారు. ఈ ఘటన బుధవారం వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల ముగ్గురు పిల్లలతో కలసి జగిత్యాల జిల్లా కొండగట్టులో ఉంటున్నారు. బుధవారం పిల్లలతో కలిసి వరంగల్‌కు వచ్చారు. వరంగల్‌ బస్టాండ్‌ నుంచి నెక్కొండ- మహబూబాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి సిద్ధమయ్యారు. ముందుగా తన ఇద్దరు కుమార్తెలను సామగ్రితో సహా బస్సెక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించడానికి కిందకు దిగారు. అప్పటికే బస్సు నిండిపోయి.. ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఈక్రమంలో దివ్యాంగుడైన కుమారుడిని బస్సు ఎక్కించడానికి తీసుకురాగా.. ‘బస్సులో ఖాళీ లేదు.. మరో బస్సులో రావాలని’ కండక్టర్‌ సూచించారు. అప్పటికే బస్సులో ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్న విషయం తెలియని కండక్టర్‌ సూచన మేరకు చోదకుడు ముందుకు పోనిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు కొంతదూరం బస్సు వెనకాల పరుగెత్తారు. చివరకు ఓ ఆటో తీసుకొని వెళ్లి శివనగర్‌ అండర్‌బ్రిడ్జి ఎస్‌బీఐ దగ్గర బస్సుకు అడ్డం తిరిగారు. రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. తన ఇద్దరు పిల్లలు బస్సులో ఉండగా, దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించుకోకుండా ఎలా వెళతారని బస్సు చోదకుడు, కండక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు అరగంటకు పైగా బస్సు ముందుకు కదలకుండా అడ్డుకోవడంతో.. ప్రయాణికులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మీ కుమారుడిని ఆటోలో తీసుకొస్తే కలిసి వెళ్దామని చెప్పినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆటో ఛార్జీలు ఎవరిస్తారని ప్రశ్నిస్తూ బస్సును తిరిగి బస్టాండ్‌కు తీసుకెళ్లి... తన కుమారుడిని ఎక్కించుకొని రావాలని పట్టుబట్టింది. ఈలోగా ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళా ప్రయాణికురాలిని పక్కకు తీసుకెళ్లి శాంతింపజేశారు. ఆగిన బస్సును పంపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని