logo

పనులు ముందుకు సాగేనా..?

వరుసగా ఎన్నికలు రావడంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. అవసరాలున్నా.. పనులు చేయని పరిస్థితి నెలకొంది. చెరువులు, కుంటలు, రహదారులు, తదితర పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి.

Published : 13 Jun 2024 05:37 IST

ములుగు, న్యూస్‌టుడే: వరుసగా ఎన్నికలు రావడంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. అవసరాలున్నా.. పనులు చేయని పరిస్థితి నెలకొంది. చెరువులు, కుంటలు, రహదారులు, తదితర పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఎన్నికల కోడ్‌ కారణంగా నాలుగు నెలలుగా నిధులు మంజూరు జరగలేదు. పనులు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. గతేడాది డిసెంబరులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అనేక పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో.. చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో అత్యవసరంగా చేయాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాల్సిన అవ సరం ఉంది. 

శిథిలావస్థలో లోకం చెరువు తూము

ములుగు సమీపంలోని లోకం చెరువు మరమ్మతులకు నీటి పారుదల శాఖ అధికారులు సుమారు రూ.6.75 లక్షల నిధుల కోసం ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల కోడ్‌ కారణంగా నిధులు విడుదల కాలేదు. ఈ చెరువు కింద సుమారు 1,347 ఎకరాల ఆయకట్టు ఉంది. తూము లీకేజీతో తటాకంలోని నీరంతా వృథాగా పోతోంది. మత్తడి పరిస్థితి కూడా శిథిలావస్థలో ఉంది. వీటికి త్వరితగతిన మరమ్మతులు చేస్తేనే పంటలకు నీరందుతుంది. జిల్లాలో మరో 29 చెరువుల మరమ్మతులకు అవసరమయ్యే నిధుల మంజూరుకు ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల కోడ్‌తో వాటికి నిధులు రాలేదు.


ఆదిలోనే అటకెక్కిన ప్రగతి 

ప్రారంభానికి నోచుకోని చొక్కాల-గోదావరిపాయకు వెళ్లే దారి  

వెంకటాపురం మండలంలో ప్రగతి పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గత ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేసినా.. ఎన్నికల కోడ్‌ ఆంక్షలతో నిర్మాణాలకు నోచుకోని దుస్థితి నెలకొంది. ఎస్‌డీసీ పథకంలో భాగంగా చొక్కాల-గోదావరిపాయకు వెళ్లే మార్గంను ఆధునీకరించేందుకు రూ.60 లక్షలు, బెస్తగూడెంలో వైకుంఠధామానికి వెళ్లే దారి నిర్మాణానికి రూ.18 లక్షలు, లక్ష్మీనగరం ఆర్‌అండ్‌బీ మార్గం నుంచి పాతమరికాల వరకు గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటుకు రూ.32 లక్షలు, వెంకటాపురం పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ కోసం రూ.కోటి, మండల కేంద్రంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేస్తూ.. గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. టెండరుకు పీఆర్‌ ఇంజినీరింగ్‌ విభాగం సిద్ధమయ్యేలోగా కోడ్‌ అమల్లోకి రావడంతో అర్ధాంతరంగా నిలిచింది.

న్యూస్‌టుడే, వెంకటాపురం


నిలిచిపోయిన మినీ స్టేడియం నిర్మాణం 

ములుగు పట్టణంలో మినీ స్టేడియం నిర్మాణానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ రూ.2.65 కోట్లు మంజూరయ్యాయి. టెండరు దక్కించుకున్న గుత్తేదారు సుమారు 35 శాతం పనులు చేశారు. ఇప్పటివరకు రూపాయి చెల్లించకపోవడంతో పనులు నిలిపివేశారు. సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు బిల్లుల చెల్లింపునకు ప్రక్రియ సిద్ధం చేసినప్పటికీ.. నిధులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 


పిల్లర్ల స్థాయిలోనే వారధి 

ఏటూరునాగారం మండలంలోని బూటారం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే దారిలోని మాటొర్రెపై రూ.4 కోట్లతో వారధి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో.. పనులను పిల్లర్ల స్థాయికి పూర్తి చేసి నిలిపివేశారు. మార్చి నెలలో రూ.50 లక్షల కోసం బిల్లు ప్రతిపాదిస్తే ఇంత వరకు రాలేదని ఆర్‌అండ్‌బీ డీ…ఈఈ రఘువీర్‌ తెలిపారు.

న్యూస్‌టుడే, ఏటూరునాగారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని