logo

అదనంగా ఐదు డయాలసిస్‌ పరికరాలు

జిల్లాలో మూత్రపిండాల వ్యాధితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ రక్తశుద్ధి చేయాల్సిన అవసరం ఉన్న డయాలసిస్‌ రోగులు ఇక నుంచి ఇతర ప్రాంతాలకు పరుగులెత్తాల్సిన అవసరం లేదు.

Published : 13 Jun 2024 05:39 IST

మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న రోగులు

మహబూబాబాద్, న్యూస్‌టుడే: జిల్లాలో మూత్రపిండాల వ్యాధితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ రక్తశుద్ధి చేయాల్సిన అవసరం ఉన్న డయాలసిస్‌ రోగులు ఇక నుంచి ఇతర ప్రాంతాలకు పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఈ ఆసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రంలో నమోదవుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండడంతో గతంలో ఉన్న ఐదు రక్తశుద్ధి పరికరాలతో డయాలసిస్‌ సేవలు అందక పలువురు రోగులు వివిధ దూర ప్రాంతాలకు వెళుతూ వ్యయ, ప్రయాసలకు గురవుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి అదనంగా ఐదు డయాలసిస్‌ పరికరాలను మంజూరు చేసింది. పేద వర్గాలకు వరంగా మారనుంది.

ప్రైవేట్‌ సంస్థ భాగస్వామ్యంతో..

గత ప్రభుత్వం 2018లో ప్రైవేట్‌ సంస్థ భాగస్వామ్యంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు యంత్రాలను నెలకొల్పి ఉచితంగా డయాలిసిస్‌ సేవలు ప్రారంభించారు. మూడు షిప్టుల్లో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 50 మంది రోగులు సేవలు పొందుతున్నారు. మరో 40 మంది వరకు తమ పేర్లు నమోదు చేసుకొని వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. కొందరు రోగులకు వారానికి ఒకసారి మరికొందరికి రెండుసార్లు, ఇంకొందరికీ రోజు విడిచి రోజు డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. రోజు రోజుకు నమోదవుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండగా డయాలసిస్‌ మిషన్లు ఖాళీ లేక రోగులు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌ లాంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తోంది. దీంతో ఒక్కసారి వెళితే వాహనాల ఛార్జీలతో కలిసి ఒక్కో రోగికి రూ.ఐదు నుంచి రూ.10 వేల వరకు ఖర్చువస్తోంది. ప్రతి నెల వేలల్లో ఖర్చు చేయలేక అనేక మంది రోగులు అప్పుల పాలవుతూ ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలపై ‘న్యూస్‌టుడే’ గతేడాది డిసెంబర్‌ నెలలో ‘పరికరాలు లేక పట్టణాలకు పరుగు’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వైద్యుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అదనంగా ఐదు డయాలసిస్‌ పరికరాల మంజూరు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఐదు పరికరాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. 

భవన సదుపాయం కల్పించాలి

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఇప్పటికే వివిధ విభాగాల ఏర్పాటుతో భవనాల కొరత ఉంది.  ప్రసుత్తం అదనంగా మంజూరైన ఐదు డయాలసిస్‌ పరికరాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు భవన సదుపాయం కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న డయాలసిస్‌ కేంద్రం ప్రవేశమార్గంలోని వరండాలో అత్యవసర సేవలను అందిస్తున్నారు. దాని పక్కనే ఎక్స్‌రే యంత్రం గది ఉంది.  వాటి కోసం ప్రత్యేక భవనం నిర్మాణం చేసి అత్యవసర రోగులకు అక్కడ వైద్య సేవలు అందిస్తూ ప్రస్తుత డయాలసిస్‌ కేంద్రాన్ని విస్తరించడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇందుకు ప్రజాప్రతినిధులు తమ సీడీపీ నుంచి నిధులను మంజూరు చేస్తే రోగులకు మేలు జరుగుతుంది.


స్థలాన్ని పరిశీలిస్తున్నాం
- డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

జనరల్‌ ఆసుపత్రిలో స్థలాభావం తీవ్రంగా ఉంది. డయాలసిస్‌ సేవలకు ఎక్కడ వసతి కల్పించాలనే విషయమై ఆలోచిస్తున్నాం. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలిస్తున్నాం. త్వరగా ఈ సమస్య పరిష్కారానికీ చర్యలు తీసుకుంటాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని