logo

వరద ముంపునకు శాశ్వత ప్రణాళిక

నగరం నీట మునగకుండా శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలి, వరంగల్‌ పోతనరోడ్‌ నుంచి రంగంపేట, ములుగురోడ్, అలంకార్‌ పెద్దమోరీ వరకు రూ.200 కోట్లతో కొత్తగా తయారు చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Published : 13 Jun 2024 05:48 IST

సమీక్షలో మంత్రి కొండా సురేఖ

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సురేఖ చిత్రంలో మేయర్‌ సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి, నాగరాజు, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, బల్దియా కమిషనర్‌ అశ్విని తానాజీ

కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరం నీట మునగకుండా శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలి, వరంగల్‌ పోతనరోడ్‌ నుంచి రంగంపేట, ములుగురోడ్, అలంకార్‌ పెద్దమోరీ వరకు రూ.200 కోట్లతో కొత్తగా తయారు చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు ఇప్పిస్తానని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో వరదలు, నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, హరితహారం, నగర సుందరీకరణ, ప్రధాన రహదారుల అభివృద్ధిపై మూడుగంటల పాటు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మేయర్‌ గుండు సుధారాణి, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, సంధ్యారాణి, మున్సిపల్, ‘కుడా’, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్, ఇరిగేషన్, టీఎన్పీడీసీఎల్, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.

  • ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. యువ కలెక్టర్లు, ఐఏఎస్‌ అధికారులున్నారు, వారి సలహాలు, సూచనలతో ఈసారి నగరం ముంపునకు గురి కాకుండా చూడాలన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వల్ల ముఖ్యమైన పనులు చేయలేకపోయామని, ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతేడాది వరదలతో భారీ నష్టం వాటిల్లిందని, ఈసారి అలా జరగకుండా చూడాలని మంత్రి కోరారు. శివారు ప్రాంతాల నుంచి వచ్చే వరద నగరంలోకి రాకుండా మళ్లించేందుకు ఇరిగేషన్‌ శాఖ తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు. రూ.158 కోట్లతో ప్రతిపాదించిన బొందివాగు నాలా పనులు ప్రారంభించాలని, నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
  • ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. విలీన గ్రామాల్లోని కీర్తినగర్, గరీబ్‌నగర్‌ తాగునీటి పైపులైన్లు పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉందని, వీధిదీపాల నిర్వహణ సరిగాలేదన్నారు. గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు.

పచ్చదనం తక్కువగా ఉంది

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పచ్చదనం తక్కువగా ఉందని, ఈసారి అటవీశాఖ నర్సరీల నుంచి 3.50 లక్షల మొక్కలు పంపిణీ చేస్తామని మంత్రి సురేఖ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 217 కిలో మీటర్ల పరిధిలోని ప్రధాన, అంతర్గత రహదారుల్లో మొక్కలు నాటుతామన్నారు.

కమిషనర్‌ దృశ్యరూప ప్రదర్శన

గతంలో వచ్చిన వరదలు, నష్టాలు, వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రధాన నాలాలు, వరదనీటి కాలువల నిర్మాణం, గుర్తించిన లోతట్టు ప్రాంతాలు, ముందస్తుగా తీసుకున్న చర్యలు, పనులపై కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే దృశ్యరూప ప్రదర్శన ద్వారా వివరించారు. గంటపాటు సమస్యలు, సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళిక గురించి తెలియజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని